ఏ జెండా పట్టాలో, ఏ గుర్తుకు జై కొట్టాలో తెలీక నేతల అనుచర గణంలో సవాలక్ష సందేహాలు.. ఇదీ అసెంబ్లీ ఎన్నికల కోలాహలంలో నామినేషన్ల ఘట్టంలోని ఓ రసవత్తర అంకం.
‘అన్నా ..నామినేషన్ ఎప్పుడేస్తవే.. ర్యాలీకి ఏర్పాట్లు చెయ్యమంటవా’ ఇదీ కరీంనగర్‌కు చెందిన ఓ నేతకు అతని కుడిభుజంలాంటి అనుచరుడి ఫోన్.
తమ్మీ ..మనం టికెట్‌కోసం కొట్లాడతన్నాం.. అయితే ఏదో జాబితాలో అస్తది. లేకున్నా పోటీలో ఉంటం. మనోళ్లందరినీ రెడీ చెయ్..
హాహా సరేనే మరే పార్టీనో జెప్తే పోరగాళ్లకి చెప్త.. అదే తమ్మీ.. మనం ఉన్న పార్టీ ఇయ్యకుంటే..ఏదో జాతీయ పార్టీ నుంచి టికెట్ తెస్త..పోటీలోనైతే ఉండాలే. అందరూ రావాలె..మనోళ్లకు నామాటగ జెప్పు.. చివరికి ఆ నేత జవాబు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను పూటకో పార్టీ మార్చే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. పొత్తుల్లో భాగంగా టికెట్ కోల్పోవడం కొందరి వంతైతే, అదే పార్టీలో ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉండి అవకాశం దక్కని వారు ఇంకొందరు. ఇలా ఆశావహులతో వెన్నంటి ఉండే కార్యకర్తలు, అనుచరుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
మొన్నటి దాకా సైకిల్ గుర్తు, ఆ తర్వాత హస్తం .. ఇప్పుడు టికెట్ రాకపోవడంతో ఏ గుర్తు, ఏపార్టీ అని వెతుక్కుంటున్నారు. పోటీచేసి గెలుస్తామో లేదో తెలియదు గానీ బరిలో నిలుచొని బలం చూపించాల్సిందే అని భీష్మిస్తున్నారు. దీనితో వారి అనుచర గణంలో అయోమయం నెలకొంది. ఇందుకు వివిధ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో క్షణానికో రంగు పులుము కుంటున్న పరిణామాలే అద్దం పడుతున్నాయి.
బాలూనాయక్
నల్లగొండ కాంగ్రెస్ నేత, జెడ్పీ చైర్మన్. గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తర్వాత జెడ్పీటీసీగా గెలిచి చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్‡్షలో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తీరా అక్కడ సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు అక్కడా టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరి కమలం గుర్తుపై దేవరకొండ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
పటేల్ రమేశ్‌రెడ్డి
సూర్యాపేట నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మళ్లీ బరిలో దిగేందుకు సిద్ధ్దమయ్యారు. 2014లో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఏడాది కిందట కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు టికెట్ రాకపోవడంతో స్వతంత్రుడిగా పోటీచేస్తారా? లేక మరో జాతీయపార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని బరిలో నిలుస్తారా అన్న దానిపై ఆయన కార్యకర్తలు,అనుచరుల్లో అయోమయం నెలకొంది.
చెరుకు ముత్యం రెడ్డి
మాజీ మంత్రి, దుబ్బాక మాజీ. అయినా కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. పోటీకి సై అంటూ నామినేషన్ వేశారు. గతంలో టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సమాజ్‌వాద్ పార్టీ లేదా మరేదైనా జాతీయ పక్షం నుంచి బీఫాం తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పటికప్పుడు బీఫాం...
పైన పేర్కొన్న నేతలే కాదు 20 నుంచి 30 మంది వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు అసెంబ్లీ బరిలో ఎలాగైనా ఉండాల్సిందేనని వివిధ పార్టీలను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల బీఎస్పీ బీఫాం తీసుకున్న వారితో చర్చించి ఆ బీఫాంపై పోటీచేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఢిల్లీలో ఏఐసీసీ వద్ద టికెట్ కోసం ఎదురుచూసిన నేతలు అటు నుంచి అటే సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలను కలసి అక్కడి నుంచి నేరుగా బీఫాంతో వచ్చేస్తున్నారు. మరి కొందరైతే లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ నుంచి టికెట్ తెచ్చుకునేందుకు రాష్ట్ర యాదవ సంఘం నేతల సాయంతో ఇప్పటికే రంగంలోకి దిగారు. దీనితో ఈమారు ప్రాంతీయ పార్టీలకంటే జాతీయ పార్టీల తరుపున ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నట్టు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment