బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి | YSRCP Capability HIghlighted | Sakshi
Sakshi News home page

బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి

Published Thu, May 22 2014 9:02 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి - Sakshi

బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి

* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు కూడా నిండకుండానే సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి తన సత్తా చాటింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ తొలిసారి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది. దేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు అనేక పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి.  దశాబ్దాల చరిత్రగల పార్టీలు ఒక్క లోక్సభ స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూశాయి.   వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి బలంగా వీచి మోడీ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది.   రాష్ట్రంలో  బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్ను వెంటబెట్టుకొని తిరిగారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు.  ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, నాయకురాలు షర్మిలలు మాత్రమే  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గణనీయమైన ఫలితాలు సాధించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది.  గ్రామీణ ప్రాంతాల ఓట్లర్లు ఆ పార్టీ పట్ల మంచి ఆదరణ చూపారు.

* 2014 స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని 2571 మునిసిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 53 వార్డులను, సిపిఐ 16,  బిజెపి 12, సిపిఎం 8, బిఎస్పి 5 వార్డులను మాత్రమే గెలుచుకోగా, తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన  వైఎస్ఆర్ సిపి 942 వార్డులను గెలుచుకుంది. టిడిపి 1428 వార్డులను గెలుచుకుంది.

* కార్పోరేషన్లలో అయితే టిఆర్ఎస్ 48, బిజెపి 4, కాంగ్రెస్ 2, సిపిఎం 3, సిపిఐ 2, బిఎస్పి ఒక్క స్థానంలో మాత్రమే గెలవగా, వైఎస్ఆర్ సిపి 124 స్థానాలను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లలో టిడిపికి 45.18 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య 4.64 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

ఈ ఎన్నికలలో 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. 30 ఏళ్ల అనుభవం గల టిడిపి 5,216 ఎంపిటిసి స్థానాలను, 373 జడ్పిటిసి స్థానాలను గెలుచుకోగా, తొలిసారి పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 4,199 ఎంపిటిసి స్థానాలను, 275  జడ్పిటిసి స్థానాలను గెలుచుకుంది. ఇంత చేసి ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం 3.07 శాతం మాత్రమే.

పార్టీ ఆవిర్భవించి కొద్ది కాలమే అయినా ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి క్రమశిక్షణ గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఎటువంటి గొడవలకు తావులేకుండా లోక్సభ, శాసనసభ సీట్లను కేటాయించింది. కొత్తవారికి అనేకమందికి టిక్కెట్లు ఇచ్చినా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థులకు సహకరించారు.  టిక్కెట్ల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపిలలో వివాదాలు చెలరేగాయి. ఈ పార్టీల తరపు తిరుగుబాటు అభ్యర్థులు  పోటీ చేశారు. ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టిడిపి  తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

వైఎస్ఆర్ సిపి విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని వర్గాల టిక్కెట్లు ఇచ్చింది. తిరుపతి, కుప్పంలలో మాజీ ఐఏఎస్ అధికారులను, మల్కాజ్గిరిలో మాజీ ఐపిఎస్ అధికారిని, అరకులో మాజీ గ్రూప్1 అధికారిని నిలిపింది. ఇంకా పిహెచ్డి, పిజి చేసిన అనేక మంది విద్యావంతులకు అవకాశం ఇచ్చింది.

* టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రధాన్యత. కాపులకు, బిసిలకు, మైనార్టీలకు తగిన స్థాయిలో అవకాశం.

కొత్తవారికి, యువతకు అవకాశం ఇచ్చింది. ఎంపిలుగా గెలిచిన 9 మందిలో ఏడుగురు కొత్తగా లోక్సభలో అడుగుపెట్టనున్నారు.  శాసనసభకు ఈ పార్టీ తరపున 45 మంది కొత్తవారు ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది గతంలో ఇతర పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున నిలిచి గెలిచారు. అటువంటి వారిలో సినీనటి రోజా, విశ్వేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు.

* పార్టీ కోసం శ్రమించిన శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డలో నామినేషన్ దాఖలు చేసిన తరువాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరపున మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బ్యాలెట్ పేపర్లో ఆమె పేరునే ఉంచారు. మరణించినా జనం ఆమెనే 17,928 ఓట్ల మెజార్టీతో ఎన్నుకొని ఘన నివాళులర్పించి  దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు.

ఏపిలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి కాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి అధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఆ జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు ఉండగా, 8 స్థానాలలో  వైఎస్ఆర్ సిపి విజయం సాధించింది.

బిజెపి మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు రెండు లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ పార్టీ 282 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2001లో ప్రారంభమైన టిఆర్ఎస్ 2004లో ఎన్నికలలో పోటీచేసి 26 శాసనసభ స్థానాలను, 5 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలలో పోటీచేసి 16 శాసనసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగారు.  ఆర్ఎస్ వంటి పార్టీ 63 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి రావడానికి 14 ఏళ్లు పట్టింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వేవ్లో 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క లోక్సభ సీటును గానీ, ఒక్క శాసనసభ స్థానాన్ని గానీ గెలుచుకోలేకపోయింది. ఉభయ కమ్యూనీస్టు పార్టీలు,  లోక్సత్తా పార్టీ పరిస్థితి కూడా అంతే. అవి ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇటు దక్షిణాదిలో డిఎంకె(ద్రవిడ మున్నెట్ర కజగం), అటు ఉత్తరాదిలో బహుజన సమాజ్వాది పార్టీ, ఆస్సాం గణపరిషత్, నేషనల్ కాన్షరెన్స్ పార్టీలు  ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవానికి గురయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న సమాజ్వాది పార్టీ కేవలం 5 స్థానాలతో, బీహార్లో అధికారంలో ఉన్న జెడి(యు) 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించింది. టిడిపికి గట్టి పోటీ ఇచ్చి 70 శాసనసభ స్థానాలను, 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. నాలుగేళ్లు (29.11.2010) కూడా నిండని వైఎస్ఆర్ సిపి అనతి కాలంలోనే ఇంతటి పోటీని తట్టుకొని ఇన్ని స్థానాలను గెలుచుకోవడం  గొప్ప విజయంగా భావించవచ్చు. మోడీ గాలిలో కూడా  ప్రజలు ఈ పార్టీని ఇన్ని స్థానాలతో గెలిపించి బలమైన ప్రతిపక్షంగా నిలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement