సాక్షి, హైదరాబాద్: తన చేతుల మీదుగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. ఇప్పుడు తన బీఫారం కోసం ప్రయాస పడాల్సి వస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ స్థానాన్ని తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి కేటాయించడం, అక్కడి నుంచి పోటీకి ఆ పార్టీ అధినేత కోదండరామ్ సిద్ధమవుతుండడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పొన్నాల.. రెండోరోజు కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీకి తాను చేసిన సేవలను వివరించి, టికెట్ ఇవ్వాలని కోరారు.
ఈ విషయంపై తాను మాట్లాడతానని ఆయన పొన్నాలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీ రావాలంటూ టీజేఎస్ అధినేత కోదండరామ్‌కు పిలుపు వచ్చింది. అయితే, కోదండరామ్ ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో భేటీ అవుతారా... జనగామ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో పొన్నాలకు టికెట్ రావడం అనుమానమే అనే ప్రచారం జరుగుతోంది. అయితే, మూడో జాబితాలో కచ్చితంగా పొన్నాలకు జనగామ సీటు కేటాయిస్తారని ఆయన సన్నిహితులంటున్నారు.
సికింద్రాబాద్ తెర పైకి జ్ఞానేశ్వర్ పేరు...
పొత్తుల్లో భాగంగా సికింద్రాబాద్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ స్థానాన్ని తీసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేకపోవడంతో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ టికెట్ ఆశిస్తున్నవారిలో హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోశ్‌కుమార్, పల్లె లక్ష్మణ్‌రావు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి రావడం పార్టీలో అనేక చర్చలకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment