ఓటర్లు ఏకపక్షం !
జిల్లాలో ఫ్యాన్ హోరు వైఎస్‌ఆర్‌సీపీకి విశేష జనాదరణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జిల్లాలో ఏకపక్షంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్లు ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం జగన్‌కేనంటూ పలు సందర్భాల్లో నినదించారు. జిల్లాలో ఎక్కడ వైఎస్‌ఆర్‌సీపీ సభ లు, సమావేశాలు ఏర్పాటుచేసినా వేలాదిగా జనం తరలివచ్చారు.
ఈ జిల్లాను వైఎస్‌ఆర్‌సీపీ స్వీప్ చేస్తుందనే ప్రచారం అప్పుడే సాగింది. ఆ తరువాత జరిగిన కొన్ని సర్వేలు చిత్తూరు జిల్లాలో అత్యధిక సీట్లు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని తేల్చా యి. అయితే చివర్లో సర్వేలు చేసిన కొన్ని సంస్థలు కుప్పంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందని తేల్చాయి.
వెంకటరమణ మైనస్లే కరుణాకరరెడ్డికి ప్లస్
తిరుపతి అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే కరుణాక రరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లిన వెంకటరమణకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. పదవికోసమే ఆయన పార్టీ మారారనే ఆరోపణలు వచ్చాయి. నగరంలో భూకబ్జాలు చేసి కోట్లు సంపాదించారని, చంద్రబాబుకు 45కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌నేతలు ఆయనతో వెళ్లకపోగా, టీడీపీ వారు ఆయనను స్వాగతించడం లేదు. ఇవన్నీ కరుణాకరరెడ్డికి కలిసొచ్చే అంశాలుగా పలువురు ఓటర్లు చెబుతున్నారు.
సౌమ్యుడని చెవిరెడ్డికి ఓటు - గల్లాకు భూముల ఎఫెక్ట్
చంద్రగిరి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సౌమ్యుడు, అడిగిన వెంటనే సాయం చేసే మనస్తత్వం ఉన్నవాడనే భావన జనంలో ఉంది. తుడా చైర్మన్‌గా తిరుపతితో పాటు తిరుపతి రూరల్, చుట్టుపక్కల మండలాల్లోని పలు గ్రామాలను అభివృద్ధి చేసిన వ్యక్తిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ైదెవభక్తి ఎక్కువగా ఉన్న భాస్కర్‌రెడ్డిని గెలిపించుకోవడం తమ బాధ్యత అనే భావన తిరుపతి రూరల్ మండల ఓటర్లలో బలంగా ఉంది. ఈ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోటీ చేస్తున్నారు. ఈమె ఇటీవలి వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయాన్ని గమనించిన ఆమె టీడీపీలో చేరి తనకు చంద్రగిరి అసెంబ్లీ, తన కుమారునికి గుంటూరు పార్లమెంటు టికెట్లు సంపాదించారు.
ఇద్దరి టికెట్ల కోసం చంద్రబాబుకు వీరు కోట్లాది రూపాయలు ఇచ్చారనేది జనంలో మాట. కోట్లకు కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు తక్కువ డబ్బులు చెల్లించి వారి భూములు కొనుగోలు చేసి అందులో పలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. చంద్రగిరి నుంచి వైఎస్‌ఆర్ చలవతో పలుసార్లు గెలిచిన గల్లాను చూసి ఓటర్లు ఓట్లు వేయలేదని, పెద్దాయన వైఎస్‌ఆర్‌ను చూసి వేశారని, ఇప్పుడు ఆయన కొడుకు పెట్టిన పార్టీ నుంచి పోటీలో ఉన్న భాస్కర్‌రెడ్డిని తమ నాయకుడిగా భావించి ఆయనకే ఓట్లు వేస్తామని బహిరంగంగా చెబుతున్నారు.
‘గాలి’కి ఎదురుగాలి - తిరుగులేని ‘రోజా’
నగరి నుంచి పలుసార్లు గెలిచిన టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఈ సారి ఎదురుగాలి వీస్తోంది. ఫ్యాన్‌గాలి దెబ్బకు ఆయనకు దిమ్మతిరగటం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యరి ఆర్కే రోజా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గతంలో ఇక్కడి నుంచి ఒకసారి ఆమె టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. వైఎస్‌ఆర్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన రోజా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో ముఖ్య నాయకురాలుగా పనిచేస్తున్నారు.
రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు సందర్భాల్లో నగరి నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. పైగా ఈమె సామాజిక వర్గానికి చెందిన వారు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఈ సారి వీరంతా రోజానే బలపరుస్తున్నారు. దీంతో రోజా బంపర్ మెజారిటీతో గెలుస్తారనేది ఇక్కడి ఓటర్ల అభిప్రాయం. ముద్దుకృష్ణమ నాయుడు అనేకసార్లు ఇక్కడి నుంచి గెలిచినా నియోజవకర్గానికి ఏమీ చేయలేదని, నగరిని మునిసిపాలిటీగా చేసిన తరువాత తిరిగి పంచాయతీగానే మార్పిస్తానని ‘గాలి’ మాట చెప్పారని ప్రజలు నిర్ధారించుకున్నారు.
ఈసారి ఆయనకు ఓటుతో సమాధానం చెప్పనున్నారు.ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి తిరుగేలేదు, చిత్తూరు పార్లమెంట్ స్థానంతోపాటు చిత్తూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓటర్లు ఏకపక్షంగానే ఓటు వేసేందుకు నిర్ణయించారనేది పలు సర్వే సంస్థల వాదన. ఈ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని, మదనపల్లెలో బీజేపీ పోటీ కూడా నామమాత్రమేననే ప్రచారం సాగుతోంది.
తమకు వస్తుందనుకున్న సీటు దక్కకుండా పోయిందని, జిల్లాలో బీజేపీ వారికి ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీ వారు లాక్కుని ఎటూ కాకుండా చేశారని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.
తిరుపతి, రాజంపేటలోనూ ఎలాగూ గెలిచే అవకాశాలు లేవని, తాము ఓటు వేయకుండా ఉంటే డిపాజిట్లు దక్కకుండా పోవడం ద్వారా తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోటీలో ఎవ్వరూ సాటిరారని, వైఎస్‌ఆర్‌సీపీకి భారీ మెజారిటీ వస్తుందని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.