తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిని పరిచయం చేస్తున్న జగన్
‘‘చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక నాయకుడు హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే.. ఆ హామీ నెరవేర్చలేని పక్షంలో ఆ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇది ఒక్క జగన్‌తో సాధ్యం కాదు. అందరిలోనూ మార్పు రావాలి. మార్పు కోసమే ఓటెయ్యాలి. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతా. కాలేజీలకు వెళ్లాలంటే ఫీజు లక్షల్లో ఉంది. పేదపిల్లలు చదువుకోవాలంటే భారంగా మారుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మొక్కుబడిగా రూ.30 వేలు ఇస్తోంది. ఏ పేద వాడికీ ఆరోగ్యం బాగాలేకపోయినా 108 అంబులెన్స్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.. మీ రాజన్న బిడ్డకు ఒక్క అవకాశమివ్వమని ప్రార్థిస్తున్నా..’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం ఆయన తిరుపతి నగరంలోని లీలామహల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ప్రచార పర్వానికి తెరదించారు.
‘ఆ దేవుని ఆశీస్సులు.. మీ అందరి అండదండలతో త్వరలోనే మనందరి ప్రభుత్వం రాబోతోంది.. గడిచిన ఐదేళ్లుగా చంద్రబాబు మాయ మాటలతో మోసపోయాం.. బాబు వంచనకు, మోసాలకు, గురయ్యాం. అబద్ధాల బాబు అభివృద్ధిని గ్రాఫిక్స్ రూపంలో చూపించి మాయాజాలం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఇక మోసపూరిత హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుందాం.. అన్ని వర్గాల ప్రజల కళ్లల్లో ఆనందం చూద్దాం’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం చేసిన ప్రసంగం పార్టీ క్యాడర్‌తో పాటు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తిరుపతి లీలామహల్ కూడలి వేదికగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఆయన విజయవంతంగా ముగించారు.
తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరం పులకించింది. జై జగన్, రావాలి జగన్– కావాలి జగన్, సీఎం .. సీఎం అంటూ అభిమానుల కేరింతలతో తిరునగరం మురిసింది. తిరుపతిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి వేదికగా ముగించారు. ముగింపు సభ తిరుపతిలో నిర్వహించడం, విజయవంతం కావడం జిల్లా పార్టీ క్యాడర్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రచారంలో భాగంగా అశేష జన సందోహం నడుమ జగన్ ప్రచార రథం వద్దకు చేరుకున్నారు. రథం ఎక్కిన జగన్ తనదైన శైలిలో తిరుపతి అంటూ అందరినీ పలకరించిన తీరు ఆకట్టుకుంది. విశ్వసనీయత.. విలువలను ప్రతిబింబించేలా తాను అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పకుండా ప్రజా సంక్షేమ పాలనను అమలు చేస్తానని కుండలుబద్దలు కొట్టారు. ఆ సమయంలో జనం నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు వినిపించాయి. చంద్రబాబు గ్రాఫిక్స్‌పేరుతో అభివృద్ధిని చూపిస్తూ ప్రజల్ని మోసం చేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు.
ప్రత్యేక హోదాను సాధించుకుందాం
జగన్ ప్రసంగిస్తూ ప్రత్యేక హోదాకు బహిరంగంగా మద్దతు పలికిన కేసీఆర్ మాటలను స్వాగతించడానికి ఒక్కరూ కూడా ముందుకు రావకపోవడం దారుణమన్నారు. ఏపీలోని 25 ఎంపీలు, తెలంగాణలోని 16 ఎంపీల మద్దతుతో ప్రత్యేకహోదా సాధించుతీరుతానని జగన్ తేల్చి చెప్పారు. ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజా సంక్షేమం చంద్రబాబుకు ఎన్నికల రెండు నెలల ముందు గుర్తుకు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లాకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు.
‘ఫ్యాన్ గుర్తుకే మన ఓటు’ అంటూ ఎన్నికల ప్రచారాన్ని ముగించే చివరిలో జనంతో చెప్పించిన తీరు ఆకట్టుకుంది. ‘అన్నా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్.. అవ్వా ఫ్యాన్.. తాతా ఫ్యాన్, తమ్ముడూ ఫ్యాన్.. చెల్లెమ్మా ఫ్యాన్’ అంటూ ఫ్యాను గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని జగన్ చేసిన విజ్ఙప్తి తిరునగరివాసులను మరింత ఉత్తేజపరిచింది. ఇలా జగన్ ప్రసంగం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఫలించని ప్రలోభాలు
♦ వైఎస్ జగన్ సభకు జనం రాకుండా టీడీపీ కుట్రలు
♦ ఓటుకు నోట్ల పంపిణీ ప్రారంభించిన వైనం
♦ ప్రచారం పేరుతో ఒక్కొక్కరికి రూ.500
♦ అయినా వైఎస్ జగన్ సభకు తరలివచ్చిన జనం.. జనం ప్రభంజనం
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభకు జనం రాకుండా ఉండేందుకు టీడీపీ నేతలు చేసిన కుట్రలు పనిచేయలేదు. ఓటుకు నోట్లు ఇచ్చినా... ప్రచారం పేరుతో ఒక్కొక్కరికి అదనంగా డబ్బులు ఇచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభకు తండోప తండాలుగా తరలి రావడంతో టీడీపీ నేతలు చేతులెత్తేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుపతి లీలామాహల్ కూడలిలో ఎన్నికల ప్రచార ముగింపుసభకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సభకు జనం రాకుండా ఉండేందుకు టీడీపీ నేతలు నోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మరి కొందరు టీడీపీ నాయకులు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాధారణంగా ప్రచారంలో పాల్గొనే కూలీలకు రోజుకి ఒకరికి రూ.200 చొప్పున టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. వైఎస్ జగన్ సభకు వెళ్లకుండా, టీడీపీ తరఫున ప్రచారానికి వస్తే ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
జనం నీరాజనం
టీడీపీ నేతలు ఎన్నో ప్రలోభాలు పెట్టినా ఎవ్వరూ లొంగలేదు. తమ అభిమాన నాయకుడి సభకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు గత నెల 25న ఇదే లీలామహల్ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనాన్ని భారీగా తరలించాలని టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గత నెల 25న నిర్వహించిన చంద్రబాబు సభకు కేవలం 2వేల నుంచి 3వేల మందికి మించి రాలేదని ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లీలామహల్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభకు 35వేల నుంచి 40వేల మంది వరకు హాజరయ్యారు. నాటి చంద్రబాబు సభకు, నేటి వైఎస్ జగన్ సభకు హాజరైన జనాన్ని చూసి స్థానికులు టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని చర్చించుకుంటూ వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment