miryalaguda constituency
-
నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం
నేరేడుచర్ల / హుజూర్నగర్/ మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఇక్కడికి వచ్చారు. నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) స్టేట్ కో ఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి షర్మిల పలకరించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తన మద్దతుదారుడు సలీం కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట నాయకులు కొండా రాఘవారెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరశోభన్, ఆదర్ల శ్రీనివాస్‌రెడ్డి, కర్రి సతీష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
తీరనున్న నల్లగొండ నీటిగోస: మరో 3 ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేలా మూడు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగునీరందని ప్రాంతాలకు నీరు అందించేలా రూ.160 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. నకిరేకల్ నియోజకవర్గంలో 8,058 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కట్టంగూరు మండలం, చెరువు అన్నారం గ్రామ పరిధిలో అయితిపాముల ఎత్తిపోతల పథకాన్ని రూ.122 కోట్లతో నిర్మించనుంది. మొత్తం నాలుగు పంపులను వినియోగిస్తూ 80 క్యూసెక్కుల నీటిని తరలించేలా ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామం వద్ద వీర్లపాలెం ఎత్తిపోతలను రూ.29.20 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 2,500 ఎకరాలకు నీరిస్తారు. ఇదే నియోజకవర్గంలోని వేములపల్లి గ్రామం సమీపంలో తోపుచెర్ల ఎత్తిపోతలను రూ.10.19 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 315 ఎకరాలకు నీరందనుంది. ఇప్పటికే నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్, దున్నపోతుల గండి, బొంతపాలెం, కేశవాపురం, పొగిళ్ల, ముక్త్యాల, జా¯Œ పహాడ్, అంబాభవాని, కంబాలపల్లి, ఏకేబీఆర్ వంటి ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
వీర తెలంగాణ సాయుధ సేనాని
సాక్షి, తెలంగాణ: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉంది. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త. 1925లో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు రెండో సంతానంగా భీమిరెడ్డి నర్సింహా రెడ్డి జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే బీఎన్‌రెడ్డి వీరతెలంగాణ రైతాంగ పోరాట బాటపట్టారు. 1945లో ఆయన సరోజను వితంతు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. 1957, 1967లలో రెండుసార్లు తుంగతుర్తి, సూర్యాపేటల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1971, 1984, 1991లో మిర్యాలగూడ పార్లమెంటు నియొజకవర్గం (2009లో రద్దయ్యింది) ఎంపీగా ఎన్నికయ్యారు. 1975 నుంచి 1983 వరకు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ(ఎం)కు..రాం రాం పార్టీలో సామాజిక న్యాయం కోసం పట్టుబట్టిన ఆయన చివరకు 1997లో సీపీఐ(ఎం)ను వీడారు. ఆ తర్వాత బీఎన్ సీపీఎంను స్థాపించారు. అనంతరం మద్దికాయల ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐలో తన పార్టీని విలీనం చేశారు. వందెకరాల సొంత భూమిని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. సాయుధ పోరాట యోధుడు బీఎన్ సిసలైన ఉద్యమాల వీరుడు. పోరాటాలకు నిలువెత్తు రూపం. భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయంగా తుపాకీ చేతబట్టి పేదల పక్షాల నిలిచిన ధీరోదాత్తుడు. తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా సేనాని. ’దున్నేవాడిదే భూమి’ అంటూ నినదించి.. వంద ఎకరాల తన భూమిని ప్రజలకు పంచిన త్యాగశీలి. సమరశీల పోరాటాలు రచించడంలో ఉద్దండుడు. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి వీ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముందు నిలిచారు. బి.ఎన్.రెడ్డి. ధనవంతుల కుటుంబంలో జన్మించినా.. ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమ సమాజం వైపే. స్థానిక జమీందారుల నిరంకుశత్వానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం.. చివరకు నిజాం అరాచకాలపై వ్యతిరేక పోరుగా.. ఆపై సాయుధ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ మొదటి దశ నేతలల్లో అగ్ర భాగాన నిలిచిన బీఎన్ రెడ్డి, చివరి దశ వరకూ పోరాటం సాగించారు. వీర తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానిగా... భూస్వాములకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. సాయుధ పోరాట సమన్వయానికి ఏడుగురి సభ్యులతో ఏర్పాటైన కమిటీకి బీఎన్ కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్య్రానంతరం తుంగతుర్తి కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన సీపీఎం వైపునకు వెళ్లారు 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా... గెలిచినా బీఎన్ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. పార్లమెంటు సమావేశాలకు బస్సులోనే వెళ్లిన సామాన్యుడు. అంత కాలం పదవుల్లో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిన ఆయన, తన కోసం చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు. పార్లమెంటు రాజకీయాల్లో.. రద్దయిన మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి మూడు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గం 1962లో ఏర్పడగా మొత్తం 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడుసార్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా కూడా పనిచేశారు. 1971లో మూడోసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం నుంచి మొదటిసారి పోటీచేసి టీపీఎస్ అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై 7604 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో బీఎన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీఎస్ రెడ్డితో తలపడి అపజయం పాలయ్యారు. అదే విధంగా 1980లో కూడా బీఎన్ రెడ్డి జీఎస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో సారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై 41,755 ఓట్ల మెజార్టీతో రెండోసారి లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి 6వ సారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై 8,263 ఓట్ల మెజార్టీతో మూడోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. -
మిర్యాలగూడ : అభ్యర్థుల్లో ఉత్కంఠ
సాక్షి, మిర్యాలగూడ : సాధారణ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. దాంతో ప్రచార ఆర్భాటాలు, ఓటర్లకు గాలం వేయడం ముగిసింది. ఎన్నికల్లో ప్రధాన అంకమైన పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు అంకమైన కౌంటింగ్ ఈ నెల 11వ తేదీన ఉంది. ఇంతకాలం పాటు ఎన్నికల ఆర్భాటాల్లో ఉన్న అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. పోటీ చేసిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా రాజకీయ ఉద్దండులే కావడం గమనార్హం. టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన భాస్కర్‌రావు గత ఎన్నికల్లో తెలంగాణ వాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్. కృష్ణయ్య 40సంవత్సరాలుగా బీసీ ఉద్యమ నేతగా కొనసాగుతున్నారు. సీపీఎం తరుపున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డి 40సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండటంతో పాటు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఈ ముగ్గురు కూడా ఈ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మండలాల వారీగా ఆయా పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి ఓట్ల శా తాన్ని లెక్కించుకుంటున్నారు. ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయనే విషయంతో పాటు తమకు ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో ఎవరికి వారుగా తమదే విజయం అని పేర్కొంటున్నారు. పెరిగిన పోలింగ్‌పై చర్చ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 79.13 శాతం ఉన్న పోలింగ్ ఈ ఎన్నికల్లో 84.57కు పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం తమకంటే తమకే అనుకూలంగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మళ్లీ ఆయననే గెలిపించాలని ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారని టీఆర్ఎస్ నాయకులు భావిస్తుండగా, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థులంతా ఏకమయ్యారని, అందుకు తమకే అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం చేకూరనుందో మరో రోజు వేచి చూడాల్సిందే. స్వతంత్రుల ఓట్లు ఎవరికి గండిపడునో.. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికల్లో 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాంతో రెండు ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేశారు. రెండు మిషన్లు పక్కపక్కనే పెట్టడం వల్ల కూడా ఓటర్లు కొంతమంది అనుకున్న గుర్తుకు ఓటే వేయలేదని, దాంతో స్వతంత్ర అభ్యర్థులకు అధికంగా ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులకు అనుకున్నట్లుగానే ఎక్కువ ఓట్లు వస్తే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. దాని వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములపై కూడా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. -
ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఆర్.కృష్ణయ్య
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజా కూటమి బలపర్చన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డికాలనీ, ముత్తిరెడ్డికుంట, శాంతినగర్, అశోక్‌నగర్, సీతారాంపురం, హనుమాన్‌పేట, ప్రకాశ్‌నగర్, వినోభానగర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వాగతం పలికారు. పలు వార్డులలో ర్యాలీలో నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు శంకర్‌నాయక్, గాయం ఉపేందర్‌రెడ్డి, రతన్‌సింగ్, తమన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్ కృష్ణయ్యకు పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగని మల్లేశ్వర్ పేర్కొన్నారు. సమావేశంలో విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
అసంతృప్తుల..రగడ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. ఇక, ఎన్నికల బరిలో ఎందరు మిగులుతారో బుధవారం సాయంత్రం కల్లా తేటతెల్లం అవుతుంది. ఇప్పటికే రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిని దారికి తెచ్చుకునేందుకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ.. ఇన్నాళ్లపాటు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారు, టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్న నాయకులు పూర్తిగా నారాజ్‌గా ఉన్నారు. చివరి నిమిషంలో టికెట్లు గల్లంతయిన వారి పరిస్థితి గురించి చెప్పనలవి కాకుండా ఉంది. ఇక, చివరి నిమిషంలో పార్టీలు మారిన వారు, ఆయా పార్టీల్లో సీనియర్లను కాదని టికెట్లు దక్కించుకున్నవారు సంతోషంలో మునిగిపోగా, అవకాశం కోల్పోయిన వారు విచారంలో ఉన్నారు. తమ చేతికాడి అవకాశాన్ని లాక్కున్న వారిపై ఆగ్రహంగా ఉన్న నాయకులు రెబల్స్‌గా పోటీలో ఉంటామని భీష్మిచారు. దీంతో ఒకవైపు పార్టీ నాయకత్వాలు, టికెట్ దక్కించుకుని పోటీలో ఉన్న అభ్యర్థులు రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు.చర్చనీయాంశంగా కోదాడ, మిర్యాలగూడ చివరి నిమిషంలో అన్యూహంగా టికెట్లు తారుమారైన కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలు చర్చనీయాంశంగా మారాయి. కేవలం రెండు మూడు రోజుల కిందట పార్టీలు మారిన వారికి టికెట్లు దక్కడం ఆయా పార్టీల్లోని సీనియర్లకు మింగుడు పడడం లేదు. కోదాడలో టీఆర్ఎస్ టికెట్ పోటీ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, నియోజకవర్గ ఇన్చార్జి శశిధర్‌రెడ్డి మధ్య కొనసాగింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా చివరకు ఆ టికెట్ టీడీపీనుంచి గులాబీ గూటికి చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు దక్కింది. దీంతో నిస్తేజంలో కూరుకుపోవడంతో ఆ ఇద్దరు నేతల వంతైంది. వేనేపల్లి చందర్రావు ఈ విషయంలో కొంత కుదురుకున్నట్లు కనిపిస్తోంది. కానీ, టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశిధర్ రెడ్డి మాత్రం రెబల్‌గా బరిలోకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికే ఇండిపెండెట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శశిధర్‌ను బుజ్జగించే పనిలో ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ఆయన నామినేషన్‌ను ఉప సంహరించుకుని అభ్యర్థి విజయానికి సహకరిస్తారా..? లేదా..? ఆయన వర్గం ఎటు వైపు వెళుతుంది..? ఈ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి చేకూరే లాభం ఎంత..? అన్న ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే తరహాలో మిర్యాలగూడ టికెట్ వ్యవహారం సంచలనం రేపింది. టీడీపీనుంచి గత ఎన్నికల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి, మిర్యాలగూడ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు షాకయ్యారు. ఈ స్థానాన్ని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఆశించారు. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో తనకు ఇవ్వాలని ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరారు. ఈ స్థానం నుంచి తమ అభ్యర్థి పోటీలో ఉంటారని మహా కూటమి భాగస్వామ్య పక్షం తెలంగాణ జనసమితి(టీజేఎస్) ప్రకటించి విద్యాధర్ రెడ్డికి బీఫారం కూడా అందించింది. మరో వైపు టీఆర్ఎస్లో టికెట్ దక్కక, కాంగ్రెస్‌కు చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి అక్కడా చేదు అనుభవం ఎదురు కావడంతో ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మిర్యాలగూడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దేవరకొండ కాంగ్రెస్‌లోనూ ఇదే చిత్రం కనిపిస్తోంది. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిల్యానాయక్‌కు మొండి చేయిచూపారు. జెడ్పీ చైర్మన్ బాలూనాయక్‌కు టికెట్ దక్కింది. దీంతో బిల్యానాయక్ పోటీలో ఉండడానికే నిర్ణయించుకుని నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల ఉప సంహరణ తర్వాత కానీ అసంతృప్తులంతా బరిలో నిలుస్తారా..? వెనక్కి తగ్గుతారా..? ఏ స్థానంలో పోటీ ఎలా ఉండబోతోంది.? అన్న అంశాల్లో స్పష్టత రానుంది. -
బందూకు నుంచి.. బ్యాలెట్ దాకా..
సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను పోరాటంలోనే కాకుండా ఎన్నికల్లో కూడా ఓటర్లు ఆదరించారు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని అప్పటి నిజాంనవాబు ప్రకటించారు. దాంతో పాటు ఖాసిం రజ్వీ రాజకార్ల ఉద్యమాన్ని ప్రారంభించి దోపిడీతో పాటు అణచివేతకు తెరలేపాడు. దీంతో తెలంగాణ రైతాంగసాయుధ పోరాటం లో అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ నేతలు పాల్గొన్నారు. ఆ ఉద్యమంతో హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిసింది. తెలంగాణ సాయుధ పోరాటం అప్పట్లో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంతో మంది నాయకులు ఆస్తిపాస్తులను సైతం లెక్కచేయకుండా నిజాంనవాబును ఎదిరించారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలు భారత దేశంలో తొలిసారిగా ప్రజా స్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఉద్యమంలో ప్రజల మద్దతు కూడగట్టిన నేతలకు ఓటర్లు కూడా మద్దతు తెలిపి శాసనసభకు పంపారు. సాయుధపోరాటం నుంచి.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన దంపతులు ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అదే విధంగా అన్నాచెల్లెళ్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఉన్నారు. వారితో పాటు బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించారు. ‘ఆరుట్ల’ దంపతులు : తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతులు. కమలాదేవిది ఆలేరు మండలం మంతపురి. ఆమె మేనమామ కుమారుడు రామచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె అసలు పేరు రుక్మిణి కాగా వివాహ అనంతరం కమలాదేవిగా పేరు మార్చుకున్నారు. ఆమె ఆంధ్రామహాసభలో పాల్గొనడంతో పాటు రజాకార్లను ఎదుర్కోవడానికి గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసింది. నిజాం విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లింది. ఆమెతో పాటు భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డిది భువనగిరి సమీపంలో ఉన్న కొలనుపాక గ్రామం. హైదరాబాద్‌లోని రెడ్డిహాస్టల్లోఉండి చదువుకుని 1947లో గెరిళ్లా శిక్షణ పొంది ఉద్యమం వైపునకు అడుగులు వేశారు. పోరాట సమయంలో పోలీసులకు చిక్కి 1952 వరకు నిర్బంధంలోనే ఉన్నాడు. వీరిద్దరు 1962లో ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా ఒకేసారి శాసనసభలో ఉండటం విశేషం. ఆరుట్ల కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు 1952, 1957, 1962లో విజయం సాధించారు. ఆమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి 1962లో ఒకసారి, మ రోసారి మెదక్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు. భీమిరెడ్డి, మల్లు స్వరాజ్యం : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి భీమిరెడ్డి నర్సింహారెడ్డి గుండెకాయ. ఉద్యమ నేతగా ఉన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం అన్నాచెల్లెళ్లు. వీరిది సూర్యాపుట తాలూకాలోని కరివిరాల గ్రామం.వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సాయుధపోరాటంలో పాల్గొని ప్రజలను చైతన్యం చేశారు. వీరిద్దరు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి 1957లో గెలిచారు. ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో సీపీఎం తరఫున పోటీ చేసిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి 1967లో గెలిచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన చెల్లెలు మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి 1978, 1983లో గెలిచారు. అదే విధంగా భీమిరెడ్డి నర్సింహారెడ్డి మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి: భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారు. నిజాం నవాబును ఎదిరించడానికి ఉద్యమంలో పాల్గొన్నాడు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి నకిరేకల్ నియోజకవర్గంలో 1962లో విజయం సాధించారు. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారు. సీపీఐ తరఫున పోటీ చేసి గెలుపొందారు నర్రా రాఘవరెడ్డి: రాజకీయ నేతలకు ఆదర్శ నాయకుడు. అహంబావాలు, ఢాంబికాలు లేని శాసనసభ్యుడిగా పేరెన్నికగన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నర్రా రాఘవరెడ్డి ఉద్యమంలో ఆయన బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. ఆయన మొట్టమొదటిసారి 1959లో చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. ఆయన నకిరేకల్ అసెంబ్లీ నియోకవర్గంలో తిరుగులేని వ్యక్తిగా విజయం సాధించారు. వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించి రికార్డు బ్రేక్ చేశారు. మొత్తంగా ఆరు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేగా పని చేశారు. 1967 నుంచి 1972 మినహా వరుసగా 1978, 1983, 1985, 1989, 1994లో విజయం సాధించారు. ధర్మభిక్షం : సూర్యాపేటకు చెందిన బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాటంలో పాటాలు నేర్పిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ధర్మభిక్షం పేరు వింటే నిజాంనవాబుకు వణుకు పుట్టేది. ఆయన శాసనసభతో పాటు పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సూర్యాపేటలలో 1952లో, నకిరేకల్‌లో 1957లో పీడీఎఫ్ తరఫున పోటీ చేశారు. అదే విధంగా 1962లో సీపీఐ తరఫున నల్లగొండలో పోటీ చేసి విజయం సా«ధించారు. అంతే కాకుండా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు 1991, 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు. రావి నారాయణరెడ్డి: ఆంధ్రా మహాసభ, ఆంధ్రా జనసంఘం ఏర్పాటు చేశారు. రెడ్డి హాస్టల్లో విద్యార్థిగా ఉండి స్వాతంత్య్ర పోరాటంలో సైతం పాల్గొన్నారు. ఆయన స్వగ్రామం భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామం. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న రావి నారాయణరెడ్డి ఎన్నికల తొలినాళ్లలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన భువనగిరి నియోజకవర్గంలో 1952లో పీడీఎఫ్ తరఫున పోటీ చేశారు. అదే సమయంలో నల్లగొండ లోక్‌సభకు కూడా ఎన్నిక కావడం వల్ల రాజీనామా చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి భారతదేశ ప్రధాని నెహ్రూకంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిం చారు. అనంతరం 1957లో మరోసారి భువనగిరి ఎమ్మెల్యేగా పీడీఎఫ్ తరఫున పోటీచేసి గెలుపొందారు. -
ఆ..రెండు పార్టీలకే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు ఇప్పటిదాకా అయితే వామపక్షాలకు లేదంటే కాంగ్రెస్‌కు మాత్రమే జై కొట్టాయి. రాష్ట్రంలో తొలి ఎన్నికల నాటినుంచి ఇదే పరిస్థితి. టీడీపీ, బీజేపీ, తదితర పార్టీలెన్ని ప్రయత్నాలు చేసినా ఈ నియోజకవర్గాల్లో గట్టెక్కలేక పోయాయి. కానీ 2014 ఎన్నికల తర్వాత రెండు నియోజకవర్గాల్లో ఆ ఆనవాయితీ మారింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన ప్రాంతాల్లోని ఈ నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీలు తమ పట్టును పెంచుకున్నాయి. దీంతో ఎన్నికల పోటీ అంటే కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ అన్న రీతిలో పోటాపోటీగా జరిగాయి. జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఇప్పటి దాకా వేరే పార్టీకే స్థానం లేకుండా పోయింది. 2014 ఎన్నిల్లో మాత్రం మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించి ఆనవాయితీని మార్చి రాశాయి. తొలుత పీడీఎఫ్‌గా.. తర్వాత సీపీఐ, సీపీఎంలుగా...! దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గానికి ఇప్పటి దాకా ఒక ఉప ఎన్నిక సహా పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 తొలి ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) విజయం సాధించగా, కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సీపీఐ గెలుస్తూ వస్తోంది. సీపీఐ 1962, 1972, 1985, 1989, 1994 2004, తిరిగి 2014 ఎన్నికల్లో గెలిచింది. కాగా, సీపీఐ తరఫున బద్దుచౌహాన్ మూడు పర్యాయాలు, రమావత్ రవీంద్ర కుమార్ రెండు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మరో వైపు కాంగ్రెస్ 1957, 1967, 1978, 1983, 1999, 2002–(ఉప ఎన్నిక), తిరిగి 2009 ఎన్నికల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి రవీంద్ర నాయక్ ఒక్కరే వరుసగా రెండు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ పోరాడినా, చివరకు రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గ ఆవిర్భవానికంటే ముందు పెద్ద మునగాల నియోజకవర్గం ఉండింది. 1957 ఎన్నికల సమయంలో మిర్యాలగూడ ఏర్పాటయ్యింది. అప్పటినుంచి పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏడు సార్లు, సీపీఎం ఐదు సార్లు పీడీఎఫ్ ఒకసారి మొత్తంగా వామపక్షాలు ఆరు సార్లు గెలిచాయి. 1957లో పీడీఎఫ్, ఆ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో (1962, 1967, 1972) కాంగ్రెస్ నుంచి తిప్పన చినకృష్ణారెడ్డి గెలిచారు. ఆ తర్వాత 1983, 1989, 1999, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక, సీపీఎం 1978, 1985, 1994, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇందులో రెండు సార్లు అరిబండి లక్ష్మీనారాయణ, మూడు సార్లు జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున గెలిచారు. మునుగోడు : తొలి నాలుగు ఎన్నికలు చిన్నకొండూరు నియోజకవర్గంగా, 1967 ఎన్నికల నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంగా ఇప్పటికి పదిహేను పర్యాయాలు ఎన్నికలు జరిగితే, 2014లో గెలిచిన టీఆర్ఎస్ను మినహాయిస్తే కాంగ్రెస్, సీపీఐ (పీడీఎఫ్ విజయాలను పరిగణనలోకి తీసుకుంటే..)లు ఏడు సార్లు చొప్పున గెలిచాయి. ఇక్కడినుంచి టీడీపీ, జనతా, బీజేపీ తదితర పార్టీలు గెలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్‌కు లేదంటే కామ్రేడ్లకే మునుగోడు అండగా నిలబడింది. ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ సమరయోధుడు కొండా లక్ష్మన్ బాపూజీ రెండు సార్లు (1957, 1965) కాంగ్రెస్ తరఫున విజయం సాధిస్తే, అదే కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఏకంగా ఐదు సార్లు (1967, 1972, 1978, 1983, 1985) విజయం సాధించారు. దీంతో ఏడు సార్లలో కేవలం ఇద్దరు నాయకులే ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించినట్లు అయ్యింది. సీపీఐ కూడా ఏడు సార్లు నియోజకవర్గం నుంచి గెలవగా, ఉజ్జిని నారాయణరావు వరుసగా మూడు సార్లు (1985, 1989, 1994) గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ సీపీఐ ఇక్కడినుంచి విజయం సాధించింది. నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గానికి ఇప్పటి దాకా పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో టీఆర్ఎస్, 2009, 1972 కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన పది ఎన్నికల్లోనూ వాపమక్షాలే గెలిచాయి. 1957 ఎన్నికల్లో పీడీఎఫ్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా ఉన్న సమయంలో 1962లో సీపీఐగా, ఆ తర్వాత ఎనిమిది సార్లు సీపీఎం గుర్తుపైన విజయాలు సాధించింది. కాగా, నర్రా రాఘవరెడ్డి అత్యధికంగా ఆరు సార్లు (1967, 1978, 1983, 1985, 1989, 1994) విజయ ఢంకా మోగించారు. 1999, 2004 ఎన్నికల్లో వరసగా నోముల నర్సింహయ్య విజయం సాధించారు. 2004 ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన రెండు ఎన్నికల్లో (2009, 2014) సీపీఎం గెలుపు తీరాలను చేరుకోలేక పోయింది. రద్దయిన రామన్నపేటలోనూ అదే దృశ్యం 1952లో ఏర్పాటైన రామన్నపేట నియోజకవర్గం 2004 ఎన్నికల తర్వాత రద్దయ్యింది. ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక (1974) సహా పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో పీడీఎఫ్ తరఫున, 1962 ఎన్నికల్లో సీపీఐ తరఫున వరుసగా కె.రామచంద్రారెడి విజయాలు సాధించారు. ఆ తర్వాత 1967, 1972, 1974(ఉప ఎన్నిక), 1978, 1983 వరసగా ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక, 1983, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐనుంచి గుర్రం యాదగిరిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించగా, 1999, 2004 ఎన్నికల్లో ఉప్పునూత పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్‌నుంచి గెలిచారు. అంటే కాంగ్రెస్ ఏడు సార్లు, వామపక్షాలు ఆరు సార్లు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించాయి. -
బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది బీజేపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి పాదూరి కరుణ, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ వైఖరికి నిరసనగా వైదొలుగుతున్నట్ల్లు వారు బుధవారం ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో మూడు మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఏడు గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.