telakapally ravi
-
అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!
అలా వెళ్లిపోయావేం ఏచూరీ, ఆఖరి ఆశలు కూడా వమ్ముచేసి. తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపలేకపోతోంది మా భౌతికవాద చైతన్యం... సమకాలీన భారత రాజకీయ రంగంలో అరుదైన ఆణిముత్యం సీతారాం ఏచూరి. పదహారణాల సంప్రదాయ తెలుగు కుటుంబంలో అత్యున్నత విద్యావంతుల ముద్దుబిడ్డగా పుట్టారు. తండ్రి ఎఎస్ సోమయాజులు అధికారి, తల్లి కల్పకం ఉద్యోగిని (కాకినాడలో సామాజిక కార్యక్రమాలకు కన్నతల్లి లాంటి ఆమె మూడేళ్ళ క్రితం కన్నుమూశారు.) మేనమామ ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన మోహన్ కందా కాగా మిగిలిన వారిలోనూ ఐఏఎస్‌లే ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలలో మిన్న అయిన ఏచూరి కూడా అదే మార్గంలో నడుస్తాడనుకున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుతుండగా తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడే చదువుతూ 1970లో సీబీఎస్ఈ 12వ క్లాసులో అఖిల భారత స్థాయిలో ప్రథముడుగా వచ్చారు. అమెరికా పర్యటించే అవకాశం దక్కించుకున్నారు. సెంట్ స్టీఫె¯Œ ్స కాలేజీలో ఎకనామిక్స్‌లో పట్టభద్రుడై ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు. 1974లో అక్కడే ఆయనకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ప్రకాశ్ కరత్‌తో పరిచయమైంది. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి అర్థశాస్త్రంలో అపారమైన ఆసక్తితో పరిశోధన చేయాలనుకున్నా ఎమర్జెన్సీలో అరెస్టయ్యారు. రెండేళ్లలో మూడుసార్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్ హోదాలో ఉండగా, ఆమె నివాసానికి ప్రదర్శనగా వెళ్ళి, ఆమెను నిలబెట్టి అభియోగ పత్రం చదవడమే గాక, ఛాన్సలర్‌గా వుండటం తగదని మొహం మీదనే చెప్పేశారు. మొదట ఆశ్చర్యానికి గురైన ఆమె తర్వాత నిజంగానే ఆ బాధ్యత నుంచి వైదొలగారు. యాభై ఏళ్లపాటు ఏచూరి సాగించబోయే నిబద్ధ, నిశ్చల రాజకీయ ప్రస్థానానికి అది నాందీ ప్రస్తావన.ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఏచూరి 1984 నుంచి 1986లో విజయవాడలో జరిగిన అఖిల భారత మహాసభల దాకా కొనసాగారు. 1985లోనే కలకత్తాలో జరిగిన సీపీఎం మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యుడైనాడు. నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య వంటి సీనియర్ నాయకులు ఉద్యమాన్ని సమర్థంగా కొనసాగించడం కోసం వ్యూహాత్మకంగానే ఏచూరి, కరత్ వంటి యువనాయకులకు తర్ఫీదునిచ్చారు. తెలుగువాడిగా మాకినేనితోనూ, జాతీయ రాజకీ యాల్లో సూర్జిత్తోనూ సీతారాం సన్నిహితంగా మెలు గుతూ ఆచరణాత్మక విషయాలూ ఆకళింపు చేసు కున్నారు. 1988లో సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన ఏచూరి, 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు సూర్జిత్తో పాటు ఆ పరిణామాలలో కీలక పాత్ర వహించారు. 1991లో సోషలిస్టు సోవియట్ విచ్ఛిన్నం పెద్ద ఎదురుదెబ్బగా మారిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వుండదనుకునేవారికి కను విప్పు కలిగేలా భారత దేశంలో మూడు రాష్ట్రాలలో సీపీఎం, వామపక్షాలు గెలుపొందాయి. 1992లో మద్రాసులో జరిగిన సీపీఎం మహాసభలో ఈ సైద్ధాంతిక పరిణామాలపై తీర్మానం ఏచూరి ప్రవేశపెట్టడం, సమాధానమివ్వడం ఆయన ఎదుగుదలకు అద్దం పట్టాయి. అప్పుడే పొలిట్ బ్యూరోలో ప్రవేశించారు.1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏచూరి కీలకపాత్ర వహించారు. అనేక ప్రామాణిక రచనలు వెలువరించారు. దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ కాలానికి సూర్జిత్, జ్యోతిబసు, చంద్రబాబు, వీపీ సింగ్ వంటివారితో పాటు సీతారాం ఏచూరి కూడా ఒక కీలక పాత్రధారిగా రూపొందారు. ఇదే కాలంలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా సీపీఎం పత్రాల విధానాల రూపకల్పనలో తనదైన ముద్ర వేస్తూ, ఉపన్యాసకుడుగా వాటిని దేశమంతటా ప్రజలకూ పార్టీ శ్రేణులకూ వివరిస్తూ సవ్యసాచిలా పనిచేశారు. ఆ క్రమంలోనే 2004లో యూపీఏ ఏర్పాటు, కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరెడ్డి వంటివారు కూడా ఆ రోజులలో ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయనతో ప్రత్యేకంగా చర్చించేవారు.వామపక్ష ఐక్యతలో భాగంగా సోదర పార్టీలతోనూ, లౌకిక పార్టీలతోనూ సంప్రదింపులు జరపడంలో ఏచూరి పట్టువిడుపులకు పేరు పొందారు. ఆ విషయంలో అక్షరాలా సూర్జిత్ వారసుడనే చెప్పాలి. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి బీజేపీ నేతలు కూడా ఏచూరి ప్రత్యేకతను చెప్పకుండా వుండలేరు. అదే సమయంలో అపారమైన అధ్యయనం, అర్థశాస్త్రంలో పట్టు, ఆధునిక పరిణామాల అవగాహన ఆయనకు రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. జాతీయంగా ఇంత ఉన్నత స్థాయిలో వ్యవహరించే ఏచూరి సామాన్య కార్యకర్తలతో, ప్రత్యేకంగా యువతతో అలవోకగా కలసిపోయేవారు. ఎక్కడైనా ఏచూరి ప్రవేశించడమే ఏదో ఒక ఛలోక్తితో జరిగేది.సామాజిక న్యాయం, సాంస్కృతిక రంగాల్లో సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంబేడ్కర్ మాటలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావించకుండా మాట్లాడేవారు కాదు. మీడియా మిత్రుడిగా టీవీ డిబేట్లలో కీలకంగా కనిపించిన కొందరు తొలి నేతలలో ఆయనొకరు. సీపీఎం అధికార పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’కి ఇరవయ్యేళ్లు సంపాదకులుగా వున్నారు. పుష్కరకాలం రాజ్యసభ సభ్యుడిగా వున్న ఏచూరి ప్రసంగాలంటే పాలక పక్షానికి పరీక్షలే. తను ఎదిగిన జేఎన్‌యూపై 2019లో రాజ్యసభలో చర్చ జరిగినపుడు నాటి మంత్రి స్మృతీ ఇరానీకి షేక్స్పియర్ భాషలో ఆయన సమాధానమిచ్చిన తీరు మర్చిపోలేనిది. అందుకే ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రచనలు, ప్రసంగాలు అనేకం పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. ‘ప్రపంచీకరణ యుగంలో సోషలిజం’, ‘ప్రపంచీకరణలో అర్థశాస్త్రం’, ‘హిందూరాష్ట్ర’, ‘లౌకికతత్వం అంటే ఏమిటి?’ వంటివి ప్రత్యర్థి పార్టీల వ్యూహాల లోతుపాతులు తెలియాలంటే చదవాల్సిందే. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఏచూరి కీలక పాత్రధారిగా మెలిగారు. ఒక దశలో భారత దేశంలో ఐక్యతా ప్రయత్నాల లాగే నేపాల్లోనూ కమ్యూనిస్టు గ్రూపులను ఒక వేదిక మీదకు తేవడానికి దోహదం చేశారు. అనేక కారణాల వల్ల వామపక్షాల బలం తగ్గుతున్న పరిస్థితులలో రాజకీయ పోరాటాలలోనూ, ఎన్నికలలోనూ లౌకిక శక్తులను పునరేకీకరణ చేయడానికి సహేతుక ప్రాతిపదిక ఏర్పరచడానికి ఆయన నిరంతరం పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ‘ఇండియా’ వేదిక ఏర్పాటు, లోక్‌సభ బలాల పొందిక మార్పు వెనక ఈ కృషి వుంది.బెంగాలీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వంటి బహు భాషల్లో ధారాళంగా మాట్లాడే ఏచూరి తెలుగు బిడ్డగా తెలుగువారికి మరింత ప్రేమపాత్రులైనారు. ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడలేనంటూ మొదలుపెట్టినా అదో ప్రత్యేకమైన మంచి భాష మాట్లాడేవారు. మన రక్తం ఎర్రగా వున్నంతవరకూ ఎర్రజెండా ఎగురుతుంటుందని ఆయన అనే మాటతో చప్పట్లు మోగిపోయేవి. తెలుగు పాటలు కూడా ఇష్టపడేవారు. శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆయన కేతు విశ్వనాథరెడ్డి పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం నాకింకా గుర్తుంది. 1980లో ఎస్ఎఫ్ఐ మహాసభల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం తెలుగువారికి గర్వకారణమే. ఆయన తన కోసం ఏమీ కోరుకోలేదు. తీసుకుపోలేదు. ఆశయాల బాట మిగిల్చివెళ్లారు.తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అరుణాశయ బుద్ధమూర్తి
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి ప్రగతిశీల రాజకీయాలు, ప్రజా స్వామిక విలువలు కోరుకునేవారందరికీ విచారం కలిగించింది. రాజకీయ విభేదా లకు అతీతంగా ఆయనకు నేతలు నివాళు లర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత్వం, నిష్కపటత్వం వంటి విశిష్టతలను వారు గుర్తు చేసు కుంటున్నారు. దేశంలో కీలకమైన బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సాదాసీదా అపార్ట్మెంట్లోనే ఆఖరి దాకా జీవితం గడిపిన ఆదర్శం ఆయనది. కమ్యూ నిస్టు ఉద్యమం సృష్టించిన త్యాగధనులలో మూడవ తరానికి చెందిన బుద్ధదేవ్ ప్రెసిడెన్సీ కాలేజీలో సాహిత్యం చదువుకుని విద్యార్థి సంఘాల ద్వారా 1966లో వామపక్ష ఉద్యమంలో ప్రవే శించారు. 1977లో తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార, సాంస్కృతిక మంత్రిగా చేరిన ఆయన 1982లో ఓడిపోయినా 1987లో మళ్లీ గెలిచి బాధ్యతలు చేపట్టారు. 1996లో జ్యోతిబాసు అనా రోగ్యం తర్వాత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి దేశంలోనే కొత్తరికార్డు నెలకొల్పిన మహానాయకుడు జ్యోతిబాసు తర్వాత వామపక్ష కూటమి భవిష్యత్తు ఏమవుతుందనే సవాళ్లకు సమర్థమైన సమాధానంగా బుద్ధదేవ్ నిలిచారు. 2000 నుంచి పదకొండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి కేంద్ర కమిటీ, తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడుగా సీపీఎంలో ముఖ్యపాత్ర పోషించారు. యువమంత్రిగా, డివైఎఫ్ఐ నాయకుడుగా 1979లో ఆయన వరంగల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి మహాసభలకు రావడం ఈ రచయితకు గుర్తుంది. పాతికేళ్ల తర్వాత 2005లో అదే వరంగల్‌లో సీపీఎం మహాసభలలో బుద్ధదేవ్ చేసిన కీలక ప్రసంగంలో అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ మత తత్వ రాజకీయాలపై నిశిత విమర్శలు అనువదించాను కూడా! ‘‘గుజరాత్లో జరిగిన దారుణాలకు సాటి ముఖ్యమంత్రిగా నేను సిగ్గుపడుతున్నాను’’ అని అప్పుడాయన అన్నారు. మృదుభాషిగా పేరొందిన బుద్ధదేవ్ రాజకీయ విషయాల్లో అంత నిక్కచ్చిగా ఉండేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తొలి రెండు ఎన్నికల్లోనూ ఫ్రంట్ విజయాలు కొత్త చరిత్ర సృష్టించాయి. 2006 ఎన్నికలలో వామపక్షాలకు 294కు 235 స్థానాలు వచ్చాయి. దానికన్నా ముందు 2004 లోక్‌సభ ఎన్నికలలోనూ 35 స్థానాలు వచ్చాయి. పార్లమెంటులో మొత్తం 60 స్థానాలతో వామపక్షాలు, అందులో 42 సీట్లతో సీపీఎం పాత్ర, ప్రభావాలు శిఖరాగ్రానికి చేరాయి. ఆ మద్దతే లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఉండేది కాదు. కాంగ్రెస్ ఆ రాజకీయ సందేశాన్ని సవ్యంగా అర్థం చేసుకుని ఉంటే... అణు ఒప్పందం చిచ్చు పెట్టకపోతే చరిత్ర మరోలా ఉండేది. బుద్ధదేవ్ సైద్ధాంతికంగా కొత్తపుంతలు తొక్కుతున్నారనీ, దార్శనికతతో పిడివాదాన్ని వదిలేశారనీ ఒక వైపున లేనిపోని పొగడ్తలు... మరోవైపున భూములు లాక్కొంటున్నారనే ప్రచారా లకు బడా మీడియా వేదికైంది. సరళీకరణ విధానాలను, భూ దోపిడీని వ్యతిరేకించినవే వామపక్షాలు కాగా ఆ ముద్రతో వాటిపైనే దాడి చేయడం బూర్జువా వర్గాల వ్యూహమైంది. వామపక్ష ఫ్రంట్ టార్గెట్‌గా సింగూరు, నందిగ్రావ్ు ఘటనలపై అదేపనిగా ప్రచారాలు జరిగాయి. సింగూర్‌లో టాటా కార్ల ఫ్యాక్టరీ దాదాపు పూర్తవుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఆ రోజుల్లో మమతా బెనర్జీ చేసిన హడావిడి మర్చిపోరానిది. కాంగ్రెస్, మమతా బెనర్జీ బుద్ధదేవ్ ప్రభుత్వాన్ని ఓడించడమే పరమార్థంగా వ్యవహరించాయి. మావోయిస్టు పార్టీ కూడా గొంతు కలిపింది. వాటిలో కొన్ని తప్పొప్పులు లేవని కాదు గాని ప్రజలకు ఉపాధి పెంచాలన్నదే బుద్ధదేవ్ సంకల్పంగా ఉండేది. ఆ పరిణామాలపై చాలా సమీక్షలే జరిగాయి. అనేక అధికారిక నివేదికలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని సాకల్యంగా చూస్తే ఎవరికైనా పూర్తి నిజాలు తెలుస్తాయి. ‘‘టాటాలే బెంగాల్ నుంచి తరలిపోవడం వల్ల రాష్ట్రానికి చెప్ప లేని నష్టం జరిగింది. నేను ఎక్కడ తప్పు చేశానా అని కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. భూ సేకరణే తప్పా లేక భూ సేకరణ జరిగిన విధానమా? నేను ప్రతిపక్షాలపై మరీ మెతగ్గా వ్యవహరించానా? ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు తీసు కోవాలి’’ అని ఆయన చెప్పారు. బుద్ధదేవ్, జ్యోతిబాసు వంటివారు భద్రలోక్ అనీ, మమతా దీదీ ప్రజల మనిషని ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఆమె నిరంకుశ పోకడలపై విరుచుకుపడుతున్నారు. మోదీ ఏకపక్షపాలన ముదిరాక ఆమె కూడా అనేక రాజకీయ విన్యాసాలతో ఉనికి కాపాడుకుంటున్నారు. బుద్ధదేవ్ మాత్రం ‘మోదీ హఠావో, మమతా హఠావో’ నినాదంతోనే రాజకీయ జీవితం ముగించారు. 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్ష ప్రభుత్వం 2011లో ఓడి పోయాక నిర్బంధాలు తట్టుకుని బుద్ధదేవ్ గట్టిగా నిలబడ్డారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ సమావేశాలలో, సభలలో పాల్గొంటూ, ఉద్యమాన్ని నిలబ్టెడంలో తన పాత్ర నిర్వహిసూ వచ్చారు. 2011లో ఓడిపోయిన తన నియోజకవర్గమైన జాదవ్ పూర్లో 2017లో పెద్ద మెజార్టీతో సీపీఎం అభ్యర్థినే గెలిపించు కోగలిగారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కుమారుడు సుచేతన్ కూడా ఆశయాల బాటలో తోడుగా నిలిచారు. ఎవరు ఎంత చెప్పినా పావ్‌ు అవెన్యూలోని తన నిరాడంబర ‘టు బెడ్ రూవ్‌ు ఫ్లాట్‘ నివాసాన్ని మార్చుకోవడానికి బుద్ధదేవ్ ఒప్పు కోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పాత అంబాసిడర్ కారునే ఆఖరు వరకూ ఆయన వాడారు.2023లో మోదీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆనారోగ్యంలో పరా మర్శించే పేరిట మమతా బెనర్జీ లేదా అప్పటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ వంటివారు రాజకీయాలు చేయబోతే సాగనివ్వలేదు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ ఒరవడికి అద్దం పడతాయి. ఆయన మరణానంతరం అధికారిక గన్ సెల్యూట్‌ను కూడా కుటుంబ సభ్యులు నిరాకరించారు.కళా, సాహిత్య రంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రచయిత, కవి, నాటకకర్త కూడా! ఇన్ని రాజకీయాల సిద్ధాంత ఘర్షణల మధ్యనా టాగోర్ కవితలను 500 దాకా కంఠోపాఠంగా చెప్పేవారట! సంక్లిష్టమైన ఆధునిక రచయితలు కాఫ్కా, మార్క్వెజ్ వంటి వారి రచనలను ఆయన బెంగాలీలోకి అనువదించారు. సమాంతర చిత్రాలకు పేరెన్నికగన్న కొల్కతాలో నందన్ కానన్ కళాభవన్ పేరిట ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిగా చొరవ తీసుకున్నారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత సుకాంత భట్టాచార్య ఆయన బాబాయి. తన ఆత్మకథను రెండు భాగాలుగా వెలువరించారు బుద్ధదేవ్. ‘ఫిర్దేఖా’, ‘ఫిర్దేఖా 2’ అనే ఆ రెండు సంపుటాల్లో జీవితాన్ని రాజకీయ పాలనానుభవాలను నెమరు వేసుకున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా బెంగాలీలు ఆయనను ఎంత ప్రేమించారు, దేశం ఎంత గౌరవించింది అనడానికి అంతిమఘట్టంలో ప్రదర్శితమైన గౌరవాభిమా నాలే నిదర్శనం. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు -
క్వాష్ పిటిషన్ కొట్టివేత! బాబు మళ్లీ జైలుకే..!
-
హైకోర్టు ఉత్తర్వులు: కారణాలు సహేతుకంగా లేవు!
-
తెలకపల్లి రవికి మాతృవియోగం
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవికి మాతృవియోగం కలిగింది. తెలక పల్లి రవి తల్లి టీసీ లక్ష్మమ్మ(84) శనివారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లక్ష్మమ్మ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. లక్ష్మమ్మ మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు.