సంస్కరణవాది.. స్థిత ప్రజ్ఞుడు | Sitaram Yechury: Starting as President of JNU to level of General Secretary of CPM | Sakshi
Sakshi News home page

సంస్కరణవాది.. స్థిత ప్రజ్ఞుడు

Published Fri, Sep 13 2024 4:58 AM | Last Updated on Fri, Sep 13 2024 6:26 AM

Sitaram Yechury: Starting as President of JNU to level of General Secretary of CPM

తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి 

విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభం..

జేఎన్‌యూ అధ్యక్షుడిగా మొదలుపెట్టి సీపీఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి...

సాక్షి, నేషనల్‌ డెస్క్‌/సాక్షి, హైదరాబాద్‌:  బహుభాషావేత్తగా, కాలమిస్ట్‌గా, రాజకీయవేత్తగా, వామపక్షవాదిగా సీతారాం ఏచూరిది సుదీర్ఘ ప్రస్థానం. అటు పార్టీ అగ్రనేతగా కొనసాగుతూనే ఇటు ఎర్రజెండా పట్టుకుని పలు ప్రజా ఉద్యమాల్లో తలమునకలయ్యారు. సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన వామపక్ష నేతగా కొనసాగారు. తుదిశ్వాస వరకూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం పాటుపడి నిఖార్సయిన కామ్రేడ్‌గా పేరు నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వాక్పటిమతో సంప్రదింపులు జరపడంలో దిట్టగా ఏచూరికి పేరుంది.

తెలుగు కుటుంబంలో జననం.. : సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12న చెన్నైలో స్థిరపడిన తెలుగు వాస్తవ్యులు ఏచూరి సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు జని్మంచారు. స్వస్థలం కాకినాడ కాగా బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్‌ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తండ్రి సోమయాజి బదిలీపై విజయవాడ ఆరీ్టసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలో చదువుకున్నారు. 

ఏచూరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌ కందా స్వయానా మేనమామ. చెన్నైలోని మేనమామ ఇంట్లో ఆయన జని్మంచారు. హైదరాబాద్‌ ఆల్‌ సెయింట్స్‌లో, ఢిల్లీలో హైసూ్కల్‌ విద్యను అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో బీఏ (ఆనర్స్‌) ఆర్థిక శాస్త్రం, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.  

సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర..
తన గురు సమానులు హర్‌కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌లాగా 2004–2014 కాలంలో ఏచూరి సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భూమిక అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ తిరస్కరించాక నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తర్వాత సోనియా కలిసిన తొలి కాంగ్రెసేతర నేత ఏచూరినే. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరంతో కలిసి పనిచేశారు. యూపీఏ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్‌కు అత్యంత నమ్మదగ్గ నేస్తంగా ఉన్నారు.  

నెగ్గిన ఏచూరి బడ్జెట్‌ సవరణల ప్రతిపాదన..
గతంలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన చేసిన సవరణల ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం కేవలం నాలుగోసారి మాత్రమే.  

ఒబామా రాకను వ్యతిరేకించిన సందర్భం..
అమెరికాపై విమర్శలు చేయడంలో ఏచూరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణం అంటూ చురుకైన విమర్శలు చేసేవారు. గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని ఏచూరి వ్యతిరేకించారు. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను, జమ్మూ, కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35అ రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు.  

ఇండియా కూటమికి కృషి..
పార్లమెంట్‌ వేదికగా సామాన్యుల సమస్యలను ఎలుగెత్తి, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను దునుమాడారు. విపక్షాలను ‘ఇండియా’ కూటమిగా ఏకతాటి మీదకు తేవడంలో కూడా ఏచూరి పాత్ర కీలకమైంది. లోక్‌సభలో విపక్షనేతగా మోదీ సర్కార్‌ను తూర్పారబడుతున్న రాహుల్‌గాంధీకి రాజకీయ గురువుల్లో ఒకరిగా ఈయనకు పేరుంది.  

ఇతర భాషల్లోనూ అనర్గళంగా..
అచ్చ తెలుగు వ్యక్తి అయిన ఏచూరి హిందీ, తమిళం, బెంగాళీ, మలయాళం సైతం అనర్గళంగా మాట్లాడేవారు. హిందూ పురాణాలను ఔపోసన పట్టిన ఏచూరి సందర్భోచితంగా తన ప్రసంగాల్లో వాటిని ఉదహరిస్తూ బీజేపీకి చురకలంటించేవారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్ట్‌లు పెట్టేవారు. ప్రకాశ్‌కారత్‌ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్న ఏచూరి సౌమ్యంగా ఉంటూనే పార్టీలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరొందారు.  

మా భుజాలపై తుపాకులు పెట్టి తప్పించు కుంటారా? 
తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పక్షాలు ఒప్పుకోవడం లేదన్న భావనతోకాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించేది. అలాంటి సందర్భంలో తెలంగాణపై జరిగిన చర్చలో సీతారాం ఏచూరి ‘తెలంగాణపై ఏ పార్టీ అభిప్రాయాలు ఆ పారీ్టకి ఉంటాయి. ఆయా పారీ్టల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందా? తెలంగాణపై మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అంతేగానీ మా భుజాలపై తుపాకులు పెట్టి పేల్చాలనుకోవడం సరికాదు..’ అని ఏచూరి కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారని పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు.  

మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 
2015లో విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) సదస్సు­లో పారీ్ట­కి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో, 2021 కోజికోడ్‌ మహాసభలోనూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే హోదాలో ఆయన మృతి చెందారు. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌ కాగా ప్రముఖ జర్నలిస్టు సీమా ఛిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. కుమార్తె అఖిల, ఇద్దరు కుమారులు ఆశిష్, డ్యానిష్‌ కాగా.. 34 ఏళ్ల పెద్ద కుమారుడు ఆశిష్‌ 2021లో కోవిడ్‌తో కన్నుమూశారు. అఖిల.. యూనివర్సిటీ ఆఫ్‌ ఎడెన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌లో బోధిస్తారు.

ఎస్‌ఎఫ్‌ఐలో చేరికతో.. 
1974లో స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరికతో ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌)లో సభ్యుడు అయ్యారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరించిన ఏచూరి అనేక ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టై కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయన..ఆ కారణంగా డాక్టరేట్‌ పూర్తి చేయలేకపోయారు.  ఎంతోమంది సన్నిహితుల మధ్య తాను డాక్టరేట్‌ పూర్తి చేయలేకపోయానని ప్రస్తావిస్తూ బాధపడుతుండేవారు.

దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత ఏచూరి జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పశి్చమ బెంగాల్, కేరళయేతర వ్యక్తి ప్రెసిడెంట్‌ కావడం అదే తొలిసారి కావడం విశేషం. కాగా 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఆయన ఎన్నికయ్యారు. 1992లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు.  

రాజ్యసభ సభ్యుడిగా, వివిధ కమిటీల్లో..
2005లో పశి్చమబెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2006 రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలకు చైర్మన్‌గా, సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా, జనాభా, ప్రజా ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫోరంలో సభ్యుడిగా, విలువల కమిటీలో సభ్యుడిగా, బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా నియమితులై సేవలు అందించారు. 2009లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్‌ కమిటీతో పాటు, పార్లమెంట్‌ హౌస్‌లో దేశ నాయకులు, పార్లమెంటేరియన్ల చిత్రపటాలు, విగ్రహాల ఏర్పాటుకు ఉద్దేశించిన కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ అఫైర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2011లో తిరిగి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2012లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.

గొప్ప రచయిత 
ఏచూరి గొప్ప రచయితగా కూడా పేరు సంపాదించారు. పారీ్టకి చెందిన వారపత్రిక పీపుల్స్‌ డెమోక్రసీకి రెండు దశాబ్దాలకు పైగా సంపాదకులుగా పనిచేశారు. సైద్ధాంతిక రంగంలో, హిందూత్వంపై ఆ పుస్తకంలో విమర్శలు చేసేవారు. ఇలా రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ‘లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌’ పేరుతో ఆంగ్లపత్రికకు కాలమ్స్‌ రాసేవారు. ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘సోషలిజం ఇన్‌ ఛేంజింగ్‌ వరల్డ్‌’, ‘మోదీ గవర్నమెంట్‌’, ‘న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం’, ‘కమ్యూనిలజం వర్సెస్‌ సెక్యులరిజం’ వంటి పుస్తకాలను రాశారు. ఏచూరికి పాత హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూసేందుకు ఏచూరితో కలిసి రఫీ మార్గ్‌ నుంచి చాణక్య ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లే వాళ్లమని తోటి సీపీఎం నేతలు నాటి సంగతులు చెప్పారు.  

1977
అక్టోబర్‌ నెల.. ఓ నూనూగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా వెళ్లారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లేచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్‌ చేస్తూ.. మెమోరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్‌ పదవికి రాజీనామా చేశారు.

అసాధారణ నేత..
ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడు­తూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూ­తి తెలియజేస్తున్నా. –ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి

ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్‌ ధన్‌ఖడ్, ఉప రాష్ట్రపతి

వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరి నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్‌ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం.    – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను     –కేంద్ర హోంమంత్రి, అమిత్‌ షా

 లౌకిక చాంపియన్‌ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. – సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌

ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్‌ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్‌ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత

సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అ­సా­ధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆ­య­న విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్‌ ఫె­డరేష­న్‌లో పనిచేశాం. ఆయన మరణం ప్రజాస్వామ్య వ­ర్గాల­కు తీరని లోటు.    –డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

  ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ప్రజా, దేశ సమస్యలు ప్రస్తావించే ఒక గొంతు మూగబోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత వామపక్షాల ఐక్యతను విస్తృతం, పటిష్టం చేసేందుకు మంచి కృషి చేశారు.  – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి 

 కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు  మమతా బెనర్జీ,  పినరయి విజయన్, భారత్‌లో చైనా రాయబారి ఫెహోంగ్‌ తదితరులు ఏచూరి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు.  ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ­జేస్తున్నా.    – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి..   మరణం భారత లౌకిక వాదానికి, కార్మిక లోకాని­కి తీరని లోటు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 
–  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు  

 ఏచూరి భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు.     – ఏపీ సీఎం చంద్రబాబు

దత్తాత్రేయ, కేంద్ర మంత్రుల సంతాపం..: ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, బీఏఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.  

ప్రముఖుల సంతాపం..: శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అసదుద్దీన్‌ ఒవైసీ, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్, తది­తరులు ఏచూరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement