
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఓటమికి ఏఐసీసీని తప్పుపట్టాల్సిన పనిలేదని, ఈ ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి గుండెకాయలాంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. సంస్థాగతంగా బలంగా ఉన్న తెలంగాణలో ఓటమి పాలవ్వడం దురదృష్టకరమన్నా రు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చినప్పటికీ 2014లో ప్రచారం చేసుకోలేక ఓడిపోయామని, ఇప్పుడు ఏం మాయ జరిగిందో కానీ ప్రజాకూటమి ఓటమి పాలైందని పేర్కొన్నారు.
తప్పు ఎక్కడ జరిగిందో రాష్ట్ర నాయకత్వం గుర్తించాలని, సెంటిమెంట్ మీద ఏర్పడ్డ రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలన్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు.