అలా వెళ్లిపోయావేం... ఏచూరీ! | Sakshi Guest Column On Sitaram Yechury | Sakshi
Sakshi News home page

అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!

Published Fri, Sep 13 2024 12:58 AM | Last Updated on Fri, Sep 13 2024 8:42 AM

Sakshi Guest Column On Sitaram Yechury

అలా వెళ్లిపోయావేం ఏచూరీ, ఆఖరి ఆశలు కూడా వమ్ముచేసి. తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపలేకపోతోంది మా భౌతికవాద చైతన్యం...         

సమకాలీన భారత రాజకీయ రంగంలో అరుదైన ఆణిముత్యం సీతారాం ఏచూరి. పదహారణాల సంప్రదాయ తెలుగు కుటుంబంలో అత్యున్నత విద్యావంతుల ముద్దుబిడ్డగా పుట్టారు. తండ్రి ఎఎస్‌ సోమయాజులు అధికారి, తల్లి కల్పకం ఉద్యోగిని (కాకినాడలో సామాజిక కార్యక్రమాలకు కన్నతల్లి లాంటి ఆమె మూడేళ్ళ క్రితం కన్నుమూశారు.) మేనమామ ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన మోహన్‌ కందా కాగా మిగిలిన వారిలోనూ ఐఏఎస్‌లే ఎక్కువ. 

చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలలో మిన్న అయిన ఏచూరి కూడా అదే మార్గంలో నడుస్తాడనుకున్నారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో చదువుతుండగా తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడే చదువుతూ 1970లో సీబీఎస్‌ఈ 12వ క్లాసులో అఖిల భారత స్థాయిలో ప్రథముడుగా వచ్చారు. అమెరికా పర్యటించే అవకాశం దక్కించుకున్నారు. సెంట్‌ స్టీఫె¯Œ ్స కాలేజీలో ఎకనామిక్స్‌లో పట్టభద్రుడై ప్రతిష్ఠాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు. 

1974లో అక్కడే ఆయనకు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ప్రకాశ్‌ కరత్‌తో పరిచయమైంది. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి అర్థశాస్త్రంలో అపారమైన ఆసక్తితో పరిశోధన చేయాలనుకున్నా ఎమర్జెన్సీలో అరెస్టయ్యారు. రెండేళ్లలో మూడుసార్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్‌ హోదాలో ఉండగా, ఆమె నివాసానికి ప్రదర్శనగా వెళ్ళి, ఆమెను నిలబెట్టి అభియోగ పత్రం చదవడమే గాక, ఛాన్సలర్‌గా వుండటం తగదని మొహం మీదనే చెప్పేశారు. మొదట ఆశ్చర్యానికి గురైన ఆమె తర్వాత నిజంగానే ఆ బాధ్యత నుంచి వైదొలగారు. యాభై ఏళ్లపాటు ఏచూరి సాగించబోయే నిబద్ధ, నిశ్చల రాజకీయ ప్రస్థానానికి అది నాందీ ప్రస్తావన.

ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఏచూరి 1984 నుంచి 1986లో విజయవాడలో జరిగిన అఖిల భారత మహాసభల దాకా కొనసాగారు. 1985లోనే కలకత్తాలో జరిగిన సీపీఎం మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యుడైనాడు. నంబూద్రిపాద్, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య వంటి సీనియర్‌ నాయకులు ఉద్యమాన్ని సమర్థంగా కొనసాగించడం కోసం వ్యూహాత్మకంగానే ఏచూరి, కరత్‌ వంటి యువనాయకులకు తర్ఫీదునిచ్చారు. తెలుగువాడిగా మాకినేనితోనూ, జాతీయ రాజకీ యాల్లో సూర్జిత్‌తోనూ సీతారాం సన్నిహితంగా మెలు గుతూ ఆచరణాత్మక విషయాలూ ఆకళింపు చేసు కున్నారు. 

1988లో సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన ఏచూరి, 1989లో  నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడినప్పుడు సూర్జిత్‌తో పాటు ఆ పరిణామాలలో కీలక పాత్ర వహించారు. 1991లో సోషలిస్టు సోవియట్‌ విచ్ఛిన్నం పెద్ద ఎదురుదెబ్బగా మారిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వుండదనుకునేవారికి కను విప్పు కలిగేలా భారత దేశంలో మూడు రాష్ట్రాలలో సీపీఎం, వామపక్షాలు గెలుపొందాయి. 1992లో మద్రాసులో జరిగిన సీపీఎం మహాసభలో ఈ సైద్ధాంతిక పరిణామాలపై తీర్మానం ఏచూరి ప్రవేశపెట్టడం, సమాధానమివ్వడం ఆయన ఎదుగుదలకు అద్దం పట్టాయి. అప్పుడే పొలిట్‌ బ్యూరోలో ప్రవేశించారు.

1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏచూరి కీలకపాత్ర వహించారు. అనేక ప్రామాణిక రచనలు వెలువరించారు. దేవెగౌడ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ కాలానికి సూర్జిత్, జ్యోతిబసు, చంద్రబాబు, వీపీ సింగ్‌ వంటివారితో పాటు సీతారాం ఏచూరి కూడా ఒక కీలక పాత్రధారిగా రూపొందారు. 

ఇదే కాలంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడుగా సీపీఎం పత్రాల విధానాల రూపకల్పనలో తనదైన ముద్ర వేస్తూ, ఉపన్యాసకుడుగా వాటిని దేశమంతటా ప్రజలకూ పార్టీ శ్రేణులకూ వివరిస్తూ సవ్యసాచిలా పనిచేశారు. ఆ క్రమంలోనే 2004లో యూపీఏ ఏర్పాటు, కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరెడ్డి వంటివారు కూడా ఆ రోజులలో ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయనతో ప్రత్యేకంగా చర్చించేవారు.

వామపక్ష ఐక్యతలో భాగంగా సోదర పార్టీలతోనూ, లౌకిక పార్టీలతోనూ సంప్రదింపులు జరపడంలో ఏచూరి పట్టువిడుపులకు పేరు పొందారు. ఆ విషయంలో అక్షరాలా సూర్జిత్‌ వారసుడనే చెప్పాలి. అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి బీజేపీ నేతలు కూడా ఏచూరి ప్రత్యేకతను చెప్పకుండా వుండలేరు. అదే సమయంలో అపారమైన అధ్యయనం, అర్థశాస్త్రంలో పట్టు, ఆధునిక పరిణామాల అవగాహన ఆయనకు రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. జాతీయంగా ఇంత ఉన్నత స్థాయిలో వ్యవహరించే ఏచూరి సామాన్య కార్యకర్తలతో, ప్రత్యేకంగా యువతతో అలవోకగా కలసిపోయేవారు. ఎక్కడైనా ఏచూరి ప్రవేశించడమే ఏదో ఒక ఛలోక్తితో జరిగేది.

సామాజిక న్యాయం, సాంస్కృతిక రంగాల్లో సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంబేడ్కర్‌ మాటలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావించకుండా మాట్లాడేవారు కాదు. మీడియా మిత్రుడిగా టీవీ డిబేట్లలో కీలకంగా కనిపించిన కొందరు తొలి నేతలలో ఆయనొకరు. సీపీఎం అధికార పత్రిక ‘పీపుల్స్‌ డెమోక్రసీ’కి ఇరవయ్యేళ్లు సంపాదకులుగా వున్నారు. పుష్కరకాలం రాజ్యసభ సభ్యుడిగా వున్న ఏచూరి ప్రసంగాలంటే పాలక పక్షానికి పరీక్షలే. తను ఎదిగిన జేఎన్‌యూపై 2019లో రాజ్యసభలో చర్చ జరిగినపుడు నాటి మంత్రి స్మృతీ ఇరానీకి షేక్‌స్పియర్‌ భాషలో ఆయన సమాధానమిచ్చిన తీరు మర్చిపోలేనిది. 

అందుకే ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు కూడా వచ్చింది. ఆయన రచనలు, ప్రసంగాలు అనేకం పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. ‘ప్రపంచీకరణ యుగంలో సోషలిజం’, ‘ప్రపంచీకరణలో అర్థశాస్త్రం’, ‘హిందూరాష్ట్ర’, ‘లౌకికతత్వం అంటే ఏమిటి?’ వంటివి  ప్రత్యర్థి పార్టీల వ్యూహాల లోతుపాతులు తెలియాలంటే చదవాల్సిందే. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఏచూరి కీలక పాత్రధారిగా మెలిగారు. 

ఒక దశలో భారత దేశంలో ఐక్యతా ప్రయత్నాల లాగే నేపాల్‌లోనూ కమ్యూనిస్టు గ్రూపులను ఒక వేదిక మీదకు తేవడానికి దోహదం చేశారు. అనేక కారణాల వల్ల వామపక్షాల బలం తగ్గుతున్న పరిస్థితులలో రాజకీయ పోరాటాలలోనూ, ఎన్నికలలోనూ లౌకిక శక్తులను పునరేకీకరణ చేయడానికి సహేతుక ప్రాతిపదిక ఏర్పరచడానికి ఆయన నిరంతరం పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ‘ఇండియా’ వేదిక ఏర్పాటు, లోక్‌సభ బలాల పొందిక మార్పు వెనక ఈ కృషి వుంది.

బెంగాలీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వంటి బహు భాషల్లో ధారాళంగా మాట్లాడే ఏచూరి తెలుగు బిడ్డగా తెలుగువారికి మరింత ప్రేమపాత్రులైనారు. ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడలేనంటూ మొదలుపెట్టినా అదో ప్రత్యేకమైన మంచి భాష మాట్లాడేవారు. మన రక్తం ఎర్రగా వున్నంతవరకూ ఎర్రజెండా ఎగురుతుంటుందని ఆయన అనే మాటతో చప్పట్లు మోగిపోయేవి. తెలుగు పాటలు కూడా ఇష్టపడేవారు. 

శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆయన కేతు విశ్వనాథరెడ్డి పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం నాకింకా గుర్తుంది. 1980లో ఎస్‌ఎఫ్‌ఐ మహాసభల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం తెలుగువారికి గర్వకారణమే. ఆయన తన కోసం ఏమీ కోరుకోలేదు. తీసుకుపోలేదు. ఆశయాల బాట మిగిల్చివెళ్లారు.


తెలకపల్లి రవి 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement