Ponnala Laxmaiah
-
కాంగ్రెస్ కు సీనియర్ నేత పొన్నాల గుడ్ బై
-
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు. -
కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారని.. అవివేకం, అహంకారం, అనాలోచితంగా ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్ర రైతాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్‌కు ప్రజలు తగిన శిక్ష విధించడం ఖాయం. మిషన్ భగీరథకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశావు కదా! నీళ్లు ఇచ్చావా?. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి రెండు ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేశారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారు. కేసీఆర్ తీసుకునే 90 శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేవే. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని.. ప్రజల్లో ఎండగడుతాం. కేసీఆర్, బీజేపీ ఆడే నాటకాలతో.. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే’’ అని అన్నారు. ( పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!) కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: ఉత్తమ్ ‘‘కేసీఆర్ ఒక తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారు. చెప్పిన పంటలే వేయాలని రైతులను ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు అంటున్నారు. నియంత్రిత సాగుపై మొదటి నుండి చెప్తూనే ఉన్నాం కానీ వినలేదు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని చెప్పడం మంచిది కాదు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. రెండూ రహస్య ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై కేసీఆర్ మాట మార్చారు. పీసీసీ చీఫ్ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’’. -
దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు..
సాక్షి, ఖమ్మం : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవాలనే కసితో ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టీఆర్ఎస్లోకి పోతాడని బీజేపీ దుష్ర్పచారం చేసిందని, అందుకే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బుధవారం ఆయన పొన్నాల లక్ష్మయ్యతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతితో రఘునందన్‌రావు గెలిచాడే తప్ప బీజేపీ గెలువలేదన్నారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాతుడూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ సాగువిధానం తీసుకురావటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కౌలు రైతులను నిండా ముంచిన ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని విమర్శించారు. భట్టి ర్యాలీకి ఘన స్వాగతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలో జరుగుతున్న ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది అవాస్తవ బడ్జెట్: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (2020-21) పూర్తిగా అవాస్తవ బడ్జెట్ అని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆర్థిక మాంద్యం అంటూ అసెంబ్లీలో అవాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని పొన్నాల ప్రశ్నించారు. కొన్ని వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దేనని తెలిపారు. బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగంలో లో 2 లక్షల ఇళ్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ పరంగా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఈ ఏడాది ఇవ్వలేమంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ పార్టీ నిషేధిత సంస్థా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను టీపీసీసీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు ఈ బృందంలో ఉన్నారు. దాదాపు అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగిన ఘటన గురించి వివరించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ కోసం తాము పోలీసులను అనుమతి కోరితే అకారణంగా తిరస్కరించారని వివరించారు. పోలీసులు చెప్పిన రూట్లో వెళ్తామని, అవసరమైతే ఎలాంటి నినాదాలు చేయకుండా మౌనంగా వెళ్తామని చెప్పినా పోలీసులు అనుమతివ్వలేదని చెప్పారు. దీనికి తోడు తమ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కార్యకర్తలను కూడా అరెస్టు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిషేధిత, చట్ట వ్యతిరేక సంస్థ ఏమీ కాదని చెప్పారు. ఇదేమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను అడిగితే దురుసుగా జవాబిచ్చారని, ఆయన వ్యవహారశైలి, పనితీరుపై చాలా ఆరోపణలున్నాయని, వెంటనే ఆయనపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి తోడు రాష్ట్రంలో ప్రజల హక్కులను అణచివేస్తున్నారని, కనీసం నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు నిరసనలకు పిలుపునివ్వగానే నాయకులను గృహ నిర్బంధం చేసి, నిరసనలు కూడా తెలపకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014లోని సెక్షన్ 8 ప్రకారం తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి హైదరాబాద్‌లో శాంతిభద్రతల అమలుపై చొరవ తీసుకోవాలని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో టీపీసీసీ నేతలు కోరారు. పోలీసులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు: ఉత్తమ్ రాష్ట్రంలో పోలీసులు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం టీపీసీసీ నేతలతో కలిసి రాజ్‌భవన్ ఎదుట విలేకరులతో మాట్లాడుతూ, ఎల్బీనగర్ నుంచి సరూర్‌నగర్ వరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి, దారుస్సలాంలో ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పైగా తమ పార్టీ కార్యాలయానికి వస్తున్న కార్యకర్తలను అరెస్టులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్ర కేడర్‌కు కేటాయించినా వెళ్లకుండా, తెలంగాణలో ఉన్నత పదవిలో ఉన్న హైదరాబాద్ సీపీ వ్యవహారశైలిపై విచారణ జరిపించాలని, తనకున్న విచక్షణాధికారాలతో శాంతిభద్రతల విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు ఉత్తమ్ చెప్పారు. నేనున్నది అందుకే కదా: గవర్నర్ గవర్నర్‌తో సమావేశం సందర్భంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, గవర్నర్‌గా తమిళిసై పనితీరుకు కితాబిచ్చారు. గతంలోకన్నా గవర్నర్ పాత్ర బహిరంగంగా కనిపిస్తోందని, అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారని, ప్రజల వినతులపై కూడా స్పందిస్తున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన గవర్నర్ తన బాధ్యత ప్రకారం వ్యవహరిస్తున్నానని, తానున్నది అందుకేనని, అందుకే వెంటనే ఆయా శాఖలకు వినతిపత్రాలు పంపించి వేస్తున్నానని కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు సమాచారం. -
రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం: పొన్నాల
జనగామ: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో పొన్నాల మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనిపిస్తోందని చెప్పారు. జాతీయ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పోలీసులు సంయమనం పాటిస్తే బాగుండేదన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌ను కట్టడి చేయడానికే ఈ కుట్ర జరిగిందని, కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. -
పొన్నాలకే జనగామ
సాక్షి, జనగామ: కూటమిలోని పొత్తులు..సీట్ల పంపకాల్లో భాగంగా జనగామ స్థానంపై రాజ కీయంగా వారం రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీల మధ్య కుదిరిన అవగాహనతో పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. ఏఐసీసీ శనివారం ప్రకటించిన మూడోజాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు కల్పించింది. దీంతో జనగామ సీటుపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. పొన్నాలకు టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి పొన్నాల సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ స్థానం కోసం టీజేఎస్ పట్టుపట్టింది. తమకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసింది. 12 స్థానాల్లో పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. జనగామ నుంచే కోదండరామ్ పోటీచేస్తారని ప్రకటన చేయడంతోపాటు ఏకంగా ప్రచార రథాలను సిద్ధంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కలేదు. ఢిల్లీకి వెళ్లిన పొన్నాల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం అయ్యారు. కోదండరాం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పొన్నాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి స్వయంగా కోదండరాంను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పోటీపై కోదండరాం వెనక్కితగ్గారు. దీంతో పొన్నాల పోటీకి లైన్‌క్లియర్ అయింది. శనివారం ఏఐసీసీ 13 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాతో జనగామ స్థానాన్ని పొన్నాలకు కేటాయించారు. పోటీనుంచి తప్పుకున్న కోదండరాం.. జనగామ బరి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమిలో సీ ట్ల సర్దుబాటు కారణంగా జనగామ నుంచి సీని యర్ కాంగ్రెస్ నేత పొన్నాలకు అవకాశం కల్పిం చడం కోసం ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కోదండరాం పోటీ చేయడానికి ఆసక్తి ఉ న్న మంచిర్యాల, మేడ్చల్, జనగామ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కోదండరాం పోటీ చేయనట్లు తెలుస్తోంది. నేటి నుంచి 64వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు పర్వతగిరి: ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 64వ ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సతీష్ తెలిపారు. అండర్–19 క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్, వూ– షూ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మామునూర్ ఏసీపీ ప్రతాప్‌కుమార్, ఆర్డీఎఫ్ పాఠశాలల చైర్మెన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు పాల్గొంటారని తెలిపారు. -
పొన్నాల ప్రయత్నాలు ఫలించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్‌కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామపై స్పష్టత లేదు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు. ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్‌లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
టికెట్ కోసం పొన్నాల ప్రయాస
సాక్షి, హైదరాబాద్: తన చేతుల మీదుగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. ఇప్పుడు తన బీఫారం కోసం ప్రయాస పడాల్సి వస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ స్థానాన్ని తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి కేటాయించడం, అక్కడి నుంచి పోటీకి ఆ పార్టీ అధినేత కోదండరామ్ సిద్ధమవుతుండడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పొన్నాల.. రెండోరోజు కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీకి తాను చేసిన సేవలను వివరించి, టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తాను మాట్లాడతానని ఆయన పొన్నాలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీ రావాలంటూ టీజేఎస్ అధినేత కోదండరామ్‌కు పిలుపు వచ్చింది. అయితే, కోదండరామ్ ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో భేటీ అవుతారా... జనగామ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో పొన్నాలకు టికెట్ రావడం అనుమానమే అనే ప్రచారం జరుగుతోంది. అయితే, మూడో జాబితాలో కచ్చితంగా పొన్నాలకు జనగామ సీటు కేటాయిస్తారని ఆయన సన్నిహితులంటున్నారు. సికింద్రాబాద్ తెర పైకి జ్ఞానేశ్వర్ పేరు... పొత్తుల్లో భాగంగా సికింద్రాబాద్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ స్థానాన్ని తీసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేకపోవడంతో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ టికెట్ ఆశిస్తున్నవారిలో హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోశ్‌కుమార్, పల్లె లక్ష్మణ్‌రావు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి రావడం పార్టీలో అనేక చర్చలకు దారితీస్తోంది. -
పొన్నాలకు రాహుల్ భరోసా..!!
సాక్షి, హైదరాబాద్ : పొన్నాల లక్ష్మయ్య.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేత. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నాయకుడు. కానీ, ఆయనకే టికెట్ దొరకని కష్టకాలం వచ్చింది. జనగాం టికెట్ ఆశించిన పొన్నాలకు భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఖంగుతిన్న పొన్నాల అధిష్టానం ఎదుట తన గోడు వెళ్లబోసుకోవడానికి ఢిల్లీకి పయనమయ్యారు. నేనున్నా.. పొన్నాల, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని గురువారం కలిశారు. 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిథ్యం వహిస్తున్నాననీ, ఎమ్మెల్యే టికెట్ తిరిగి ఇవ్వాలని పొన్నాల రాహుల్‌ను కోరినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా రాహుల్‌తో మాట్లాడారు. పొత్తుల వల్ల రాజకీయంగా తన గొంతు కోశారని పొంగులేటి రాహుల్ వద్ద ఆవేద వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, సీట్ల విషయంలో ఈ ఇద్దరు నేతలకు రాహుల్ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో తమ పేర్లుంటాయని పొన్నాల, పొంగులేటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
టీజేఎస్‌కి నా సీటే కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ రెండో జాబితాలోనూ తన పేరును ప్రకటించకపోవడం పట్ల మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుల వల్లే సీటు ప్రకటన ఆసల్యం అవుతుందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు తేలినా, తేలకపోయినా తాను మాత్రం జనగామ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. టీజేఎస్ పార్టీ జనగామ టికెట్‌ను ఎందుకు కోరుతుందో అర్ధం కావడం లేదన్నారు. కోదండరాం పోటీ చేయడానికి జనగామ ఒక్కటే ఉందా అని ప్రశ్నించారు. టీజేఎస్‌కు రాష్ట్రంలో 119 సీట్లు ఖాళీగా ఉండగా తాను పోటీ చేసే నియోజకవర్గం ఒక్కటే కావాల్సి వచ్చిందా అని విమర్శించారు. పొత్తులు త్వరగా తేలిస్తే కాంగ్రెస్ పార్టీకే శ్రేయస్కరం అని పొన్నాల అభిప్రాయ పడ్డారు. కాగా మంగళవారం టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. జనగామ నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకుంటున్నాని కోదండరాం తెలిపారు. అయినప్పటికీ బుధవారం కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం గమనార్హం. -
సొంతపార్టీలోనే శ్రవణ్‌పై తిరుగుబాటు
సాక్షి, హైదారాబాద్ : కాంగ్రెస్‌లో అసమ్మతి మంటలు ఇంకా చల్లారడం లేదు. మొదటి జాబితాలో పేరు లేని వాళ్లు రెండో జాబితాకోసం ఎదురు చూశారు. బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ తమ పేర్లు లేకపోవడంతో టికెట్‌పై ఆశ పెట్టుకున్న నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కాదని టికెట్ దక్కలేదని పలువురు నేతలు ఆందోళనకు దిగారు. తమ నేతకు టికెట్ ఇవ్వకుండా మరో నేతకు ఇచ్చారని కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖైరతాబాద్ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌కు కేటాయించడం పట్ల స్థానిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్న రోహిణ్ రెడ్డిని కాదని దాసోజ్ శ్రవణ్‌కు ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ముషిరాబాద్లో తనకు ఓటేయండని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న శ్రవణ్‌కు ఖైరతాబాద్ ఎలా ఇస్తారని రోహిణ్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఖైరతాబాద్ టికెట్ కాంగ్రెస్‌కు ఇవ్వడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్‌ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలంటూ ఎన్టీఆర్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ ఓ కార్యకర్త కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపారు. రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు జనగామలో ఆందోళనకు దిగారు. టికెట్ ఇవ్వకుండా బీసీ నేతను అవమానిస్తారా అంటూ పొన్నాల అనుచరులు మండిపడుతున్నారు. పొన్నాలకు టికెట్ ప్రకటించనందుకు నిరసనగా జనగామలోని 14మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టికెట్లను అమ్ముకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గొల్ల కురుమ సామాజిక వర్గానికి చెందిన తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల,కురుమలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాలో జనగామ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ నుంచి కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాను జనగామ పోటీ నుంచి తప్పుకుంటున్నాని కోదండరాం పేర్కొన్నారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోదండరాం తప్పుకోవడంతో కాంగ్రెస్ జనగామ టికెట్‌ను పొన్నాలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరపున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కోదండ రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్గిరి, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్‌పేట సీట్లను టీజేఎస్‌కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీజేఎస్ సీట్లను బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు మరో షాక్
నెలన్నరపాటు ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది కానీ ఈ జాబితానే కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలేదని పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు ఆందోళనకు దిగగా మరి కొంత మంది రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 46 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తూ వస్తున్న తనను కాదని ఇటీవల పార్టీలో చేరిన రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెరుగుతున్న నిరసనలు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో టికెట్లపై ఆశ పెట్టుకున్న నేతలు, వారి మద్దతుతారులు నిరసనలకు దిగారు. పలు నియోజకవర్గాల్లో పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కొత్తగూడెం స్థానాన్ని వనమా వెంకటేశ్వర్రావుకు కేటాయించడంతో ఆ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎడవల్లి కృష్ణ ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఎడవల్లి కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. పాల్యంచలోని అంబేద్కర్‌సెంటర్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భద్రాచలం అసెంబ్లీ సీటును స్థానికేతరుడైన పోడెం వీరయ్యకు కేటాయించడం పట్ల వెంకటాపురం మండల కాంగ్రెస్ కమిటీ నిరసన తెలిపింది. భద్రాచలం సీటును స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేసింది. జయశంకర్ భూపాలపల్లిని స్థానికులకే కేటాయించాలని కోరుతూ ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు స్థానిక కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలు అందజేశారు. లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును సర్వే సత్యనారాయణకు కేటాయించడం పట్ల స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సీటును సర్వేకు కేటాయించడంతో టికెట్ ఆశించిన గణేష్ రెబల్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేశ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తొలిజాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ సీటు వద్దని ఎమ్మెల్యే సీటే కావాలని అదీ కూడా జనగామ నుంచే పోటీ చేస్తానని పట్టుపడుతున్నారు. జాబితాలో తన పేరు ప్రకటించనందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
వరంగల్ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి
-
కాంగ్రెస్ జాబితాపై ఆగ్రహం.. 17న రాష్ట్రబంద్
సాక్షి, హైదరాబాద్ : మహా కూటమిలో టికెట్ కేటాయింపులపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించడంపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు. బీసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆగ్రహోదగ్రులవుతున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడంపై నిరసనగా ఈ నెల 17న తెలంగాణ బంద్‌కు బీసీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు తగినమొత్తంలో సీట్లు కేటాయించి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ పార్టే అన్యాయం చేసిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కాంగ్రెస్‌లోనూ బీసీ సెగలు! 65మంది అభ్యర్థులతో తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో కేవలం 13మంది బీసీ నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా చాలామంది బీసీ నేతలకు పార్టీ మొండిచేయి చూపడంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. తనకు టికెట్ దక్కకపోవడంతో పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహూకూటమి పొత్తుల్లో భాగంగా జనగాం సీటును టీజేఎస్‌కు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ సాధించాలనే పట్టుదలతో పొన్నాల ఢిల్లీ వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇండింపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భిక్షపతి యాదవ్ భావిస్తున్నారు. -
భూ కబ్జా రుజువు చేస్తే ఉరి వేసుకుంటా: పొన్నాల
జనగామ: భూ కబ్జాలకు పాల్పడినట్లు తనపై తప్పుడు కేసు బనాయించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ కేసును రుజువు చేస్తే అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో ఆదివారం జరిగిన సభలో పొన్నాల మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా, అసెంబ్లీలో రెండున్నర గంటలపాటు తనపై చర్చించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్చ కు రాకుండా.. ఎందుకు వెనకేసుకు వస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. -
పేర్వారం రాములుకు మాతృవియోగం
రఘునాథపల్లి : ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ పేర్వారం రాములుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పేర్వారం వీరమ్మ (94) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మం డలంలోని ఖిలాషాపూర్‌లో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే నాగపూరి రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ సేవెల్లి సంపత్‌లు సోమవారం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రాములును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మారుజోడు రాంబాబు, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, మండల పరిషత్ కోఅçప్షన్ సభ్యుడు మహమూద్, నాయకులు గొరిగ రవి, మడ్లపల్లి సునీత, కోళ్ల రవిగౌడ్, బక్క నాగరాజు, ఉడుత రవి, దూడల యాదగిరి, లోనె శ్రవణ్‌కుమార్, దొంగ మహిపాల్‌రెడ్డి, కావటి రాజయ్య, అల్లిబిల్లి నర్సయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అంతియయాత్రలో పాల్గొన్న పొన్నాల రఘునాథపల్లి: ఖిలాషాపూర్‌లో సోమవారం నిర్వహించిన మాజీ డీజీపీ పేర్వారం రాములు తల్లి వీరమ్మ (94) అంతిమ యాత్రలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన ఖిలాషాపూర్‌లో ఆమెతో చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరమ్మ కుమారుడు రాములుతో ఎంత సఖ్యత ఉండేదో లక్ష్మయ్యతో అంతే అభిమానంగా ఉండేది. ఉన్నత విద్యాభ్యాసం చేసినా, వృత్తి పరంగా పేర్వారం, రాజకీయంగా పొన్నాల ఏ స్థాయికి ఎదిగినా ఎప్పటిలాగే కలిసి ఉండేవారు. ఈ సందర్భంగా అంతిమ యాత్రలో పొన్నాల కొద్ది సేపు పాడె మోశారు. -
సీఎం అబద్ధాల కోరు: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి (యాక్సిడెంటల్ సీఎం) అయిన కేసీఆర్ ఒక అబద్ధాల కోరు అని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని, మోసపూరిత విధానాలతో వచ్చే ఎన్నికల్లోనూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయాలను అధిగమించేందుకు ఫ్రంట్ పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను డీఎంకే నేత స్టాలిన్ ఆదిలోనే తిప్పికొట్టారని, కాంగ్రెస్‌యేతర ప్రత్యామ్నాయంతో దేశా నికి ఉపయోగం లేదని స్టాలిన్ సహా మమతా బెనర్జీ కూడా తేల్చి చెప్పారన్నారు. కేసీఆర్ బీజేపీకి, ప్రధాని మోదీకి కోవర్టుగా మారి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరి లాం టి నేతలు ఇప్పటికే కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను తిప్పికొట్టారని గుర్తుచేశారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. -
నియంతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలలో కేవలం 34 శాతం ప్రజల మద్దతుతో అందలం ఎక్కి, అధికారంలోకి వచ్చాక తన స్వలాభం కోసం పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా చరిత్రలో నిలిచిపోతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా ప్రధాని మోడీ మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ కనీసం నోరు మెదపకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బలంగా కాంక్షించిన ప్రజలు టీఆర్ఎస్ పాలనలో మోసానికి, దగాకు గురయ్యామని అభిప్రాయపడుతున్నారని అన్నారు. మిగులు సంపన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించకుండా తాను మాత్రం జమీందారీ, దొర తరహాలో కోట్ల రూపాయలతో బంగ్లా కట్టుకుని ఉంటున్నారని అన్నారు. అప్పులు చేయడంలో, రైతుల ఆత్మహత్యల్లో, రాజకీయ ఫిరాయింపుల్లో, కుటుంబ పాలనలో, న్యాయస్థానాల చేత మొట్టికాయలు తినడంలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్1 చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు శిక్ష వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వేలకోట్ల రూపాయల అవినీతిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
ప్రశ్నిస్తే భయమెందుకు: డీకే అరుణ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజంగానే బాగుంటే, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్న ట్లయితే ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఉద్యోగాలపై ఎవరైనా ప్రశ్నిస్తుంటే వారిని జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లు చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన: పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాస్వామ్యం ముసుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ విఫలమవ్వడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఘటనా స్థలానికి వెళ్లిన నేతలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించడం కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రజలకు స్వేచ్ఛలేదు: మల్లు రవి సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారని, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తుంటే జైల్లో పెట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ధర్నాలు చేసుకునేందుకు కోర్టుల నుంచి అనుమతులు పొందాల్సిన దుస్థితి నెలకొందని, కోర్టులు అనుమతించినా ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని, కేసీఆర్ పాలన ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. -
అనుమానంతోనే ఆ కేసులు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య (మనసులో మాట) అక్రమాస్తులు తదితర అంశాలపై సీబీఐ పెట్టిన కేసులు ఏవీ నిలబడవని మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. కేవలం అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపణలు చేశారని, వైఎస్ జగన్‌తోపాటు కొందరిపై కేసులు కూడా పెట్టించారనీ, కానీ అవేవీ నిలవవని చెప్పారు. క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌ని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్ తారసపడ్డారు తప్పితే ఏదైనా పని విషయంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదం టున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఫోన్ చేయడమూ తప్పే, కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడమూ తప్పే.. అన్నారు. వైఎస్ మరణానికి ముందు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనలపై పొన్నాల అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భం? ఒక లక్ష్యంతో నేను అమెరికాలో ఉద్యోగం మాని దేశానికి తిరిగి వచ్చాను. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగులకు, నైపుణ్యం లేని వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుం టుంది అని ఉండేది. ముఖ్యంగా ఫౌల్ట్రీ రంగంలో అవకాశాల కల్పన. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఫౌల్ట్రీ ప్రారంభించాం. ఆరోజుల్లో దేశంలో అయిదారు లక్షల మంది ఈ రంగంలో పనిచేసేవారు. మావంటి వారి కృషి వల్లే ఈ రోజు దేశంలో పది కోట్లమంది ప్రజలు పౌల్ట్రీ రంగంలో అవకాశాలు పొందుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం గురించి చెబుతారా? 1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో హోమంత్రిగా ఉన్న ప్రభాకరరెడ్డి ద్వారా వైఎస్‌తో పరిచయం కలిగింది. మా మామగారితో తనకున్న పరిచయం వల్ల ఆయన నన్నూ దగ్గరకు తీసుకున్నారు. తర్వాత వైఎస్సార్ మంత్రి అయ్యారు. 1985లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. అప్పుడే శ్రీశైలం ఘటన జరిగింది. శ్రీశైలం ఘటన అంటే? 1985లో అనుకుంటాను. వైఎస్ తన కుటుంబంతోపాటు శ్రీశైలం వెళుతూ మమ్మల్ని ఆహ్వానించారు. ఫ్యామిలీస్‌తో వెళ్లాం. దర్శనం చేసు కున్నాక, లుంగీ, పైన బనియన్ కట్టుకుని ఉన్న ఒక వ్యక్తి మావద్దకు వచ్చి వైఎస్ కాళ్లకు దండం పెట్టాడు. మీరెప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి సర్ అని వైఎస్‌ని ఉద్దేశించి చెప్పాడు. వైఎస్ నవ్వి ముందుకు నడుస్తూ, ‘‘అలాంటి అవకాశం మనకు వస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఏర్పాట్లు చేయగలుగు తామా’’ అన్నారు. సీఎం కాగానే సాగునీరు కల్పించాలి అని అంటున్నారంటే రాయల సీమలో నీటి కష్టం ఆయనపై ఎక్కువ ప్రభావం వేసిందనుకున్నాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2004లో సీఎం కాగానే జలయజ్ఞం, 86 ప్రాజెక్టులు, శాశ్వత ప్రాతిపదికన గోదావరి–కృష్ణ జలాలను వాడుకునేటటువంటి మహోన్నత యజ్ఞం ప్రారంభించారు. ప్రపంచంలోనే విశిష్టమైన ఆ ఘటనలో అవకాశం దక్కడం నా అదృష్టం. జలయజ్ఞం నేపథ్యం ఏమిటి? జలయజ్ఞం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కర్నూలులో జరిగిన ఒక మీటింగులో వైఎస్ నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేను సాగునీటి కల్పన గురించి మాట్లాడాను. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనం ఇంత గొప్ప ప్రాజెక్టును చేపడుతున్నాము. భావితరాల కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శాశ్వత ప్రాతిపదికన దీన్ని తీసుకువస్తున్నాం. వ్యవసాయ అభివృద్ధి కోసం దీన్ని ఒక యజ్ఞంలా చేయాలి చేద్దాం అని మాట్లాడాను. వెంటనే వైఎస్ తన స్పీచ్ మొదలెట్టి ఇది జలయజ్ఞం అని పేరుపెట్టేశారు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. నెహ్రూ అప్పట్లో ఈ ప్రాజెక్టును ఆధునిక దేవాలయమని పిలిచారు. కాని 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ప్రాజెక్టు తరగని బంగారు గనిలా మారింది. ఎందుకంటే ఒక కారుకు 9 వేల కోట్ల రూపాయల పంటను అందిస్తోంది. అంటే సమాజానికి, దేశానికి, ప్రాంతానికి ఎంత సంపదను ఇది సృష్టించి ఇస్తోందో చూసినట్లయితే ఇది ఆధునిక దేవాలయంతోపాటు తరగని బంగారు గనిలా తయా రైంది. మామూలు బంగారు గని అయితే బంగారు తోడేశాక కొంతకాలానికి వట్టిపో తుంది. కాని ఇది తరగని గనిలాగా ప్రతి ఏటా, ప్రతి కారుకూ వేల కోట్ల సంపద నిస్తోంది. కాబట్టే ఇది తరగని బంగారు గని అని వైఎస్ చెప్పారు. 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా అధిష్టానం జగన్‌కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అధిష్టానానికి మా అభిప్రాయాలు చెబుతూనే చివరి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వడం రివాజు. జగన్‌కి మద్దతు తెలిపాం. సంతకాలు పెట్టాం. కానీ అధిష్టానం ఎందుకో మరోలా ఆలోచించింది. ఆ విషయం తెలిసినప్పుడు బాధపడ్డాం. జగన్నే సీఎంగా చేసి ఉంటే చరిత్ర మరోలా ఉండేది కదా? అవకాశాలు కల్పించి ఉంటే ఆయనకు ఇక ఆకాశమే హద్దు కదా. కేసీఆర్ దీక్ష బూటకం అని చాలామంది అంటున్నారే? ఆ దీక్ష బూటకం అని నేనే చెప్పాను. 750 కేలరీల ద్రవాహారాన్ని తీసుకుని దీక్షలో ఉన్నాడాయన. లక్ష్యసాధన కోసం కేసీఆర్ ఏం చేసినా మేం కాదనలేదు. నాకు తెలిసి ప్రాణానికి ఏమాత్రం ముప్పులేని దీక్షనే కేసీఆర్ చేశారు. కానీ ఆయన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని చిదంబరం తదితరులు అనుకున్నారు. ఆయన ద్రవాహారం తీసుకున్నా రన్నది నిజం. కానీ ఆ దీక్ష ఉద్యమానికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే జగన్‌పై ఏ కేసులూ ఉండేవి కాదు కదా? మంత్రులుగా మామీద కూడా కేసులు పెట్టారు కదా మరి. పైగా పలానా డాక్యు మెంట్లో పలానా తప్పు ఉంది ఇదెలా వచ్చింది అంటూ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్షీ్మ నారాయణే మమ్మల్ని పిలిపించి వివరణలను అడిగారు. మేం చెప్పాం. వాళ్లు అనుమా నాలు వ్యక్తం చేస్తే, వాస్తవాలు చెప్పాం. సీబీఐ పెట్టిన కేసులపై మీ అభిప్రాయం? అవి నిలబడవు. నాపై చార్జిషీట్ పెట్టలేదు. అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపిం చారు. అందుకే మా కేసులు నిలవవు అని అప్పుడే తెలుసు. ఇక జగన్‌పై కూడా ఇలాగే కేసులు పెట్టి ఉంటారనుకుంటున్నాను. కోర్టులోనే అవి తేలాలి. మిమ్మల్ని కలవడానికి జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వచ్చారా? ఆయనతో మాట్లాడటమే రెండు మూడు సందర్భాల్లో జరిగింది. అది కూడా సెక్రటే రియట్‌లో కాదు. క్యాంప్ ఆఫీసులో ముఖ్య మంత్రిని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్ తారసపడ్డారు. ఏదైనా పని విష యంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఫిరాయింపులపై మీరేమంటారు? ఫిరాయింపులు జరగకూడదు. ఎవరు చేసినా, ఎవరు చేయించినా తప్పు తప్పే..! ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? ఫోన్ చేసిన వారిదీ తప్పు. ఫోన్ ట్యాపింగ్ చేయించినవారిదీ తప్పు. ఇప్పుడు ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాలకు చేసే పనులు, కక్షపూరితంగా చేసే పనులు అన్నిపార్టీల్లో ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఎందుకు వేలెత్తి చూపుతారు? అయితే ఇలాంటి పనులు మంచివి కాదనే నా అభిప్రాయం. (పొన్నాల లక్ష్మయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రజల ఒత్తిడితోనే జనగామ జిల్లా ఏర్పాటు
అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోర్టు నుంచి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ జనగామ : ప్రజాస్వామ్య దేశంలో ఒత్తిడి ఓ ఆయుధమని, ప్రజలు పాలకులపై తిరగబడితే తప్ప పనులు కావని జనగామ జిల్లా ఏర్పాటుతో తేలిపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాతీయ రహదారులను దిగ్బంధించిన ఘటనలో పొన్నాలతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగం గా బుధవారం పొన్నాల లక్ష్మయ్య జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల ప్రకటనతో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాబూజగ్జీవ¯ŒSరామ్, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా..పాలకుర్తి సోమన్న, జీడికల్ సీతారాములు, కొమురవెల్లి మల్లన్న, కొడవటూరు సిద్ధేశ్వరుడు, బెక్కల్ రామలింగేశ్వరస్వామి కరుణతో జనగామ జిల్లా ఏర్పడిందన్నారు. జనగామ జిల్లా కోసం సాగిన ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కీలక భూమిక పోషించిందన్నారు. ఐదు మండలాల్లో ప్రత్యేక కార్యాచరణతో ఇక్కడి ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించామని పేర్కొన్నా రు. గత ఐదు నెలల నుంచి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా స్పందిం చడంలేదని, ప్రజాస్వామ్య దేశంలో ఇతంటి దారుణ పరిస్థితి మరెక్కడా ఉండదని అన్నారు. పట్టణంలో 85 రోజుల పాటు 144 సెక్ష¯ŒS అమ లు చేసి సాగించిన నిర్భంధకాండను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. కరువు ప్రాంతమైన జనగామను సస్యశ్యామలం చేసేందుకు మద్దూరు, నర్మెట, చేర్యాల రిజర్వాయర్లను నిర్మిస్తే వాటిని సిద్దిపేటకు తరలించ డం బాధాకరమన్నారు. జిల్లాల పేరుతో జనగామను మూడు ముక్కలు చేస్తున్నారని మం డిపడ్డారు. జిల్లాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరె డ్డి, మున్సిపల్ మాజీ చైర్మ¯ŒS వెన్నెం వెంకటనర్సింమారెడ్డి, నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, అన్వర్, చిర్ర సత్యనారాయణరెడ్డి, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సు« దాకర్, బనుక శివరాజ్ యాదవ్, కొత్త కరుణాకర్‌రెడ్డి, రాందయాకర్, మదార్ షరీఫ్, జమా ల్ షరీఫ్, రంగ రాజు ప్రవీణ్, మేకల రాంప్రసాద్, పన్నీరు రాధిక, వెన్నం శ్రీలత, వంగాళ కళ్యాణి మల్లారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జెడ్పీటీసీ నాచగోని పద్మ తదితరులు పాల్గొన్నారు.