ఫ్యాన్ జోరు | ysrcp won in tirupthi | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ జోరు

Published Sat, May 17 2014 4:11 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM

ఫ్యాన్ జోరు - Sakshi

ఫ్యాన్ జోరు

  • ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం  
  •  మరో ఆరు చోట్ల టీడీపీ గెలుపు
  •  పట్టు నిలుపుకున్న పెద్దిరెడ్డి
  •  ఓటమి పాలైన కిరణ్ సోదరుడు
  •  సాక్షి ప్రతినిధి, తిరుపతి : అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. ఎనిమిది స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదట్లో ఫలితాలు పోటాపోటీగా వచ్చాయి. ఆ తరువాత ఏడు స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. పూతలపట్టు నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సునీల్‌కుమార్, టీడీపీ అభ్యర్థి లలితకుమారి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గెలుపొందారు.
     
    ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుంచి అన్ని పార్టీల వారు ప్రచారహోరు వినిపించారు. వరుసగా మునిసిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు రావడంతో నేతలు బిజీబిజీగా ఎన్నికల రంగంలో ఉన్నారు. ఆ తరువాత అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ  పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోయాయి.
     
    ఓటింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్‌కు వారంరోజుల గడువు ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమై సాయంత్రానికి ముగిసింది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 31,731ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై విజయం సాధించారు. గంగాధరనెల్లూరు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కే నారాయణస్వామి పోటీ చేశారు. ఈయనకు 20,765 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ డెప్యూటీ స్పీకర్ జీ కుతూహలమ్మ పోటీచేశారు.

    ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఘోర పరాజయాన్ని చవిచూశారు. మదనపల్లె నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి 17,039 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి చల్లపల్లి నరసింహారెడ్డిపై గెలుపొందారు. చంద్రగిరి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 4,518 ఓట్ల మెజారిటీ సాధించి మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని ఓడించారు. అరుణకుమారి కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు వరుసగా మంత్రి పదవిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు.
     
    పీలేరు నియోజకవర్గం నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన ఎన్ కిషన్‌కుమార్‌రెడ్డి (కిశోర్‌కుమార్‌రెడ్డి)ని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఓడించారు. రామచంద్రారెడ్డికి 15,137ఓట్ల మెజారిటీ వచ్చింది. కిషన్‌కుమార్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కావడంతో ప్రతి ఒక్కరూ ఈ ఫలితంపై ఉత్కంఠతో ఎదురు చూశారు. నగరి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆర్కే రోజా విజయం సాధించారు. ఇక్కడ ముక్కోణ పోటీ జరిగింది.

    కాంగ్రెస్ అభ్యర్థికి ఐదువేల ఓట్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు రోజా చేతిలో ఓటమిపాలయ్యారు. రాజకీయ ఉద్ధండుడిగా పేరున్న గాలి ముద్దుకృష్ణమనాయుడును వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సినీనటి రోజా ఓడించడం చర్చనీయూంశమరుుంది. పలమనేరు నుంచి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్ అమరనాథరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సుభాష్‌చంద్రబోస్ పోటీ చేశారు. అమరనాథరెడ్డి 3,361 ఓట్ల తేడాతో బోస్‌ను ఓడించారు.

    అమరనాథరెడ్డి కుటుంబం రాజకీయరంగంలో మంచి పేరు తెచ్చుకుంది. అందుకే అక్కడి వారు ఆయనను ఆదరించారు. పూతలపట్టు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే లలితకుమారినిపై 982 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇరువురి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ప్రతి మండలంలోనూ పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. విజయం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని వరించింది.
     
    టీడీపీ అభ్యర్థుల విజయం

     
    తెలుగుదేశం పార్టీ నుంచి తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం వెంకటరమణ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కరుణాకరరెడ్డిపై 41,294ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళిని 47,121 ఓట్లతేడాతో ఓడించారు. తంబళ్లపల్లె నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి జీ శంకర్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని 7,995 ఓట్ల తేడా తో ఓడించారు. చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన డీకే సత్యప్రభ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి జే శ్రీనివాసులును 6,776 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక సత్యవేడు నుంచి టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆదిమూలంపై 2,824ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై 7,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
     
    పట్టు నిలుపుకున్న పెద్దిరెడ్డి

    పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎన్నికైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో తన పట్టును నిలుపుకున్నారు. టీడీపీ వారికి వచ్చే మెజారిటీని నిరోధించి జనాన్ని తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. ప్రధానంగా పుంగనూరులో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపొందేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారు.

    పూతలపట్టులో డాక్టర్ సునీల్‌కుమార్‌ను గెలిపించడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మిథున్‌రెడ్డి ఇచ్చిన హామీని సునీల్‌కుమార్‌ను గెలిపించుకోవడం ద్వారా నెరవేర్చారని చెప్పవచ్చు. పడమటి నియోజకవర్గాల్లో బీజేపీ అతిరథ మహారథులైన నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ ఎన్నికల సభలు ఫలితాలనివ్వలేదు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement