Communist leader
-
అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!
అలా వెళ్లిపోయావేం ఏచూరీ, ఆఖరి ఆశలు కూడా వమ్ముచేసి. తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపలేకపోతోంది మా భౌతికవాద చైతన్యం... సమకాలీన భారత రాజకీయ రంగంలో అరుదైన ఆణిముత్యం సీతారాం ఏచూరి. పదహారణాల సంప్రదాయ తెలుగు కుటుంబంలో అత్యున్నత విద్యావంతుల ముద్దుబిడ్డగా పుట్టారు. తండ్రి ఎఎస్ సోమయాజులు అధికారి, తల్లి కల్పకం ఉద్యోగిని (కాకినాడలో సామాజిక కార్యక్రమాలకు కన్నతల్లి లాంటి ఆమె మూడేళ్ళ క్రితం కన్నుమూశారు.) మేనమామ ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన మోహన్ కందా కాగా మిగిలిన వారిలోనూ ఐఏఎస్‌లే ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలలో మిన్న అయిన ఏచూరి కూడా అదే మార్గంలో నడుస్తాడనుకున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుతుండగా తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడే చదువుతూ 1970లో సీబీఎస్ఈ 12వ క్లాసులో అఖిల భారత స్థాయిలో ప్రథముడుగా వచ్చారు. అమెరికా పర్యటించే అవకాశం దక్కించుకున్నారు. సెంట్ స్టీఫె¯Œ ్స కాలేజీలో ఎకనామిక్స్‌లో పట్టభద్రుడై ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు. 1974లో అక్కడే ఆయనకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ప్రకాశ్ కరత్‌తో పరిచయమైంది. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి అర్థశాస్త్రంలో అపారమైన ఆసక్తితో పరిశోధన చేయాలనుకున్నా ఎమర్జెన్సీలో అరెస్టయ్యారు. రెండేళ్లలో మూడుసార్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్ హోదాలో ఉండగా, ఆమె నివాసానికి ప్రదర్శనగా వెళ్ళి, ఆమెను నిలబెట్టి అభియోగ పత్రం చదవడమే గాక, ఛాన్సలర్‌గా వుండటం తగదని మొహం మీదనే చెప్పేశారు. మొదట ఆశ్చర్యానికి గురైన ఆమె తర్వాత నిజంగానే ఆ బాధ్యత నుంచి వైదొలగారు. యాభై ఏళ్లపాటు ఏచూరి సాగించబోయే నిబద్ధ, నిశ్చల రాజకీయ ప్రస్థానానికి అది నాందీ ప్రస్తావన.ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఏచూరి 1984 నుంచి 1986లో విజయవాడలో జరిగిన అఖిల భారత మహాసభల దాకా కొనసాగారు. 1985లోనే కలకత్తాలో జరిగిన సీపీఎం మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యుడైనాడు. నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య వంటి సీనియర్ నాయకులు ఉద్యమాన్ని సమర్థంగా కొనసాగించడం కోసం వ్యూహాత్మకంగానే ఏచూరి, కరత్ వంటి యువనాయకులకు తర్ఫీదునిచ్చారు. తెలుగువాడిగా మాకినేనితోనూ, జాతీయ రాజకీ యాల్లో సూర్జిత్తోనూ సీతారాం సన్నిహితంగా మెలు గుతూ ఆచరణాత్మక విషయాలూ ఆకళింపు చేసు కున్నారు. 1988లో సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన ఏచూరి, 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు సూర్జిత్తో పాటు ఆ పరిణామాలలో కీలక పాత్ర వహించారు. 1991లో సోషలిస్టు సోవియట్ విచ్ఛిన్నం పెద్ద ఎదురుదెబ్బగా మారిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వుండదనుకునేవారికి కను విప్పు కలిగేలా భారత దేశంలో మూడు రాష్ట్రాలలో సీపీఎం, వామపక్షాలు గెలుపొందాయి. 1992లో మద్రాసులో జరిగిన సీపీఎం మహాసభలో ఈ సైద్ధాంతిక పరిణామాలపై తీర్మానం ఏచూరి ప్రవేశపెట్టడం, సమాధానమివ్వడం ఆయన ఎదుగుదలకు అద్దం పట్టాయి. అప్పుడే పొలిట్ బ్యూరోలో ప్రవేశించారు.1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏచూరి కీలకపాత్ర వహించారు. అనేక ప్రామాణిక రచనలు వెలువరించారు. దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ కాలానికి సూర్జిత్, జ్యోతిబసు, చంద్రబాబు, వీపీ సింగ్ వంటివారితో పాటు సీతారాం ఏచూరి కూడా ఒక కీలక పాత్రధారిగా రూపొందారు. ఇదే కాలంలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా సీపీఎం పత్రాల విధానాల రూపకల్పనలో తనదైన ముద్ర వేస్తూ, ఉపన్యాసకుడుగా వాటిని దేశమంతటా ప్రజలకూ పార్టీ శ్రేణులకూ వివరిస్తూ సవ్యసాచిలా పనిచేశారు. ఆ క్రమంలోనే 2004లో యూపీఏ ఏర్పాటు, కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరెడ్డి వంటివారు కూడా ఆ రోజులలో ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయనతో ప్రత్యేకంగా చర్చించేవారు.వామపక్ష ఐక్యతలో భాగంగా సోదర పార్టీలతోనూ, లౌకిక పార్టీలతోనూ సంప్రదింపులు జరపడంలో ఏచూరి పట్టువిడుపులకు పేరు పొందారు. ఆ విషయంలో అక్షరాలా సూర్జిత్ వారసుడనే చెప్పాలి. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి బీజేపీ నేతలు కూడా ఏచూరి ప్రత్యేకతను చెప్పకుండా వుండలేరు. అదే సమయంలో అపారమైన అధ్యయనం, అర్థశాస్త్రంలో పట్టు, ఆధునిక పరిణామాల అవగాహన ఆయనకు రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. జాతీయంగా ఇంత ఉన్నత స్థాయిలో వ్యవహరించే ఏచూరి సామాన్య కార్యకర్తలతో, ప్రత్యేకంగా యువతతో అలవోకగా కలసిపోయేవారు. ఎక్కడైనా ఏచూరి ప్రవేశించడమే ఏదో ఒక ఛలోక్తితో జరిగేది.సామాజిక న్యాయం, సాంస్కృతిక రంగాల్లో సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంబేడ్కర్ మాటలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావించకుండా మాట్లాడేవారు కాదు. మీడియా మిత్రుడిగా టీవీ డిబేట్లలో కీలకంగా కనిపించిన కొందరు తొలి నేతలలో ఆయనొకరు. సీపీఎం అధికార పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’కి ఇరవయ్యేళ్లు సంపాదకులుగా వున్నారు. పుష్కరకాలం రాజ్యసభ సభ్యుడిగా వున్న ఏచూరి ప్రసంగాలంటే పాలక పక్షానికి పరీక్షలే. తను ఎదిగిన జేఎన్‌యూపై 2019లో రాజ్యసభలో చర్చ జరిగినపుడు నాటి మంత్రి స్మృతీ ఇరానీకి షేక్స్పియర్ భాషలో ఆయన సమాధానమిచ్చిన తీరు మర్చిపోలేనిది. అందుకే ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రచనలు, ప్రసంగాలు అనేకం పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. ‘ప్రపంచీకరణ యుగంలో సోషలిజం’, ‘ప్రపంచీకరణలో అర్థశాస్త్రం’, ‘హిందూరాష్ట్ర’, ‘లౌకికతత్వం అంటే ఏమిటి?’ వంటివి ప్రత్యర్థి పార్టీల వ్యూహాల లోతుపాతులు తెలియాలంటే చదవాల్సిందే. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఏచూరి కీలక పాత్రధారిగా మెలిగారు. ఒక దశలో భారత దేశంలో ఐక్యతా ప్రయత్నాల లాగే నేపాల్లోనూ కమ్యూనిస్టు గ్రూపులను ఒక వేదిక మీదకు తేవడానికి దోహదం చేశారు. అనేక కారణాల వల్ల వామపక్షాల బలం తగ్గుతున్న పరిస్థితులలో రాజకీయ పోరాటాలలోనూ, ఎన్నికలలోనూ లౌకిక శక్తులను పునరేకీకరణ చేయడానికి సహేతుక ప్రాతిపదిక ఏర్పరచడానికి ఆయన నిరంతరం పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ‘ఇండియా’ వేదిక ఏర్పాటు, లోక్‌సభ బలాల పొందిక మార్పు వెనక ఈ కృషి వుంది.బెంగాలీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వంటి బహు భాషల్లో ధారాళంగా మాట్లాడే ఏచూరి తెలుగు బిడ్డగా తెలుగువారికి మరింత ప్రేమపాత్రులైనారు. ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడలేనంటూ మొదలుపెట్టినా అదో ప్రత్యేకమైన మంచి భాష మాట్లాడేవారు. మన రక్తం ఎర్రగా వున్నంతవరకూ ఎర్రజెండా ఎగురుతుంటుందని ఆయన అనే మాటతో చప్పట్లు మోగిపోయేవి. తెలుగు పాటలు కూడా ఇష్టపడేవారు. శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆయన కేతు విశ్వనాథరెడ్డి పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం నాకింకా గుర్తుంది. 1980లో ఎస్ఎఫ్ఐ మహాసభల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం తెలుగువారికి గర్వకారణమే. ఆయన తన కోసం ఏమీ కోరుకోలేదు. తీసుకుపోలేదు. ఆశయాల బాట మిగిల్చివెళ్లారు.తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పీడిత ప్రజల విముక్తి కోసం...
కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి రహస్యజీవితం గడుపుతూ 1976 జూలై 28న అనారోగ్యంతో అమరులయ్యారు. భారత విప్లవ రాజకీయ రంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది ‘టీఎన్’గా సుపరిచితులై పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు.కా‘‘ తరిమెల నాగిరెడ్డి 1917 ఫిబ్రవరి 11న అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, దోపిడీ పీడనలులేని సమ సమాజస్థాపనకు తన సర్వస్వాన్ని అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు.విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారసు విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా 1939లో ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఈయనే. బెనారసు విశ్వవిద్యాలయంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. లా చదువుకు స్వస్తిచెప్పి ఎం.ఏ. పట్టాతో విశ్వవిద్యాలయాన్ని వదలగానే యువకులను ఉద్యమాల్లోకి సమీకరించే కృషిని ప్రారంభించారు. కార్మికులు, రైతాంగం కొరకు ఉద్యమించారు. 1940లో ‘యుద్ధం దాని ఆర్థిక ప్రభావం’ అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించి నందుకు 23 ఏండ్ల యువకునిగా ఉన్నప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను అనుభవించారు.తన కంచుకంఠంతో పండిత పామరులను ఉర్రూతలూగించి కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆసక్తితో, శ్రద్ధతో వినేవారు. భారత విప్లవోద్యమ రంగంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ విప్లవ పంథాను దేశమంతటా ప్రచారంచేసి వ్యాపింపచేయటంలో టీఎన్ చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన పాలకుల తీవ్రనిర్బంధానికి గురయ్యారు. అరెస్టులు, జైలుశిక్షలు, అజ్ఞాతవాసాలకు వెరువలేదు. ఆయనపైనా, మరో 60మందిపైనా పెట్టిన కుట్రకేసు విచారణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. సరైన మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణతో ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షరసత్యాలే. అవి కమ్యూనిస్టు విప్లవకారులకు, ప్రజాతంత్రశక్తులకూ భావి కార్యాచరణకు మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి.1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామాచేసి అసెంబ్లీలో సంచలనాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలను, భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధికంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే ప్రజావ్యతిరేక విధానాలను అవి అవలంబిస్తున్నాయని చెప్తూ ‘‘జనాల్ని కదిలిస్తే తప్ప పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు అంతం’’ కావని వ్యాఖ్యానించారు. 1975లో డీవీతో కలిసి యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమాణాలను పాటించారు. ఆయన స్మృతి నిరంతరం ప్రజలను విప్లవ కర్తవ్యోన్ముఖులను చేస్తూనే వుంటుంది. సి. భాస్కర్ ‘ యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) -
కమ్యూనిస్టు విప్లవయోధుడు
కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్) జన్మించి ఈ ఫిబ్రవరి 11 నాటికి 107 సంవత్సరాలు. భారత విప్లవ రాజకీయరంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు. తరిమెల నాగిరెడ్డి 1917లో అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, సమ సమాజ స్థాపనకు తన సర్వస్వాన్నీ అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు. టీఎన్ ఎమర్జన్సీ కాలంలో వెంకట్రామయ్య అనే మారు పేరుతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరి 1976 జూలై 28న అమరులైనారు. తన విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుతూ కమ్యూ నిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. చదువు అయిన వెంటనే కార్మిక, కర్షకుల కొరకు ఉద్యమించారు. 1940లో ‘యుద్ధం– దాని ఆర్థిక ప్రభావం’ అనే పుస్తకాన్ని ప్రచురించి ఏడాది కఠిన కారా గారశిక్షను అనుభవించారు. కా‘‘ టీఎన్ చక్కని వక్త. అసెంబ్లీ, పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు శ్రద్ధతో వినేవారు. కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ పంథాను దేశమంతటా వ్యాపింప చేయటంలో చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పైనా, మరో 60 మందిపైనా పెట్టిన కుట్రకేసు విచా రణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షర సత్యాలే. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ నీలం సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అసెంబ్లీలో సంచల నాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలనూ, భూస్వాముల ప్రయోజనాలనూ పరిరక్షించే విధా నాలను అనుసరిస్తున్నాయనీ అన్నారు. దేశాభివృద్ధి కంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగు తున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటులు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే విధానాలను అవలంబి స్తున్నాయనీ అన్నారు. ఆయన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించిన మితవాద, అతివాద, అవకాశవాదా లకూ, తప్పుడు ధోరణులకూ వ్యతిరేకంగా డీవీతో కలిసి రాజీలేని పోరాటం నిర్వహించి సరైన విప్లవ పంథాను పరిరక్షించారు. ఈ క్రమంలోనే 1975లో కా‘‘ డీవీతో కలిసి యూసీసీఆర్ (ఎమ్ఎల్)ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కా‘‘ టీఎన్ తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమా ణాలను పాటించారు. – సి. భాస్కర్, యూసీసీఆర్ (ఎమ్ఎల్) (నేడు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి జయంతి) -
పీడితుల కోసమే జీవితం అంకితం
తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ మఖ్దూమ్. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమా రుడు కూడా ఉద్యోగం చేసేవాడు. సింగరేణితో అయన అనుబంధం విడ దీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునే వారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్ జిల్లా ఆందోల్‌లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్ పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖల’ను ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. మఖ్దూమ్ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయి పోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులావ్‌ు హైదర్, రాజ బహు దూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాదులో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు. మఖ్దూమ్ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్‌ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. ఆయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే ‘దస్తర్ఖాన్’ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజావ్‌ు పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరా టానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు. 1969 ఆగష్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి ‘మఖ్దూమ్ భవన్’ అంటూ ఆయన పేరే పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూని యన్ నిర్మించడంలో మఖ్దూమ్ కీలకంగా వ్యవహారించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్ బహద్దూర్ గౌర్ తదితరులతో కలిసి ‘ఎర్రజెండా యూనియన్’ నిర్మించాడు. మఖ్దూమ్ సేవలు చిరస్మరణీయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు మఖ్దూమ్ జయంతి) -
ఆచరణే సిద్ధాంతం: ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ (1909–1998)
ప్రపంచంలోనే మొదటిసారిగా, కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మార్క్సిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ద్వారా, భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్ 1957లో చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొదటి ప్రకటన.. సోషలిజం తీసుకురావడానికి తన ప్రభుత్వం ప్రయత్నించగలదని స్పష్టం చేయడం కాదు. దానికి బదులు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను తగ్గించడానికి తన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఇ.ఎం.ఎస్. కేరళలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రైవేట్ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. సనాతన సంప్ర దాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పురిగిన ఇ.ఎం.ఎస్. తన సొంత వర్గ తిరోగమన విధానాలపై పోరాడటం ద్వారా ప్రజాహిత జీవనంలోకి అడుగుపెట్టారు. బాల్యంలో ప్రాచీన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. సంపన్న భూస్వామ్య పెత్తందారీ విధానాన్ని అంతం చేయడంలో అగ్రభాగంలో నిలిచారు. అక్షరాస్యత, స్త్రీ పురుష వివక్ష లేకుండా చూడటం, ప్రజారోగ్యం, సమగ్ర భూ సంస్కరణలు ఆయన మొదటి ప్రభుత్వ ఘన విజయంగా చెప్పాలి. చదవండి: (శతమానం భారతి: ఆహార భద్రత) కాంగ్రెస్ తన ప్రజాస్వామిక ముసుగును వదిలి, నియంతృత్వ పోకడలను బయట పెడుతూ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు సి.పి.ఐ. భ్రమలు తొలగిపోయాయి. సి.ఐం.ఐ.(ఎం) బలంగా ఉన్న చోటల్లా నక్సలైట్ తీవ్రవాద రాజకీయాలు బయట పడటంతో ఆ ఉద్యమమూ సడలిపోయింది. ఇ.ఎం.ఎస్. 1978 నుంచి 1980ల చివరి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన కాలంలో పార్టీ అనేక ఒత్తిడులను, సంక్షోభాలను ఎదుర్కొంది. 1980ల చివరిలో ఆయన విశ్రాంత జీవితం మొదలైంది. అయితే, ఆయన ఖాళీగా ఉండకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎదగాల్సిందిగా తన రచనల ద్వారా కేరళీయులకు పిలుపునిచ్చారు. సమగ్ర వికేంద్రీకరణ కార్యక్రమమైన ప్రజా ప్రణాళికా విధానాన్ని రూపొందించడం ప్రారంభించారు. ఆయన రచనలు 150 సంపుటాలుగా వెలువడ్డాయి. భారతీయ కమ్యూనిస్టు విధానాల ఆచరణకు తోడ్పడిన నవీన ప్రయోగాలను సిద్ధాంతీకరించడానికి ఇ.ఎం.ఎస్. విముఖత చూపడం విమర్శలకు లోనైంది. సిద్ధాంతం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ఇ.ఎం.ఎస్. -
Mallu Swarajyam: అరుణ కిరణం అస్తమించింది
సాక్షి, హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి: ఎర్ర మందారం నేల రాలింది. అస్థిత్వం కోసం.. వెట్టి, బానిసత్వం విముక్తి కోసం బరిసెలు ఎత్తి, బాకుల్ అందుకొని, బందూకుల్ పట్టిన ధీర నింగికెగిశారు. జీవితాంతం సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. తారల్లో కలిశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధు రాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2వ తేదీ మధ్యాహ్నానికి నిమోనియాతో పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అంది స్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ ఫెయిల్ కావడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మెడికల్ కళాశాలకు పార్థివదేహం.. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో భౌతికకాయం ఉంచుతారు. తర్వాత పార్థివదేహాన్ని నల్లగొండకు తరలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటలవరకు నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల సందర్శణార్థం ఉంచుతారు. తర్వాత ర్యాలీగా ప్రభుత్వ జన రల్ ఆస్పత్రి వరకు తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని అప్పగించనున్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా.. స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాం రెడ్డి–చొక్కమ్మ దంపతులకు 1931లో జన్మించారు. రాంరెడ్డికి ఐదుగురు సంతానం. నర్సింహారెడ్డి, శశిరేఖ, సరస్వతి, స్వరాజ్యం, కుశలవరెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల కోసం పాటుబడిన ధీశాలి. దున్నే వాడికే భూమి కావాలని, దొరల పాలన పోవాలని 11 ఏళ్లప్పుడే పోరుబాట పట్టారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచారు. ఉద్యమ సహచరుడితో వివాహం.. సాయుధ పోరాటం తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో నాయకులు బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావుల సమక్షంలో ఆర్భాటాలు లేకుండా పెళ్లిచేసుకున్నారు. వెంకటనర్సింహారెడ్డి స్వస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మావిళ్లమడువ. వీరు సూర్యాపేట మండలం రాయినిగూడెంలో స్థిరపడ్డారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేసిన నర్సింహారెడ్డి 2004 డిసెంబర్ 4న మరణించారు. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె కరుణ, కుమారులు గౌతంరెడ్డి, నాగార్జునరెడ్డి. పెద్దకుమారుడు గౌతం రెడ్డి ప్రభుత్వ హోమియో వైద్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మిర్యాలగూడ డివిజన్లో సీపీఎం నాయకుడిగా కొనసాగుతున్నారు. కుమార్తె కరుణ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మిర్యాలగూడ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా ఉన్నారు. చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి న్యాయవాది. ప్రస్తుతం ఆయన సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చిన్న కోడలు లక్ష్మి మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా ఉన్నారు. పోరాటమే ఊపిరిగా.. నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఆకర్షించి వారూ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. దొరల దురహంకారాన్ని ప్రశ్నిస్తూ పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. 1945–48 సంవత్సరాల మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. గెరిల్లా దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించారు. స్వరాజ్యాన్ని పట్టుకోవడానికి వీలుకాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగులబెట్టినా వెరవకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆమెను పట్టుకున్నవారికి రూ.10 వేలు బహుమతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ ప్రస్థానం ఇలా.. సాయుధ పోరాటం ముగిసిన తర్వాత స్వరాజ్యం రాజకీయాలలోకి వచ్చారు. రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) తరఫున ఎన్నికయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో కార్పస్ ఫండ్ చెల్లిస్తేనే కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. కానీ, మల్లు స్వరాజ్యం తుంగతుర్తి ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ప్రభుత్వంతో కొట్లాడి కార్పస్ ఫండ్ చెల్లించకుండానే జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అనేక భూసమస్యలను పరిష్కరించారు. 1985లో ప్రభుత్వం కూలిపోవడంతో.. 1985, 1989 రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు. స్వరాజ్యం జీవితకథ ‘నా మాటే తుపాకీ తూటా’పుస్తక రూపంలో ప్రచురించారు. వామపక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ’చైతన్య మానవి’సంపాదకవర్గంలో ఒకరుగా స్వరాజ్యం సేవలు అందించారు. 91 ఏళ్ల వయోభారంలోనూ ఆమె పీడిత ప్రజలకు అండగా పనిచేశారు. 8 దశాబ్దాల కిందట ఎర్రజెండాతో పెనవేసుకున్న మల్లు స్వరాజ్యం జీవితం కడవరకు పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది. -
పోరు జెండా: మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం... పోరాటానికి పర్యాయ పదం భూమికోసం.. భుక్తికోసం... పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‌పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్ చావుకు వెరవని గెరిల్లా యోధురాలు అసెంబ్లీలో ఆమె మాట తూటా పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా ఆమె పోరాటాల ఎర్రజెండా.. అన్నం పెట్టి... ఆలోచన మార్చుకుని.. బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే... చూస్తే అన్నం లేదు. బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడినుంచే ఆమె తిరుగుబాటు నేర్చుకున్నారు. మనుసులో ముద్రించుకుపోయిన ‘అమ్మ’ స్వరాజ్యంపై వాళ్లమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్)ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు. రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకుపోయింది. ఆ పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్ని సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు స్వరాజ్యం పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా... ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది. కూలీరేట్ల పెంపు... పెద్ద మలుపు.. తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుం» మే అయినా... ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్. అప్పటికే పోలీస్ పటేల్ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో బీఎన్ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే... అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న... సమ్మె జరిగేట్టు చూడాలె’ అంటూ బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె. అయినా వినలేదు... తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల పిల్ల కనుక ఆమెను దాటి వెళ్లలేకపోయారు. ఆరోజుకు వెనుదిరిగిండ్రు. మరునాడు పనిలోకి రానందుకు వాళ్ల చిన్నాయన కూలోళ్లను పిలిచి పంచాయతీపెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ... మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు. ఆమె గొంతెత్తితే స్వరాజ్యం... గొంతెత్తితే తెలంగాణ నేల ఊగింది ఉయ్యాల. చిన్నప్పటినుంచే ఆమెకు పాటంటే ప్రాణం. బాగా పాడుతోందని ఆంధ్రమహాసభ సమావేశాల్లో పాడించేవాళ్లు. పాలకుర్తి ఐలమ్మ పోరాటానికి మద్దతుగా సంఘం నిలబడాలనుకున్నది. పాలకుర్తిలో మీటింగ్ పెట్టారు. ఆ సభలో పాటలు పాడేందుకు స్వరాజ్యంను తీసుకెళ్లారు బీఎన్. సభ సక్సెస్ అయ్యింది. ఐలమ్మ పోరాటం ఫలించింది. ‘విస్నూరు దొర చేతిలో సచ్చినా సరే... భూమిని వదలను’ అని పోరు జేసిన ఐలమ్మ తనకు స్ఫూర్తి’ అని చెప్పేవారామె.. ‘ఏనాడు గడీలనొదిలి వాడల్లో జొరబడ్డానో... ఆ వాడలే నా ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాన్ని, నా పాటలకు బాణీలని, నా జీవితానికొక చరిత్రను ఇచ్చింది వాళ్లే’ అన్న స్వరాజ్యం 13 ఏళ్ల వయసులోనే విప్లవగీతమయ్యారు. విసునూరు దేశ్‌ముఖ్ దురాగతాలను ఎండగట్టే ఉయ్యాల పాటలను ప్రచారానికి ఆయుధంగా చేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమె ఉపన్యాసాలు విని జనం ఉర్రూతలూగారు. 16 ఏళ్లకే గెరిల్లా... భూస్వాముల దగ్గరున్న ఆయుధాల స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసుల దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్లో్ల కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక. నల్గొండ, వరంగల్జిల్లాల్లో దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి. తాడి, ఈత చెట్లపై నిజాం సర్కార్పెత్తనాన్ని సవాలు చేస్తూ... ‘గీసేవాడిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏరా>్పటు చేయడం, తాళ్ల పంపకం, భూ పంపకం సమర్థవంతంగా నిర్వహించారు స్వరాజ్యం. ఎన్నటికీ మరవని సంఘటన... ఓ కోయగూడెంలో షెల్టర్ తీసుకున్నది దళం. ఆ ఇంట్లో బాలింత, ఆమె తల్లిద్రండులు ఉన్నారు. ఎట్ల తెలిసిందో ఏమో పోలీసులు గుడిసెను చుట్టుముట్టిన్రు. లోపలికి వస్తే స్వరాజ్యంను చూస్తారని దర్వాజ దగ్గరకెళ్లింది ఇంటి యజమాని సమ్మక్క. చంటిపిల్లను తీసుకుని స్వరాజ్యం బయటపడ్డది. కానీ ఆ కోయ స్త్రీని స్వరాజ్యం అనుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. వెంటనే వెనక్కి వచ్చి ఆ పసిబిడ్డను వెనక్కి ఇచ్చేయడానికి లేదు. రెండు మూడు రోజులు దళంతో ఉంచుకోవాల్సి వచ్చింది. పాలు సరిగ్గా దొరక్క శిశువు మరణించింది. తాను స్వరాజ్యం కాదని పోలీసులకూ చెప్పలేదు. వారం రోజుల తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు ఆమెను వదిలిపెట్టారు. ఆమె గ్రామానికి వచ్చాక వెళ్లి కలిసింది దళం. ఆ తల్లిని చూసి కన్నీల్లు పెట్టుకున్నారు స్వరాజ్యం. ‘నీ బిడ్డను ఎత్తుకునిపోయి తప్పు చేశాను. వదిలిపెట్టినా బాగుండేదేమో’ అని పశ్చాత్తాప పడ్డారు. ‘నా బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నవు... కానీ ప్రజలకోసం నిన్ను వదులుకున్నది కదా మీ అమ్మ’ అని ఓదార్పు మాటలు పలికిందట ఆమె. ఆ ఇద్దరు తల్లుల త్యాగాన్ని నేనెప్పటికీ మరవను అని చెప్పేవారామె. బియ్యం బుక్కి... సాయుధ పోరాట విరమణ తరువాత.. 1954లో ఆమె పేరు మీద ఉన్న పదివేల రివార్డును ఎత్తివేసింది ప్రభుత్వం. అదే ఏడు హైదరాబాద్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఏడేళ్ల అజ్ఞాతవాసం తరువాత వేదికనెక్కిన ఆమెను చూడగానే ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆమె ప్రసంగం విన్న జనం ఉర్రూతలూగారు. ఆ సభ అనంతరం మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. భూస్వామ్య కుటుంబంనుంచి వచ్చినా... తల్లిద్రండుల నుంచి నుంచి గుంటెడు జాగ కూడా తీసుకోలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి సరిగ్గా లేని రోజులు. ఎప్పుడూ జొన్న గటక, జొన్నరొట్టెలే అన్నట్టుగా ఉండేది. దొరకక ఓసారి బియ్యం దొరికినయ్. అప్పుడు స్వరాజ్యం పచ్చి బాలింత. ఆకలైతుంటే... అవి వండి తినేసరికి ఆలస్యమైతదని పచ్చిబియ్యం బుక్కి కడుపు నింపుకొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా... ఎంచుకున్న మార్గంలో కష్టాలుంటయి మధ్యలో కంగారు పడితే లాభం లేదని బలంగా నమ్మారామె. ఏనాడూ తన మార్గం తప్పలేదు. నిజాయితీని వీడలేదు. ఎమ్మెల్యేగా మాటల తూటాలు.. సాయుధ పోరాట విరమణ తరువాత... 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు స్వరాజ్యం. 5వేల ఓట్ల తేడాతో విజయం సాధించారామె. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆమె అసెంబ్లీకి వెళ్తే... బంట్రోతు లోపలికి వెళ్లనివ్వలేదు. ‘నేను ఎమ్మెల్యేను’ అని ఆమె చెప్పుకున్నా నమ్మలేదు. అంత సాదాసీదాగా అసెంబ్లీకి వెళ్లేవారామె. చట్టసభల్లో తన బాధ్యతనూ ఉద్యమంలాగే భావించారు. ఆమె సమస్యలపై స్వరాజ్యం మాట్లాడితే...అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘మాటలు తూటాల లెక్కన పేలుస్తున్నవ్... ఇది బహిరంగసభ కాదు. అసెంబ్లీ’ అన్నారు. ఒక్కసారి మైక్ పట్టుకున్నారంటే అంతలా ఉండేది ఆమె వాగ్ధాటి. పోరాటం చేయని సమస్య లేదు... భూదానోద్యమంలో ఇచ్చినవి, పోరాటకాలంలో కమ్యూనిస్టులు పంచిన భూములు యూనియన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఆక్రమించుకున్నరు దొరలు. ఎమ్మెల్యేగా ఉండి తిరిగి వాటిని ప్రజలకు అప్పగించడానికి రాజీలేని పోరాటం చేశారు. 900 ఎకరాల భూమిని తిరిగి ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే పదవీ వీడాక కూడా ఆమె పోరాట పంథాను వీడలేదు. 1993లో సంపూర్ణ మద్యనిషేధంలో ఆమెది చురుకైన పాత్ర. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమానహక్కు, వరకట్న వ్యతిరేక చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళల పేరిట భూ పంపిణీ... స్వరాజ్యం పోరాటం చేయని సమస్యే లేదు. గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
అలుపెరుగని ఉద్యమ గురువు రవూఫ్
సాక్షి , కదిరి: ఉద్యమ సహచరులు ‘విశ్వం’ అని పిలిచినా..పీడిత, తాడిత పేదలు రవూఫ్ సార్ అని పిలిచినా..ఉద్యమం వైపు ఆకర్షితులైన యువకులు ‘తాతా’ అని పిలిచినా ఆయనే కామ్రేడ్ రవూఫ్. ఆయన ఉద్యమమే ఊపిరిగా పనిచేశారు.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. నక్సల్బరి ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విస్తరింపజేయడంతో పాటు చైనా దేశీయ కమ్యూనిస్టులను సైతం ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఎప్పుడూ మూసధోరణిలో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని ఆరోజుల్లోనే ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. ఆయన మాటలను పాటించినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్‌లకు ప్రస్తుత దుస్థితి ఉండేది కాదేమో... షేక్ అబ్దుల్ రవూఫ్ (ఎస్ఏ రవూఫ్) 1924లో కదిరి పట్టణంలోని సాహెబ్బీ, మదార్‌సాబ్ దంపతులకు జని్మంచారు. ఇంటర్ వరకూ కదిరిలో చదివి తర్వాత కర్ణాటకలోని గుల్బర్గాలో న్యాయవాద విద్యనభ్యసించారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్ భావాలకు ఆకర్షితుడైన రవూఫ్ 1964–65 కాలంలో కమ్యూనిస్ట్ పారీ్టలో చేరారు. కొన్ని కారణాల వలన అందులో ఇమడలేక పోయారు. కామ్రేడ్ చార్‌మజుందార్ పిలుపు మేరకు 1967లో న్యాయవాద వృత్తిని సైతం వదులుకొని సీపీఐ (ఎంఎల్)లో పూర్తి స్థాయి కార్యకర్తగా చేరి ఉద్యమ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. 1970లో సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1973లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఆయన జీవితమే మలుపు తిరిగింది. సాయుధ పోరాటానికి కొంతకాలం విరామం ప్రకటిద్దామని సీపీఐ(ఎంఎల్)అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య ప్రతిపాదనను రవూఫ్ తిరస్కరించారు. ‘ఉద్యమంలో విరామం ఉండదు..ఉద్యమం నిరంతర ప్రవాహం లాంటిది’ అంటూ జైలు నుంచే తన నిర్ణయాన్ని కొండపల్లి సీతారామయ్యకు చేరవేశారు. ఉద్యమానికే జీవితం అంకితం.. కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రవూఫ్ కీలక పాత్ర పోషించారు. తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశారు. కదిరి నగర పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన అప్పట్లో పేదలకు పన్ను నుంచి విముక్తి కల్పించారు. 1967లో కదిరి అసెంబ్లీకి సీపీఎం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వివాహానికి, బంధుప్రీతికి దూరంగా ఉండిపోయిన ఆయన..తన చివరి రోజుల్లో కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లలోని ఓ పూరి గుడిసెలో సాదాసీదా జీవితాన్ని గడిపారు. 2014 ఫిబ్రవరి 9న ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి కుటాగుళ్లలోనే అంత్యక్రియలు నిర్వహించి, గుర్తుగా రవూఫ్ స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన పేరిట కదిరి–కుటాగుళ్ల అనంతపురం జాతీయ రహదారిలో ఒక కాలనీ కూడా కుటాగుళ్లకు చెందిన గ్రామస్తులు ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అంతర్జాతీయ రాజకీయ మార్పులకనుగుణంగా ఉద్యమ పంథా.. రవూఫ్ అభిప్రాయాన్ని కొండపల్లి ఖాతరు చేయలేదు. ఈ సమయంలోనే అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు ప్రభుత్వాల చేత అణచివేయబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని కాపాడుకునేందుకు చైనాలోని టెంగ్–హువా,ఆల్బేనియన్ పార్టీలు నూతన సిద్ధాంతాన్ని (మావో సేటుంగ్ థాట్)ను ప్రతిపాదించగా కొన్ని మినహా దాదాపు అన్ని కమ్యూనిస్ట్ పారీ్టలు ఆమోదించాయి. ఎమర్జెన్సీ అనంతరం జైలు నుంచి విడుదలైన కామ్రేడ్ రవూఫ్ ఈ సిద్ధాంతాలు కొన్ని మార్పులు చేసి ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీ–సీపీఐ (ఎంఎల్)ను 1979లో స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రాలకు విస్తరింపజేశారు. అంతర్జాతీయ రాజకీయ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ రవూఫ్ వాటికనుగుణంగా ఉద్యమ పంథాలో కూడా మార్పులు చేస్తూ వచ్చారు. 1983లో మరోసారి రవూఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జైలులో ఉన్న సమయంలో 1985లో ఆర్‌ఓసీలో చీలిక ఏర్పడింది. జైలు నుంచి విడులయ్యాక రవూఫ్ 1989లో సీపీఐ (ఎంఎల్) రెడ్ఫ్లాగ్లో చేరి ఉద్యమాన్ని ఆం«ధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరింపజేశారు. 1999లో నక్సల్బరి, సీపీఐ(ఎంల్) విలీనమయ్యాయి. ఆ విలీన పారీ్టకి కామ్రేడ్ రవూఫ్ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. -
ప్రముఖ సంపాదకుడు రాఘవాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సంపాదకుడు, సాహితీవేత్త, కమ్యూనిస్టు నేత చక్రవర్తుల రాఘవాచారి (80) కన్నుమూశారు. కిడ్నీక్యాన్సర్తో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో నెలక్రితం చికిత్సకోసం చేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. ఉదయం 7గంటల సమయంలో ఆయన భౌతికకాయాన్ని హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూం భవన్లో ఉంచారు. అక్కడ ఆత్మీయులు, ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం విజయవాడకు తరలించారు. రాఘవాచారికి భార్య జ్యోత్న్స, కుమార్తె డాక్టర్ సి.అనుపమ ఉన్నారు. విశాలాంధ్ర సంపాదకునిగా 33 ఏళ్లు రాఘవాచారి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురానికి చెందిన వరదాచారి, కనకమ్మ దంపతులకు 1939 సెప్టెంబర్ 10న జన్మించారు. నిబద్ధత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు.ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం వరంగల్‌లోనే పూర్తి చేశారు. హైదరాబాద్‌లో లా చదివారు.ఆయనకు విజ్ఞాన నిఘంటువుగాను, మేధావిగాను ఎనలేని గుర్తింపు ఉంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్ధి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 33 ఏళ్ల పాటు విశాలాంధ్ర పత్రిక సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి..సీపీఐ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యునిగా వ్యవహరించారు. 1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఢిల్లీ నుంచి వెలువడే ‘పేట్రియట్’దినపత్రిక, లింక్ వార పత్రికలకు ఆయన హైదరాబాద్ పాత్రికేయునిగా పనిచేశారు. కొద్దికాలం ఢిల్లీలో కూడా పనిచేశారు. పార్టీ కార్యకలాపాల్లో పరిచయమైన విజయవాడకు చెందిన జ్యోత్స్నను ఆయన 1969లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. రాఘవాచారి భౌతికకాయం వద్ద విషణ్న వదనాలతో కుటుంబ సభ్యులు ఏడేళ్ల కిందటే కిడ్నీ క్యాన్సర్.. ఏడేళ్ల క్రితం రాఘవాచారి కిడ్నీ క్యాన్సర్‌తో అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతలో ఉన్నప్పటికీ ఆయన సమకాలీన అంశాలపై పూర్తి అవగాహనతో ఉండేవారు. ఇటీవల కిడ్నీ క్యాన్సర్ తిరగబెట్టడంతో తన కుమార్తె అనుపమ వైద్యురాలిగా పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చికిత్సకు చేరారు.అక్కడే తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయమన్నారు.కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు.అదేవిధంగా సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రముఖ పరిశోధకుడు, కవి జయధీర్ తిరుమలరావు రాఘవాచారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. రాఘవాచారి సేవలు మరువలేనివి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాఘవాచారి విలువల ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని కొనియాడారు. తెలుగు పాత్రికేయ రంగంలో రాఘవాచారి చేసిన సేవలు మరువలేనివని శ్లాఘించారు. ఆయన రచనలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయరు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాఘవాచారి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోకి తీసుకువెళ్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు -
వీర తెలంగాణ సాయుధ సేనాని
సాక్షి, తెలంగాణ: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉంది. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త. 1925లో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు రెండో సంతానంగా భీమిరెడ్డి నర్సింహా రెడ్డి జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే బీఎన్‌రెడ్డి వీరతెలంగాణ రైతాంగ పోరాట బాటపట్టారు. 1945లో ఆయన సరోజను వితంతు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. 1957, 1967లలో రెండుసార్లు తుంగతుర్తి, సూర్యాపేటల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1971, 1984, 1991లో మిర్యాలగూడ పార్లమెంటు నియొజకవర్గం (2009లో రద్దయ్యింది) ఎంపీగా ఎన్నికయ్యారు. 1975 నుంచి 1983 వరకు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ(ఎం)కు..రాం రాం పార్టీలో సామాజిక న్యాయం కోసం పట్టుబట్టిన ఆయన చివరకు 1997లో సీపీఐ(ఎం)ను వీడారు. ఆ తర్వాత బీఎన్ సీపీఎంను స్థాపించారు. అనంతరం మద్దికాయల ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐలో తన పార్టీని విలీనం చేశారు. వందెకరాల సొంత భూమిని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. సాయుధ పోరాట యోధుడు బీఎన్ సిసలైన ఉద్యమాల వీరుడు. పోరాటాలకు నిలువెత్తు రూపం. భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయంగా తుపాకీ చేతబట్టి పేదల పక్షాల నిలిచిన ధీరోదాత్తుడు. తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా సేనాని. ’దున్నేవాడిదే భూమి’ అంటూ నినదించి.. వంద ఎకరాల తన భూమిని ప్రజలకు పంచిన త్యాగశీలి. సమరశీల పోరాటాలు రచించడంలో ఉద్దండుడు. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి వీ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముందు నిలిచారు. బి.ఎన్.రెడ్డి. ధనవంతుల కుటుంబంలో జన్మించినా.. ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమ సమాజం వైపే. స్థానిక జమీందారుల నిరంకుశత్వానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం.. చివరకు నిజాం అరాచకాలపై వ్యతిరేక పోరుగా.. ఆపై సాయుధ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ మొదటి దశ నేతలల్లో అగ్ర భాగాన నిలిచిన బీఎన్ రెడ్డి, చివరి దశ వరకూ పోరాటం సాగించారు. వీర తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానిగా... భూస్వాములకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. సాయుధ పోరాట సమన్వయానికి ఏడుగురి సభ్యులతో ఏర్పాటైన కమిటీకి బీఎన్ కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్య్రానంతరం తుంగతుర్తి కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన సీపీఎం వైపునకు వెళ్లారు 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా... గెలిచినా బీఎన్ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. పార్లమెంటు సమావేశాలకు బస్సులోనే వెళ్లిన సామాన్యుడు. అంత కాలం పదవుల్లో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిన ఆయన, తన కోసం చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు. పార్లమెంటు రాజకీయాల్లో.. రద్దయిన మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి మూడు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గం 1962లో ఏర్పడగా మొత్తం 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడుసార్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా కూడా పనిచేశారు. 1971లో మూడోసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం నుంచి మొదటిసారి పోటీచేసి టీపీఎస్ అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై 7604 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో బీఎన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీఎస్ రెడ్డితో తలపడి అపజయం పాలయ్యారు. అదే విధంగా 1980లో కూడా బీఎన్ రెడ్డి జీఎస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో సారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై 41,755 ఓట్ల మెజార్టీతో రెండోసారి లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి 6వ సారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై 8,263 ఓట్ల మెజార్టీతో మూడోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. -
దివికేగిన అరుణతార
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అరుణతార దివికేగింది. ప్రజా ఉద్యమ సారథి తన ప్రస్థానాన్ని ముగించారు. అవిశ్రాంత ప్రజా సేవకుడు, జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నేత తెలకపల్లి నరసింహయ్య(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లోని నివాసగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన1928 జూన్ 8న కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన తెలకపల్లి రామయ్య, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉన్నారు. అప్పట్లో చండ్ర పుల్లారెడ్డి, మండ్ల సుబ్బారెడ్డి, ఎర్రగుడి ఈశ్వరరెడ్డి, కర్నూలు సుంకన్న, పాణ్యం గఫూర్ వంటి నాయకులతో కలిసి పనిచేశారు. తర్వాత కాలంలో సీపీఎం ఏర్పడినప్పటి నుంచి 2005 వరకు జిల్లాలో పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. 1970 నుంచి 1997 వరకు జిల్లా కార్యదర్శిగా, 1978 నుంచి 2002 వరకు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు 1945లో టీసీ లక్ష్మమ్మతో వివాహమైంది. చంద్రం, తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు), హరి సంతానం. నరసింహయ్యతో పాటు టీసీ లక్ష్మమ్మ కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. నరసింహయ్య కమ్యూనిస్టుగా పని చేయడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని ఉద్యమంలోకి తేగలిగారు. రేపు అంత్యక్రియలు నరసింహయ్య పార్థివదేహం శుక్రవారం రాత్రి కర్నూలుకు చేరుకుంది. అంత్యక్రియలను ఆదివారం (20వ తేదీ) నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉంచుతారని, తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభమై 11 గంటలకు జమ్మిచెట్టు హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి తెలిపారు. నరసింహయ్య మరణం పార్టీకే కాదు.. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని సీపీఎం నాయకులు ప్రభాకరరెడ్డి, టి.షడ్రక్, బి.రామాంజనేయులు, గౌస్ దేశాయ్ పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటు తనంతో పాటు ప్రజా, కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. నరసింహయ్య మృతికి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
కమ్యూనిస్టు నేత శివరామిరెడ్డి కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్టు నేత, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) రాజధానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శివరామిరెడ్డి గురువారం బ్రెయిన్ డెడ్‌కు గురికావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసిన వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు డా. గురుప్రసాద్ శుక్రవారం ప్రకటించడంతో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శివరామిరెడ్డికి భార్య కొండమ్మ, కుమార్తెలు కల్పన, భగీరథి, ఝాన్సీ కుమారుడు భరద్వాజ్ రెడ్డి, అలుళ్లు, కోడళ్లు్ల, మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. శివరామిరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3గంటల వరకూ బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఆయన కుమార్తె సజ్జల భగీరథి నివాసంలో ఉంచారు. ఇంటికి చేరుకున్న ఎన్ఎస్ భౌతికాయం చూడగానే ఆయన భార్య కొండమ్మ దుఖాన్ని ఆపుకోలేకపోయారు. ఎన్ఎస్ కుమారుడు భరద్వాజ్, కుమార్తెలు ఝాన్సీ, భగీరథిలు, అల్లుడు సజ్జల దివాకర్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. శివరామిరెడ్డిని కడసారిగా చూసేందుకు ఆయన బంధుమిత్రులు, సీపీఐ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సురవరం సతీమణి విజయలక్ష్మి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ ఏఐటీయూసీ కార్యదర్శి గుజ్జుల ఓబులేశు, సీపీఐ కడప జిల్లా కా>ర్యదర్శి జి.ఈశ్వరయ్యలు పార్టీ జెండాను శివరామిరెడ్డి భౌతికాయంపై ఉంచి విప్లవ జోహర్లు అర్పించారు. నివాళులర్పించిన వారిలో సంపాదకులు ఏబీకే ప్రసాద్, గజ్జల అశోక్‌రెడ్డి, జె. శివాజీరెడ్డి, డాక్టర్ ఎన్ కరుణాకర్ రెడ్డి, ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఎన్ విశ్వేశ్వర్ రెడ్డి, ఎన్ సునీల్ రెడ్డి, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, పాలెం రఘునాథరెడ్డి, పి. సుదర్శన్ రెడ్డి సీపీఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి, డాక్టర్ డి. సుధాకర్, ఎన్ బాలమల్లేశ్, ఎల్. నాగ సుబ్బారెడ్డి, డబ్ల్యూ.వి. రాము, చెన్నకేశవరెడ్డి, వెంకట శివ, మైదుకూరు రమణ, డాక్టర్ సూరారెడ్డి, ఈటీ నరసింహ, ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాసరెడ్డి, సీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు చెన్నకేశవరావు, కేవీఎల్, డాక్టర్ రజని, ఐజేయూ నాయకురాలు అజిత తదితరులు ఉన్నారు. తొలితరం ప్రజాప్రతినిధి.. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి(ఎన్ఎస్) స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నేత. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1952లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర నేతగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. 2000 ఫిబ్రవరి1 నుంచి సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉంటూ నీలం రాజశేఖర్‌రెడ్డి, వైవీ కృష్ణారావుల అభినందన సంచికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ సంతాపం సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం శివరామిరెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు డా.గురుప్రసాద్ మీడియాకు తెలిపారు. గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివరామిరెడ్డికి గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. తొలితరం ప్రజాప్రతినిధి.. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ సంతాపం సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
కమ్యూనిస్ట్ నాయకుడు శివరామిరెడ్డికి తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రెడ్డి శివరామిరెడ్డి గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సోమాజీగుడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉండి శివరామిరెడ్డి చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం-పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా నర్రెడ్డి శివరామిరెడ్డి పనిచేశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. -
విప్లవ శిఖరానికి నేటికీ ఘన నివాళులు
హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో సమాధిని సందర్శించి మహానేతకు నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. గత ఏడాది నవంబర్ 25న క్యాస్ట్రో(90) కన్నుమూయగా, సంతాప సభలు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4వ తేదీన శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సరిగ్గా నెలరోజుల్లో రోజుకు రెండువేలకు పైగా అభిమానులు ఆయన సమాధిని దర్శించేందుకు తరలివస్తున్నారని క్యూబా అధికారులు తెలిపారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో 70 వేల మందికి పైగా ఆయన మృతికి నివాళులు అర్పించినట్లు యుదిస్ గార్సికా అనే అధికారి వెల్లడించారు. విప్లవ శిఖరం క్యాస్ట్రో స్వదేశమైన క్యూబా ప్రజలతో పాటుగా విదేశీ పర్యాటకులు ముఖ్యంగా జపాన్, ఇటలీ, మెక్సికో, గ్వాటిమలా దేశాల నుంచి అభిమానులు క్యాస్ట్రో సమాదిని దర్శించుకునేందుకు తరలిరావడం గమనార్హం. క్యాస్ట్రో సమాధిని దర్శించుకునే వరకూ తాను గెడ్డం గీసుకోనని ఓ సౌదీ యువరాజు ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా యుదిస్ గార్సికా ప్రస్తావించారు. తమ నాయకుడు కన్నుమూశాడని కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు నేతలు, అభిమానులు భావిస్తున్నారు. (ఇక్కడ చదవండి: శోకసంద్రంలో క్యూబా) ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హొల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆయన చేగువేరాతోపాటు వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు విప్లవ పోరాటం సాగించి 1959లో క్యూబాను విప్లవవీరుడు క్యాస్ట్రో హస్త్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాలపాటు మకుటంలేని మహరాజుగా క్యూబాను పాలించారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. బలమైన ప్రత్యర్థి దేశాలకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాడు క్యాస్టో. ఆయన చనిపోయినా.. ఆయనపై అభిమానం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందని వారు నిరూపిస్తున్నారు. -
శోకసంద్రంలో క్యూబా
ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో అంతటా విషాదం హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం దేశమంతటా ప్రజల విషాద వదనాలతో నిశ్శబ్దం అలముకుంది. ఎక్కడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలనూ నిర్వహించలేదు. 50 ఏళ్లు పాలన సాగించిన క్యాస్ట్రో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా తుది వీడ్కోలు పలికెందుకు దేశం సిద్ధమవుతోంది. సంతాప సభలు, 4 రోజుల పాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబరు 4న శాంటియాగోలో అంత్యక్రియలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. క్యాస్ట్రో 1953లో శాంటియాగో నుంచే విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి క్యాస్ట్రో(90) అనారోగ్యంతో తుది శ్వాస విడవడం తెలిసిందే. హవానాలోని చారిత్రక రివల్యూషన్ స్క్వేర్‌లో సంతాప సభలు సోమవారం మొదలవుతాయి. నా జీవితం కంటే ఎక్కువ... క్యాస్ట్రో మరణంతో క్యూబన్ల గుండెలు పగిలారుు. ‘ఏం చెప్పగలను? క్యాస్ట్రో నా జీవితం కంటే ఎక్కువ’ అని కన్నీటి పర్యంతమయ్యారు 82 ఏళ్ల ఆరోరా మెండెజ్. పేదల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ప్రస్తుత క్యూబా జనాభాలో చాలామంది పుట్టక ముందే క్యాస్ట్రో పోరాటం, ధీరత్వం... స్కూలు పుస్తకాలు, పత్రికలన్నింటా నిండిపోయారుు. మార్గదర్శకుడిగా నిలిచి, సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన యోధుడు లేకుండా వారు తమ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. కొందరు మాత్రం... ఫిడెల్ మరణంతో ఆయన తమ్ముడు, అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుం దని భావిస్తున్నారు. అంత్యక్రియలకు క్యాస్ట్రో సోదరి దూరం మయామి: ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలకు ఆయన సోదరి జువానిత హాజరుకాబోవడం లేదని అమెరికా మీడియా పేర్కొంది. ‘ఫిడెల్ అంత్యక్రియలకు వెళుతున్నానన్న ఊహాగా నాల్లో నిజం లేదు. తిరిగి క్యూబాకు వెళ్లే ప్రసక్తే లేదు’ అని దశాబ్దాలుగా అమెరికాలోని మియామీలో ఉంటున్న జువానిత చెప్పారని వెల్లడించింది. ఫిడెల్ కమ్యూనిస్టు ప్రభుత్వా న్ని జువానిత బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. క్యాస్ట్రోను తొలగించేం దుకు సీఐఏకు సహకరించారని ఆమెపై ఆరోపణలున్నారుు. -
సమీర్ గైక్వాడ్‌కు బెయిల్ నిరాకరణ
ముంబై: హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యకేసులో అరెస్టయిన సనాతన్ సంస్థ సభ్యుడు సమీర్ గైక్వాడ్ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేరంతో అతని ప్రమేయానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆధారం ఉందని పేర్కొంది. పన్సారేను చంపినట్టు గైక్వాడ్ ఓ మహిళకు ఫోన్లో చెప్పినట్లుగా ఉన్న ఆడియో సంభాషణను కోర్టు ప్రస్తావించింది. ‘గైక్వాడ్‌కు పన్సారేతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయితే సైద్ధాంతిక విభేదాలున్నాయి. అందుకే ఆయన హత్యకు గురయ్యారు’ అని స్టసిస్ సీవీ భదాంగ్ పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్య జరిగిందని పోలీసులు సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొల్హాపూర్‌లో మార్నింగ్ వాక్కు వెళ్లిన పన్సారే దంపతులను దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. -
ఇదేమిటి కామ్రేడ్!
విషయం, సమయం, సందర్భం అనేవి ఏవీ చూసుకోకుండా ఒకేవిధంగా మాట్లాడే వారిని చూసి ‘‘పెళ్లికీ, తద్దినానికీ ఒకటే మంత్రమా’’ అంటూ పక్కనున్న వారు విసుక్కోవడం అప్పుడప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తుంటుంది. ఒక వామపక్షనేత మాటలు, ప్రకటనలు వింటుంటే ఒక్కోసారి ఇదే సామెత స్ఫురణకు వస్తుందని ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటుంటారు. సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేసినా, ముఖ్యమైన సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు, వినతులు సమర్పించినా, విలేకరుల సమావేశాల్లో మాట్లాడినా తప్పనిసరిగా ఆయన ఒక డిమాండ్‌తో ముగిస్తూ ఉంటారు. సమస్య ఎంత జఠిలమైనదైనా, అంతగా ప్రాధాన్యత లేనిదైనా ఆయన అదే డిమాండ్‌ను చేయడం పరిపాటిగా మారిందని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. తీవ్రమైన ఈ సమస్యపై సీఎం వెంటనే స్పందించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ వర్గాల సమస్యలను పరిష్కరించాలనీ, ఆర్టీసి కార్మికుల సమ్మెను విరమింపజేయాలి అంటూ దీనికోసం వెంటనే అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటుచేయాలనీ డిమాండ్ చేసేస్తుంటారు. ఆయన ప్రస్తావించే చిన్నా, పెద్దా సమస్యలన్నింటిపై ప్రభుత్వం ఆల్‌పార్టీ మీటింగ్ జరపడం సాధ్యమేనా అని మిగతా పార్టీల నాయకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తుంటారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయా సమస్యలపై వినతిపత్రాలను సమర్పించేందుకు రాజకీయపక్షాల నాయకులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, అందువల్ల కనీసం అఖిలపక్షభేటీలను నిర్వహిస్తేనైనా ఆయా సమస్యలను స్వయంగా ప్రస్తావించవచ్చునని తరచుగా ఆ కమ్యూనిస్టునేత ఈ డిమాండ్ చేస్తూ ఉండవచ్చునని మరోనేత ముక్తాయింపునివ్వడం విశేషం. -
కమ్యూనిస్టు యోధుడు పర్సా కన్నుమూత
- పాల్వంచ ఎమ్మెల్యేగా సేవలు.. నేడు కొత్తగూడెంలో అంత్యక్రియలు కొత్తగూడెం: తొలితరం కమ్యూనిస్టుయోధుడు, సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ(91) శుక్రవారం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కన్నుమూశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంభంపాడుకు చెందిన వెంకట సుబ్బమ్మ, వెంకటరామరాజు దంపతులకు 1924లో ఆయన జన్మిం చారు. సత్యనారాయణ 1940 ప్రాంతంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం వచ్చి కమ్యూనిస్టు యోధులు శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యలతో కలిసి కార్మికోద్యమాలను నిర్మించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిం చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొత్తగూడెం, పాల్వంచ దళాలకు నాయకత్వం వహించారు. నిజాం ప్రభుత్వం ఆయనను జై ళ్లలో నెలల తరబడి బంధించింది. నిజాం సైన్యం ఆయనను కాల్చేయమని ఆజ్ఞాపించినా పోలీస్ అధికారి సహాయంతో ఆయన మరణం నుంచి తప్పించుకున్నారు. 1957లో పీడీఎఫ్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలోని అప్పటి పాల్వంచ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1962లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో సీపీఎం తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1970లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్(సీఐటీయూ)ను నెలకొల్పి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. సత్యనారాయణకు భార్య భారతీదేవి, ఇద్దరు కుమారులు చక్రపాణి, మురళి, ముగ్గురు కుమార్తెలు వాణి, పద్మశ్రీ, లీల ఉన్నారు. ఐదేళ్లుగా ఏలూరులోని చిన్నకుమార్తె లీల వద్ద ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని ఏలూరు నుంచి కొత్తగూడెం తరలించనున్నారు. శనివారం జరిగే పర్సా అంత్యక్రియల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలు రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. సీపీఎం సంతాపం హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ మృతికి సీపీఎం సంతాపం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో జరిగిన సంతాపసభలో పర్సా చిత్రపటానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు, కార్మికోద్యమ చరిత్రలోని కీలకమైన ఘట్టాల్లో పర్సా పాత్ర ఉందని రాఘవులు అన్నారు. పర్సా సత్యనారాయణ మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరె డ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. పర్సా మృతి కార్మికవర్గానికి తీరని లోటని నివాళులర్పించారు. -
వాస్తవికవాది, కమ్యూనిస్టు యోధుడు పన్సారే..
మురికితనం, కరుకుతనం ఆ సుకుమార హృదయాన్ని నిలువెల్లా గాయం చేస్తే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకు వెళ్లిపోయాడు గోవింద్ పన్సారే. అనేకానేక అస్థిత్వ ఉద్యమాలకు, అణగారిన వర్గాల పోరాటాలకు నెలవైన మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో జరిగిన రెండో హత్య ఇది. హేతువాద ఉద్యమకారుడైన డాక్టర్ నరేంద్ర దబోల్కర్‌ను 2013 ఆగస్టులో పన్సారే మాదిరే మితవాద మతతత్వ శక్తులు పొట్టనబెట్టుకున్నాయి. నిందితుల్ని వదలబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దుండగుల ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షలు ఇస్తామని, నిందితుల వేట కొనసాగుతోందని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. గత అనుభవాల దృష్ట్యా పోలీసు మాటల్ని విశ్వసించలేమని వామపక్షాలు కుండబద్దలు కొట్టాయి. ఈ నెల 16న 82 ఏళ్ల పన్సారే, ఆయన భార్య ఉమ కొల్హాపూర్‌లోని తమ ఇంటికి సమీపంలో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండ గులు కాల్పులు జరిపి పారిపోయారు. తూటా దెబ్బలకు గిలగిల్లాడిన ఆ దంపతులకు కొల్హాపూర్ ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పన్సారేను ముంబాయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి హెలికాఫ్టర్‌లో తరలించారు. ఆయన అప్పటికే చనిపోయారు. కమ్యూ నిస్టులు, ప్రగతిశీలురు తల్లడిల్లారు. కార్మిక లోకం భగ్గుమంది. సామా జిక ఉద్యమకారులు దిగ్భ్రాంతి చెందారు. 1933 నవంబర్ 26న అహ్మద్‌నగర్ జిల్లా కొల్హాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. ఐదుగురి సంతానంలో చివరివాడైన పన్సారేకు చిన్నతనంలోనే కష్టాలు ఎదుర య్యాయి, వారసత్వంగా వచ్చిన ఐదెకరాల ఆస్తిని వడ్డీ వ్యాపారులు లాగేసుకోవడంతో ప్రాథమిక విద్యకు సైతం ఇబ్బందిపడ్డారు. చదువు ఖర్చు కోసం ఇంటింటికీ తిరిగి న్యూస్‌పేపర్లు వేశారు. కొల్హాపూర్ మున్సిపల్ స్కూల్లో ప్యూన్‌గా పని చేశారు. బీఏ పూర్తయిన తర్వాత మున్సిపల్ స్కూలు టీచర్‌గా చేశారు. ప్రజా సమస్యలకు న్యాయ చట్రంలోనే పరిష్కారం కనుక్కోవాలన్న కాంక్షతో లాయర్ పట్టాపుచ్చుకుని కొల్హాపూర్ కోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు. 1964లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. తాను డబ్బు జబ్బుకు ఎన్నడూ గురికాలేదు. బడుగు, బలహీనవర్గాల సంక్షే మం, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ మరువలేదు. కమ్యూనిస్టు పార్టీ చీలికకు కొద్ది ముందు సీపీఐలో చేరిన పన్సారే తుది శ్వాస విడిచే వరకు అందులోనే కొనసాగారు. పార్టీలో పిడివాదులకు వ్యతిరేకంగా తన అభి ప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేవారు. అది మరాఠా భాషా ఉద్య మమైనా, గోవా స్వాతంత్య్ర పోరాటమైనా, మరాఠా రాజు ఛత్రపతి శివాజీని కొందరు స్వంతం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినా, జాతీయ రహదారులపై టోల్గేట్ వసూళ్ల వ్యతిరేక ఆందోళనైనా... అంతే చిత్తశుద్ధితో అంకిత భావంతో నడిపారు. పట్టుదల, దూరదృష్ట్టికి మారుపేరు. మంచి కార్మిక నాయ కుడు, వక్త, రచయిత. 21కి పైగా పుస్తకాలు రచించారు. అందులో ఖ్యాతి గాంచిందీ, వివిధ భాషల్లోకి అనువాదమైందీ, లక్షన్నర ప్రతులు అమ్ముడైందీ- ‘శివాజీ ఎవరు?’ అనే పుస్తకం. ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదని తేల్చిచెప్పిన పుస్తకం అది. పదేళ్ల కిందట లాయరైన తన ఏకైక కుమారుడు 35 వయస్సులో చనిపోయినప్పుడు మూడోనాడే రోడ్డెక్కి కార్మికుల ఆందోళనలో పాల్గొన్న ధీశాలి. ఇటీవలి కాలంలో ఆయన చేపట్టిన టోల్‌ట్యాక్స్ వ్యతిరేక ఉద్యమం స్వల్పకాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది. ఆయన లెక్కలో టోల్‌ట్యాక్స్ అనేది అన్యాయం, అక్రమమే కాక రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురి పించే పెద్ద వనరు. అందుకే ఆయన ఓ పక్క ప్రజా పోరాటాన్ని నడుపు తూనే మరోపక్క న్యాయ పోరాటాన్ని చేపట్టారు. ఇదే సమయంలో ఆయన.. గాంధీని హత్య చేసిన గాడ్సేని కీర్తిస్తున్న వారినీ వదిలి పెట్టలేదు. ఇది సైతం కొన్ని శక్తులకు కంటగింపుగా మారింది. బహుశా ఈ శక్తులే పన్సారేను పొట్టనబెట్టుకున్నాయన్నది ప్రజల అభిప్రాయం. ఆయన్ను భౌతికంగా లేకుండా చేయవచ్చు గానీ అణగారిన వర్గాల హక్కులకు, అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని చెరిపేయలేరు. మరుగుపరచలేరు. ఆయనకు ఇదే నా నివాళి. (గోవింద్ పన్సారే హత్యకు నిరసనగా నేటి ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో సంతాపసభ జరుగనుంది) ఎ.అమరయ్య మొబైల్ : 9912199494 -
కామ్రేడ్ పాన్‌సరేకు లాల్‌సలాం!
వేలాది మంది అశ్రునయనాల మధ్య కమ్యూనిస్టు నేతకు అంతిమ వీడ్కోలు సాక్షి, ముంబై/కొల్హాపూర్: ప్రముఖ హేతువాది, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, టోల్ పన్ను వ్యతిరేక ఉద్యమకారుడు గోవింద్ పాన్‌సరేకు వేలాది మంది తమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 16న కొల్హాపూర్‌లో దుండగుల కాల్పులకు గురైన పాన్సరే శుక్రవారం అర్థరాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మెరుగైన చికిత్స కోసం 82 ఏళ్ల పాన్సరేను కొల్హాపూర్ నుంచి శుక్రవారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం అధికం కావడంతో మరణించారని జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్ టీపీ లహానే ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం మధ్యాహ్నం తిరిగి కొల్హాపూర్ తీసుకొచ్చారు. పాన్సరే హత్యను అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. నిస్వార్థపరుడైన పాన్సరేను హత్య చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. ఈ నేరానికి పాల్పడిన దుండగులను శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, ఆర్పీఐ పార్టీల నేతలు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. పాన్సరే హత్యకు నిరసనగా, ఆయన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సీపీఐ సమా అన్ని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని బీఆర్పీబీఎం పార్టీలు మద్దతు పలికాయి. ఓ ప్రగతిశీల నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని, పేదలకు న్యాయం చేకూర్చేందుకు ఆయన చేసిన పోరాటాన్ని రాష్ట్రం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు. పాన్సరే హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. ఎర్ర సముద్రాన్ని తలపించిన కొల్హాపూర్ కామ్రేడ్ పాన్‌సరేకు లాల్ సలాం అన్న నినాదాలతో కొల్హాపూర్ శనివారం హోరెత్తిపోయింది. పాన్సరే అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ప్రజలతో కొల్హాపూర్ పట్టణం ఎర్రసముద్రాన్ని తలపించింది.పంచగంగ నదీ తీరంలో పాన్సరే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కమ్యునిస్ట్ నాయకులు, కార్యకర్తలతో ఆ పరిసరాలు ఎరుపెక్కాయి. ‘రెడ్ సెల్యూట్ టూ పాన్సరే’, ‘లాల్ సలాం - పాన్సరే అమర్హ్రే’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దసరా చౌక్‌లో అంతిమ దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. వేలాది మంది ఆయనను చివరిసారిగా చూసి నివాళులు అర్పించారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పంచగంగ నదీతీరం వైపు అంతిమయాత్రను ప్రారంభించారు. నదీ తీరంలో పాన్సరే భౌతికకాయనికి ఆయన కోడలు మనమళ్ల చేతులమీదుగా దహన సంస్కారం పూర్తిచేశారు. విమానాశ్రయంలోనే ఒక గంటపాటు భౌతికకాయం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోవింద్ పాన్సరే భౌతికకాయం ఒక గంటపాటు విమానాశ్రయంలో ఉండిపోయింది. పాన్సరే మరణానంతరం శనివారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకగంట ఆలస్యంగా కొల్హాపూర్‌కు బయలుదేరాల్సి వచ్చిందని శాసన మండలి సభ్యుడు కపిల్ పాటిల్ ఆరోపించారు. ఒక్క అధికారి కూడా ఎయిర్పోర్ట్ వద్దకి రాలేదన్నారు. ఉదయం 10.20 గంటలకు తాము పాన్సరే భౌతిక కాయాన్ని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చామని, కానీ 11..54 గంటలకు కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానం బయల్దేరిందని చెప్పారు. దీంతో తాము 12.55 గంటలకు కొల్హాపూర్ చేరుకున్నామన్నారు. కాల్పులు జరిపింది మరాఠీ భాషీయులే సాక్షి, ముంబై: గోవింద్ పాన్సరే దంపతులపై కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని భావిస్తున్నారు. గోవింద్ పాన్సరే సతీమణీ ఉమా పాన్సరే పోలీసులకు అందించిన వివరాల మేరకు కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని వెల్లడైంది. కోల్హపూర్‌లో చికిత్స పొందుతున్న ఆమె దర్యాప్తు అధికారితో మాట్లాడారు. ఈ నెల 16న తామిద్దరం వాహ్యాళికి వెళ్లిన ప్పుడు తమకు ఎదురైన దుండగులు ‘మోరే యెతే కుటే రహతాత్..? (మోరే ఎక్కడ ఉంటారు..?)’ అని ప్రశ్నించారు. అనంతరం సుమారు 15 నుంచి 17 నిమిషాలకు తాము ఇంటివైపు వెళ్లే సమయంలో మళ్లీ వారిద్దరు మోటర్‌సైకిల్ వచ్చి కాల్పులు జరిపారు’ అని ఆమె పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దుండగులు ముందుగా తన భర్త గోవింద్ పై కాల్పులు జరిపారని, ఆయనకు అడ్డుగా వెళ్లిన తనపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు. -
'రాష్ట్రంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు'
ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించాయని శివసేన ఆరోపించింది. సీపీఐ పార్టీ సీనియర్ నేత గోవింద్ పన్సారేపై కాల్పుల ఘటనను ఆ శివసేన ఖండించింది. పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఘటనకు ఎవరు బాధ్యలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో నేరగాళ్లు, ఖూనీ కోరులు బోర విడిచి తిరుగుతున్నారని ఆరోపించింది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని విమర్శించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుడు నరేంద్ర దబోల్కర్ దారుణ హత్యకు గురయ్యారని గుర్తు చేసింది. నాటికి నేటికి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ మాత్రం మారలేదని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ హితానికి చేస్తున్న కృషిని శివసేన ఈ సందర్భంగా అభినందనీయమని శివసేన పేర్కొంది. మంగళవారం శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేరకు పేర్కొంది. మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఆగంతుకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు.అయితే పన్సారే చత్రపతి శివాజీపై ఓ బుక్‌లెట్‌ను ప్రచురించారు. అది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
కమ్యూనిస్టు నేత ఎంవీ రాఘవన్ కన్నుమూత
కన్నూర్(కేరళ): ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ మంత్రి ఎం.వీ. రాఘవన్(81)ఆదివారం కన్నూర్ జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందారు. రాఘవన్ మృత దేహానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిప్రాయ భేదాల కారణంగా సీపీఎం ఆయనను 1985లో బహిష్కరించింది. 1986లో ఆయన కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్‌లో భాగస్వామిగా కొనసాగుతోంది. చేనేత కార్మికుడైన రాఘవన్ తొలుత ట్రేడ్‌యూనియన్ నాయకుడుగా, ఆ తరువాత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. రాఘవన్ ఏడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. **