సాక్షిప్రతినిధి, నల్లగొండ : నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. ఇక, ఎన్నికల బరిలో ఎందరు మిగులుతారో బుధవారం సాయంత్రం కల్లా తేటతెల్లం అవుతుంది. ఇప్పటికే రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిని దారికి తెచ్చుకునేందుకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ.. ఇన్నాళ్లపాటు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారు, టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్న నాయకులు పూర్తిగా నారాజ్‌గా ఉన్నారు. చివరి నిమిషంలో టికెట్లు గల్లంతయిన వారి పరిస్థితి గురించి చెప్పనలవి కాకుండా ఉంది. ఇక, చివరి నిమిషంలో పార్టీలు మారిన వారు, ఆయా పార్టీల్లో సీనియర్లను కాదని టికెట్లు దక్కించుకున్నవారు సంతోషంలో మునిగిపోగా, అవకాశం కోల్పోయిన వారు విచారంలో ఉన్నారు. తమ చేతికాడి అవకాశాన్ని లాక్కున్న వారిపై ఆగ్రహంగా ఉన్న నాయకులు రెబల్స్‌గా పోటీలో ఉంటామని భీష్మిచారు. దీంతో ఒకవైపు పార్టీ నాయకత్వాలు, టికెట్ దక్కించుకుని పోటీలో ఉన్న అభ్యర్థులు రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు.చర్చనీయాంశంగా కోదాడ, మిర్యాలగూడ చివరి నిమిషంలో అన్యూహంగా టికెట్లు తారుమారైన కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలు చర్చనీయాంశంగా మారాయి.
కేవలం రెండు మూడు రోజుల కిందట పార్టీలు మారిన వారికి టికెట్లు దక్కడం ఆయా పార్టీల్లోని సీనియర్లకు మింగుడు పడడం లేదు. కోదాడలో టీఆర్‌ఎస్ టికెట్ పోటీ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డి మధ్య కొనసాగింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా చివరకు ఆ టికెట్ టీడీపీనుంచి గులాబీ గూటికి చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు దక్కింది. దీంతో నిస్తేజంలో కూరుకుపోవడంతో ఆ ఇద్దరు నేతల వంతైంది. వేనేపల్లి చందర్‌రావు ఈ విషయంలో కొంత కుదురుకున్నట్లు కనిపిస్తోంది. కానీ, టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశిధర్ రెడ్డి మాత్రం రెబల్‌గా బరిలోకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికే ఇండిపెండెట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శశిధర్‌ను బుజ్జగించే పనిలో ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ఆయన నామినేషన్‌ను ఉప సంహరించుకుని అభ్యర్థి విజయానికి సహకరిస్తారా..? లేదా..? ఆయన వర్గం ఎటు వైపు వెళుతుంది..? ఈ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి చేకూరే లాభం ఎంత..? అన్న ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఇదే తరహాలో మిర్యాలగూడ టికెట్ వ్యవహారం సంచలనం రేపింది. టీడీపీనుంచి గత ఎన్నికల్లో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి, మిర్యాలగూడ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు షాకయ్యారు. ఈ స్థానాన్ని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఆశించారు. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో తనకు ఇవ్వాలని ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరారు. ఈ స్థానం నుంచి తమ అభ్యర్థి పోటీలో ఉంటారని మహా కూటమి భాగస్వామ్య పక్షం తెలంగాణ జనసమితి(టీజేఎస్) ప్రకటించి విద్యాధర్ రెడ్డికి బీఫారం కూడా అందించింది. మరో వైపు టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కక, కాంగ్రెస్‌కు చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి అక్కడా చేదు అనుభవం ఎదురు కావడంతో ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మిర్యాలగూడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దేవరకొండ కాంగ్రెస్‌లోనూ ఇదే చిత్రం కనిపిస్తోంది. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిల్యానాయక్‌కు మొండి చేయిచూపారు. జెడ్పీ చైర్మన్ బాలూనాయక్‌కు టికెట్ దక్కింది. దీంతో బిల్యానాయక్ పోటీలో ఉండడానికే నిర్ణయించుకుని నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల ఉప సంహరణ తర్వాత కానీ అసంతృప్తులంతా బరిలో నిలుస్తారా..? వెనక్కి తగ్గుతారా..? ఏ స్థానంలో పోటీ ఎలా ఉండబోతోంది.? అన్న అంశాల్లో స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment