
సాక్షి, హైదరాబాద్ : పొన్నాల లక్ష్మయ్య.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేత. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నాయకుడు. కానీ, ఆయనకే టికెట్ దొరకని కష్టకాలం వచ్చింది. జనగాం టికెట్ ఆశించిన పొన్నాలకు భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఖంగుతిన్న పొన్నాల అధిష్టానం ఎదుట తన గోడు వెళ్లబోసుకోవడానికి ఢిల్లీకి పయనమయ్యారు.
నేనున్నా..
పొన్నాల, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని గురువారం కలిశారు. 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిథ్యం వహిస్తున్నాననీ, ఎమ్మెల్యే టికెట్ తిరిగి ఇవ్వాలని పొన్నాల రాహుల్‌ను కోరినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా రాహుల్‌తో మాట్లాడారు. పొత్తుల వల్ల రాజకీయంగా తన గొంతు కోశారని పొంగులేటి రాహుల్ వద్ద ఆవేద వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, సీట్ల విషయంలో ఈ ఇద్దరు నేతలకు రాహుల్ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో తమ పేర్లుంటాయని పొన్నాల, పొంగులేటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment