బ్రిటన్ రాజకుటుంబ కథనాలంటే ఇప్పటికీ ఆసక్తికరమే. పైగా ప్రిన్స్ హ్యారీ దూకుడుగా వెలువరించిన ‘స్పేర్’ చదవడానికి మరింత ఆకర్షణీయం. తల్లి డయానా నాటకీయ మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్నీ, తానొక ‘స్పేర్’గా ఊరికే అలా పక్కనుండాల్సిన స్థితినీ రాశాడు. అలాగే అనేక ఇబ్బందికర విషయాలను పంచుకున్నాడు. అయితే కోహినూర్ వజ్రం గురించిన హ్యారీ ఆలోచనలు మాత్రం భారతీయులకు సంతోషం కలిగిస్తాయి.
బ్రిటన్ రాకుమారుడు హ్యారీ రాసిన ‘స్పేర్’ పుస్తకం చదివినప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనబడేది దాన్ని రాసిన విధానమే. శైలి బిగువుగా, ఉద్రిక్తభరితంగా, ఒక్కోసారి అసంగతంగానూ ఉంటుంది. చెప్పాలంటే ఒక థ్రిల్లర్‌లా ఉంటుంది. కాబట్టే ఇది చదవడానికి ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులోని భాషలో లోతు తక్కువ. విషయం వదులుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈటన్ స్కూల్, అఫ్గానిస్తాన్‌లలో హ్యారీ గడిపిన సమయాల గురించి వివ రిస్తున్నప్పుడు పైపైన సాగుతుంది. అప్పుడు నిస్సారంగా ఉండి, చికాకు కలిగిస్తుంది కూడా.
తప్పనిసరిగా కనబడేవి మరో రెండు అంశాలు. తన తల్లి (డయానా) నాటకీయ మరణం కలిగించిన వేదన నుంచి హ్యారీ బయటపడలేదు. ఈ పుస్తకం మొత్తంగా ఇదే మానసిక స్థితి కొన సాగు తుంటుంది. అయితే ఇది అర్థం చేసుకోదగినదే. అర్థం కానిదల్లా ఏమి టంటే, తానొక ‘స్పేర్’(అలా పక్కన అందుబాటులో ఉండటం)గా ఉండాల్సిన వాస్తవం గురించి ఇంకా సమాధాన పడక పోవడమే. 38 సంవత్సరాల వయస్సులో కూడా ఏ హోదా లేదు. తన సోదరుడు విలి యమ్‌తో బాంధవ్యంపై ఇది స్పష్టమైన ప్రభావం చూపుతూ వచ్చింది. ఈ కారణంగానే స్కూల్‌లో విల్లీ (విలియమ్‌ను హ్యారీ ఇలాగే పిలు స్తాడు) తన పట్ల పట్టనట్టుగా ఉన్నాడని హ్యారీ నమ్మకం.
పుస్తకంలోని మూడో అంశం ఏమిటంటే – రాజ కుటుంబానికీ, వెంటాడే ఫొటోగ్రాఫర్లకూ (పాపరాజ్జీ) మధ్య సాగిన అంతులేని పోరాటం. ‘‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, ఎప్పుడూ వివరణ ఇవ్వ వద్దు’’ అనేది రాజ కుటుంబ నినాదంగా ఉండేది. హ్యారీ ఈ విషయంలో ఒకడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తుంది. పబ్‌లో రాత్రంతా గడిపిన తర్వాత తన కారు డిక్కీలో దాక్కునే వాడినని చెప్పాడు. డయానా కూడా అలాగే చేసివుంటుందని హ్యారీ అంటాడు. ఈ పుస్తకం చాలా విషయాలను వెల్లడిస్తుంది. వాటిలో చాలా వరకు తీవ్రమైనవి, కొన్ని మనోహరమైనవి. బాక్సర్ షార్ట్స్‌లో శీర్షాస నాలు వేసే అతడి తండ్రి, బ్రిటన్ రాజు చార్లెస్ ‘డార్లింగ్ బాయ్’ అని హ్యారీని పిలుస్తారు. ఇక విలియమ్ అతడిని ‘హెరాల్డ్’ అంటాడు. కానీ అలా ఎందుకంటాడో పుస్తకంలో ఎక్కడా ఉండదు. అయితే, ‘‘నాతో వ్యవహరించినప్పుడల్లా ఏ మార్పూ లేకుండా’’ అదే ‘‘సుపరి చితభ్రుకుటి’’ అని మాత్రం చెబుతాడు. ఇక బాల్మోరల్ రాజమందిరంలో పిల్లలుగా ఉన్నప్పుడు, క్వీన్ విక్టోరియా విగ్రహాన్ని ఎప్పుడు దాటు కుని వెళ్లినా వారు ప్రతిసారీ వంగి నమస్కరించేవారు.
ఈ పుస్తకంలోని చాలా వివరాలు అనవసరం. పైగా అవి ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటన్నింటినీ హ్యారీ ఎందుకు పంచు కున్నాడని మీరు ఆశ్చర్యపడతారు కూడా. ఉదాహరణకు, హ్యారీ తనకు తడి అయిందనీ (స్ఖలనం), దాన్ని దాచిపెట్టడానికి సముద్రంలోకి దూకేశాననీ చెబుతాడు. మేగన్ మెర్కెల్‌తో తన తొలి డేట్‌కు కొద్ది గంటల ముందు అలా జరిగింది. రాజకుటుంబీకులు, వారి స్కాటిష్ సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని అనిపించే ఒక కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. హ్యారీ తొలిసారి ఒక మగజింకను కాల్చినప్పుడు అతడి గైడ్ అయిన శాండీ ఆ మృతకళేబరపు చర్మాన్ని చీల్చి, యువరాజు హ్యారీని మోకాళ్లపై కూర్చో బెట్టి, అతడి తలను అందులోకి దూర్చాడట. ‘‘దీంతో ఉదయం నేను తిన్న ఫలహారం కడుపులోంచి బయటకు వచ్చేసింది’’ అని హ్యారీ రాస్తాడు. ‘‘నేను దేన్నీ వాసన పీల్చలేకపోయాను. ఎందుకంటే నేను శ్వాస పీల్చలేకపోయాను’’ అని చెబుతాడు. ‘‘నా నోరు, ముక్కు పూర్తిగా రక్తంతో, పేగులతో నిండిపోయాయి. ఒక తీవ్రమైన అసౌక ర్యపు వెచ్చదనం’’ అని చెబుతాడు. ఈ ఆచారం ముగియగానే, హ్యారీ ముఖంపై పడిన జింక రక్తాన్ని తుడవవద్దని శాండీ చెప్పాడట. ‘‘దాన్ని అలాగే ఎండిపోనీ, కుర్రాడా, అలాగే ఎండిపోనీ!’’ అన్నాడట.
బ్రిటిష్ రాజకుటుంబంలో ఇద్దరు సభ్యులను హ్యారీ అంగీకరించలేకపోయాడు. ఒకరు మార్గరెట్ (ఎలిజబెత్ రాణి చెల్లెలు). ఆమెను అతడు ఆంట్ మార్గో అని పిలుస్తాడు. ఒకసారి ఆమె క్రిస్‌మస్‌కు మామూలు బాల్‌పాయింట్ పెన్ ఇచ్చిందట. అయినా వాళ్లిద్దరూ కలిసి సాగాల్సి వుంది. ఎందుకంటే, హ్యారీ నొక్కిచెప్పినట్టుగా ఆమె కూడా తనలాగే ఒక స్పేర్. ఇక హ్యారీ అంగీకరించని మరొకరు కెమిల్లా. ఆమెను పెళ్లాడవద్దని హ్యారీ, విలియమ్ ఇద్దరూ తమ తండ్రి చార్లెస్‌కి చెప్పారు. ఆమెను ‘ప్రమాదకారి’గా హ్యారీ పరిగణిస్తాడు. తన ఇమేజ్‌ను పెంచుకునే క్రమంలో ఆమె మీడియాకు పలు కథనాలు బహిర్గతం చేశారంటాడు.
రెండు విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ పుస్తకంలో దోడీ ఫయీద్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అతడిని హ్యారీ అంతటా ‘మమ్మీ బాయ్‌ఫ్రెండ్’ అనే రాశాడు. ఇంకా తనకు ‘పాకీ’ అంటే జాతి వివక్షా పదమనీ, అవమానించినట్టనీ తెలియదని పేర్కొన్నాడు. అంతిమంగా, గూర్ఖాల పట్ల హ్యారీకి ఉన్న ఆత్మీయతకు భార తీయ పాఠకులు సంతోషపడతారు. లెఫ్టినెంట్ వేల్స్ అని హ్యారీని సంబోధించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎల్లప్పుడూ ‘సాబ్’ అనేవారు. ‘‘రాజరికం పట్ల వాళ్లకు గంభీరమైన పూజ్యభావం ఉంది. వారి దృష్టిలో రాజు అంటే దైవం. కాబట్టి రాజకుమారుడు కూడా దైవా నికి మరీ దూరం కాదు’’. ఇక కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కలిగివుండటంలోని న్యాయ సమ్మతిని హ్యారీ ప్రశ్నించడం మన ప్రభుత్వానికి సంతోషం కలిగించే విషయం. ‘‘బ్రిటిష్ సామ్రాజ్యం తన ఉచ్చదశలో దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకో ఆలోచన, దొంగిలించింది’’ అని అంటూ ఇలా కొన సాగిస్తాడు. ‘‘అది శాపగ్రస్తమైందని నేను విన్నాను.’’
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment