వీర తెలంగాణ సాయుధ సేనాని | Special Story On Communist Leader Bheemireddy Narasimha Reddy | Sakshi
Sakshi News home page

వీర తెలంగాణ సాయుధ సేనాని

Published Thu, Mar 14 2019 9:51 AM | Last Updated on Thu, Mar 14 2019 9:51 AM

Special Story On Communist Leader Bheemireddy Narasimha Reddy  - Sakshi

భీమిరెడ్డి నర్సింహారెడ్డి

సాక్షి, తెలంగాణ: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉంది. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త. 1925లో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు రెండో సంతానంగా భీమిరెడ్డి నర్సింహా రెడ్డి జన్మించారు. మెట్రిక్యులేషన్‌ పూర్తయిన వెంటనే బీఎన్‌రెడ్డి వీరతెలంగాణ రైతాంగ పోరాట బాటపట్టారు. 1945లో ఆయన సరోజను వితంతు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. 1957, 1967లలో రెండుసార్లు తుంగతుర్తి, సూర్యాపేటల నుంచి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1971, 1984, 1991లో మిర్యాలగూడ పార్లమెంటు నియొజకవర్గం (2009లో రద్దయ్యింది) ఎంపీగా ఎన్నికయ్యారు. 1975 నుంచి 1983 వరకు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

సీపీఐ(ఎం)కు..రాం రాం
పార్టీలో సామాజిక న్యాయం కోసం పట్టుబట్టిన ఆయన చివరకు 1997లో సీపీఐ(ఎం)ను వీడారు. ఆ తర్వాత బీఎన్‌ సీపీఎంను స్థాపించారు. అనంతరం మద్దికాయల ఓంకార్‌ స్థాపించిన ఎంసీపీఐలో తన పార్టీని విలీనం చేశారు. వందెకరాల సొంత భూమిని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుంది.

సాయుధ పోరాట యోధుడు
బీఎన్‌ సిసలైన ఉద్యమాల వీరుడు. పోరాటాలకు నిలువెత్తు రూపం. భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయంగా తుపాకీ చేతబట్టి పేదల పక్షాల నిలిచిన ధీరోదాత్తుడు. తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా సేనాని. ’దున్నేవాడిదే భూమి’ అంటూ నినదించి.. వంద ఎకరాల తన భూమిని ప్రజలకు పంచిన త్యాగశీలి. సమరశీల పోరాటాలు రచించడంలో ఉద్దండుడు. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి వీ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముందు నిలిచారు. బి.ఎన్‌.రెడ్డి. ధనవంతుల కుటుంబంలో జన్మించినా.. ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమ సమాజం వైపే. స్థానిక జమీందారుల నిరంకుశత్వానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం.. చివరకు నిజాం అరాచకాలపై వ్యతిరేక పోరుగా.. ఆపై సాయుధ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ మొదటి దశ నేతలల్లో అగ్ర భాగాన నిలిచిన బీఎన్‌ రెడ్డి, చివరి దశ వరకూ పోరాటం సాగించారు. వీర తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానిగా... భూస్వాములకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. సాయుధ పోరాట సమన్వయానికి ఏడుగురి సభ్యులతో ఏర్పాటైన కమిటీకి బీఎన్‌ కార్యదర్శిగా పనిచేశారు.

స్వాతంత్య్రానంతరం తుంగతుర్తి కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన సీపీఎం వైపునకు వెళ్లారు 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా... గెలిచినా బీఎన్‌ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. పార్లమెంటు సమావేశాలకు బస్సులోనే వెళ్లిన సామాన్యుడు. అంత కాలం పదవుల్లో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిన ఆయన, తన కోసం చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు.

పార్లమెంటు రాజకీయాల్లో..
రద్దయిన మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి మూడు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గం 1962లో ఏర్పడగా మొత్తం 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడుసార్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా కూడా పనిచేశారు. 1971లో మూడోసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం నుంచి మొదటిసారి పోటీచేసి టీపీఎస్‌ అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై 7604 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి జీఎస్‌ రెడ్డితో తలపడి అపజయం పాలయ్యారు.

అదే విధంగా 1980లో కూడా బీఎన్‌ రెడ్డి జీఎస్‌ రెడ్డి చేతిలో  ఓడిపోయారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో సారి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై 41,755 ఓట్ల మెజార్టీతో రెండోసారి లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి 6వ సారి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై 8,263 ఓట్ల మెజార్టీతో మూడోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement