చం ద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వనందుకు తెలంగాణ పల్లవి ఎత్తుకున్న కేసీఆర్ ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు.
మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: చం ద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వనందుకు తెలంగాణ పల్లవి ఎత్తుకున్న కేసీఆర్ ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు 21న రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు పట్టణానికి వచ్చిన పొన్నాల శనివారం స్థానిక షాలీమార్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సాగర హారం, మిలియన్‌మార్చ్, సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా ఫామ్‌హౌజ్‌లో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచి ఇక్కడి ప్రజలను విస్మరించిన కేసీఆర్ కనీసం లోక్‌సభలో కూడా వారి సమస్యల గురించి ప్రస్తావించలేదని అన్నారు. పార్లమెంటు ఒక్కో ఎంపీ సగటున 76 శాతం హాజరైతే నీవు 13 శాతమే రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళావని దెప్పి పొడిచారు. ఐదేళ్ళలో 2జీ స్ప్రెక్ట్రమ్‌పై ఒక సారి, ఓ మంత్రిపై దాడి జరిగిందని ఒకసారి మాత్రమే మాట్లాడారని వివరించారు.
తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ నాయకులను చే రదీసి ఉద్యమకారులను కించపరుస్తున్నారని అన్నారు. ‘దళితుణ్ణి సీఎం, మైనార్టీలను డిప్యుటీ సీఎం చేస్తానని ప్రగల్భాలు పలికిన నీ పార్టీ నుంచి ఆయా వర్గాల నేతలు విజయరామారావు,చంద్రశేఖర్ అతాస్ రెహమాన్,సయ్యద్ ఇబ్రాహీంలను ఎక్కడికి పంపావని’ అన్నారు.
ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో సోనియాగాంధీపై విమర్శలు చేస్తున్నారని,వాస్తవాలు మాట్లాడుతున్న తనపై కూడా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వద్దని అన్న నరేంద్రమోడీ ఏం మొఖం పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రచారానికి వస్తున్నారన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి,ఐఏసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, మాజీ మంత్రులు డీకే అరుణ, పి.చంద్రశేఖర్, నాయకులు కొత్వాల్, విఠల్‌రారావు తదితరులు పాల్గొన్నారు.