అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో కాంగ్రెస్‌పార్టీ బుజ్జగింపులపై దృష్టి పెట్టింది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తులను మచ్చిక చేసుకునే పర్వానికి తెరలేపింది. ఇండిపెండెంట్‌లుగా, ఇతర పార్టీల తరఫున బరిలో నిలిచిన నేతలను ఒప్పించి, మెప్పించి అసమ్మతి సెగలు చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటికే చాలామంది అసమ్మతివాదులు ఇతర పార్టీల బి–ఫారాలపై పోటీలో నిలవడం, టికెట్ దక్కించుకున్న నేతలను ఓడించాలనే కసితో ఉండటం అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీ పెద్దలు జరుపుతున్న సంప్రదింపులతో అసంతృప్త నేతలు మెత్తబడి అభ్యర్థులతో చేతులు కలుపుతారా? లేక చేయిస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
వేరే పార్టీల నుంచి కొందరు.. ఇండిపెండెంట్లుగా బరిలో...
మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక టికెట్ దక్కకపోవడం తో మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ బీ–ఫారంపై పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్న గంగారాంను ఓడించడమే లక్ష్యంగా ప్రచారం మొదలుపెట్టారు. నారాయణఖేడ్‌లో టికె ట్ ఆశించిన దివంగత మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి సైతం బీజేపీ తరఫున బరిలో నిలిచారు.
ఈయన బరిలో ఉండటం కాంగ్రె స్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ గెలుపును తీవ్రంగా ప్రభావితం చేయనుంది. వేములవాడ టికెట్ దక్కకపోవడంతో ఏనుగు మనోహర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇబ్రహీంపట్నం నుంచి బీ ఫారం ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో ఆయన సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి ఎన్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి, ఎల్లారెడ్డిలో వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, వికారాబాద్‌లో మాజీమంత్రి చంద్రశేఖర్, నారాయణపేటలో బీఎల్‌ఎఫ్ తరఫున శివకుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎన్సీపీ తరఫున సురేందర్‌రెడ్డి, బీఎస్పీ తరఫున ఇబ్రహీం, చెన్నూర్‌లో బోడ జనార్దన్, ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఇల్లందులో ఊకె అబ్బయ్య, స్టేషన్ ఘన్‌పూర్‌లో విజయరామారావు, పెద్దపల్లిలో కేతి ధర్మయ్య, సురేశ్‌రెడ్డి, వరంగల్ వెస్ట్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి, పటాన్‌చెరులో గాలి అనిల్‌కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజే గడు వు ఉండటంతో సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ దారిలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల సహకారం ఉంటుందని వారికి నచ్చచెబుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి తదితరులు బరిలో నిలిచిన అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నారు.
భిక్షపతితో చర్చలు..
రాజేంద్రనగర్ టికెట్ కోసం చివరివరకు ప్రయత్నించినా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పి.కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని, కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే, రాజీనామా ప్రభావం మహేశ్వరం నుంచి పోటీలో ఉన్న తన తల్లి సబితారెడ్డిపై పడుతుందని, పార్టీ కి రెండు విధాలా నష్టమని పార్టీ పెద్దలు నచ్చచెప్పడంతో ఆయన మెత్తబడ్డారు.
కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో షాద్‌నగర్ స్థానంలో ఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మాజీమంత్రి శంకర్రావ్ వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక నేత రోహిణ్‌రెడ్డి సైతం అక్కడ బరిలో నిలిచిన దాసోజు శ్రవణ్‌కు సహకరించేందుకు నిరాకరించారు.
అయితే, ఉత్తమ్ రంగంలోకి దిగి మాట్లాడటంతో దాసోజుకు సహకరించేందుకు రోహిణ్‌రెడ్డి అంగీకరించారు.శేరిలింగంపల్లి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ను బుజ్జగించేందుకు కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై భిక్షపతి నిర్ణయం తెలియాల్సి ఉంది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment