విజయవాడ నుంచి ఈవీఎంలతో విధులకు బయలుదేరిన ఎన్నికల సిబ్బంది
పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు జారీచేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌లు, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ నుంచి ఆర్‌జీఐ జారీచేసిన స్మార్ట్ కార్డులు, ఉపాధి హామీ పథకం కూలి గుర్తింపు కార్డు, కేంద్ర కార్మిక శాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీచేసిన ఆమోదిత గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు.
సాక్షి, అమరావతి : అంతిమ తీర్పు వెలువరించడానికి రాష్ట్రంలోని 3.93 కోట్ల మంది ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు. గురువారం ఉ.7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్‌తో మార్పునకు శ్రీకారం చుట్టనున్నారు. ఓటింగ్ ప్రక్రియ 11 గంటలపాటు అంటే.. సా.6 వరకు కొనసాగుతుంది. అయితే, సా.6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ స్లిప్‌లు ఇస్తారు. ఎంత రాత్రయినా వీరందరికీ ఓటువేసే అవకాశం కల్పిస్తారు. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ సా.4 వరకు.. కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో 5 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. మరో ఏజెన్సీ నియోజకవర్గం పాలకొండతో సహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సా.6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసి, ఈవీఎంలకు సీల్‌వేసి స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు పోలింగ్ ఏజెంట్లు అక్కడే ఉండాలి. మాక్ పోలింగ్ ఉ.5.30కే ప్రారంభమవుతుంది. ఆ సమయానికల్లా పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. వారి సమక్షంలో ప్రతి ఈవీఎంలో ఏ గుర్తుకు వేసిన ఓటు ఆ గుర్తుకు పడుతోందా లేదా అని నిర్ధారించేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్‌లో 50 ఓట్లు వేస్తారు. ఆ తరువాత ఆ ఓట్లను ఈవీఎంల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత ఎన్నికల అధికారి పోలింగ్ ఏజెంట్ల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు తీసుకోవాలి.
పోలింగ్ విధుల్లో 4.20లక్షల మంది ఉద్యోగులు
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. ఇందుకోసం పోలీసులతో కలిపి మొత్తం 4.20 లక్షల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ సామాగ్రిని, ఉద్యోగస్తులను తరలించడానికి 7,300 బస్సులను వినియోగిస్తున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరుతో పాటు, నీడనిచ్చే విధంగా ఏర్పాట్లుచేసినట్లు ద్వివేది తెలిపారు. 80 ఏళ్ల పైబడిన వారు, చంటి బిడ్డలతో వచ్చిన తల్లులను క్యూలైన్లతో సంబంధం లేకుండా నేరుగా వెళ్లి ఓటు వేయవచ్చని.. ఈ మేరకు అధికారులందరికీ ఆదేశాలను జారీచేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 5.22 లక్షల మంది దివ్యాంగ ఓటర్లకూ ప్రత్యేక ఏర్పాట్లుచేశామన్నారు. మరోవైపు.. పోలింగ్ సిబ్బంది బుధవారం రాత్రికే వారివారి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఓటున్న ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. వీలైనంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదు చేయాల్సిందిగా ద్వివేదీ పిలుపునిచ్చారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మొత్తం 27,817 కేంద్రాల్లో 46,120 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 30,000 పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా అమరావతిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటుచేస్తారు. ఈ పరిధి దాటి ఓటరు తప్ప ఇతరులు ప్రవేశించడానికి వీల్లేదు. చివరకు రాష్ట్ర, కేంద్ర మంత్రులకు కూడా అనుమతిలేదు. దొంగ ఓట్లు లేదా రెండోసారి ఓటు వేయడానికి వస్తే తక్షణం అరెస్టు చేస్తామని.. ఇలాంటి వారికి ఆర్‌పీ యాక్ట్ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకు శిక్ష పడుతుందని ద్వివేది స్పష్టంచేశారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, ఓటు వేసినట్లు ఫొటో తీయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, అటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం
2014తో పోలిస్తే ఈసారి ఓటింగ్ భారీగా పెరిగే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఈసారి ఓటింగ్ శాతం 85 శాతం దాటవచ్చని ద్వివేది తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఏప్రిల్‌లోనే జరుగుతుండడం.. ఎండలు తక్కువగా ఉన్నందున ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లు ఉంటే వీరిలో 2.86 కోట్ల మంది అంటే 77.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
రెండు చోట్ల మూడు ఈవీఎంలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీపడుతుండగా, జనసేన 137 అసెంబ్లీ, 16 పార్లమెంటు సీట్లలో మాత్రమే పోటీచేస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది తమ భవితవ్యం తేల్చుకోనుండగా, 25 పార్లమెంటు స్థానాలకు 319 మది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో అత్యధికంగా గుంటూరు పశ్చిమ నుంచి 34 మంది, మంగళగిరి నుంచి 32 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ మూడు ఈవీఎంలను వినియోగించాల్సి వస్తోంది. ఆ తర్వాత కర్నూలు నుంచి 28 మంది, గుంటూరు ఈస్ట్ నుంచి 27 మంది, విజయవాడ వెస్ట్ నుంచి 22 మంది, మైలవరం నుంచి 18 మంది పోటీలో ఉండటంతో ఈ స్థానాల్లో రెండేసి ఈవీంఎలు వినియోగిస్తున్నారు. అదే పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే నంద్యాల నుంచి అత్యధికంగా 20 మంది, గుంటూరులో 19మంది, కర్నూలులో 16 మంది బరిలో ఉండడంతో ఇక్కడ కూడా రెండు ఈవీఎంలు వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment