తీరు మార్చుకోండి | Change the way | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోండి

Published Fri, Aug 8 2014 3:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

తీరు మార్చుకోండి - Sakshi

తీరు మార్చుకోండి

  • ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
  •  టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గితే..
  •  మూల్యం చెల్లించుకోవాల్సిందే
  •  వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతా
  •  మెప్పు పొందడం కోసంపయత్నించి బలిపశువులు కావొద్దు
  •  పోలీసులకు హెచ్చరిక
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గో.. మెప్పు పొందడం కోసమో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి బలిపశువులు కావొద్దని పోలీసు అధికారులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టీకరించారు.

    రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేతలు సుబ్రమణ్యం, ఎ.మధు, సిద్ధయ్య, శ్రీనివాసులుపై టీడీపీ నేత పద్మనాభనాయుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ రామచంద్రాపురం పోలీసుస్టేషన్‌లో బైఠాయించారు.

    పద్మనాభనాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలపై ఎలా కేసు నమోదు చేస్తారని సీఐ సాయినాథ్‌ను, పోలీసులను ప్రశ్నించారు. ఇందుకు సీఐ స్పందిస్తూ.. పద్మనాభనాయుడుపై రక్తపు గాయాలు ఉండడం వల్ల కేసు నమోదు చేశానని బదులిచ్చారు. దాంతో అక్కడి నుంచే రుయా ఆస్పత్రి  సూపరింటెండెంట్ వీరాస్వామికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేఖను తన మనుషుల ద్వారా పంపారు. ‘పద్మనాభనాయుడు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారా.. ఆయన శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా? ఆయనకు ఎలాంటి చికిత్స చేశారు?’ వంటి వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో చెవిరెడ్డి కోరారు.

    ఇందుకు రుయా సూపరింటెండెట్ వీరాస్వామి స్పందిస్తూ.. ‘పద్మనాభనాయుడు అవుట్ పేషంట్‌గా ఆస్పత్రికి వచ్చారు. ఆయన శరీరంపై ఎలాంటి రక్తపు గాయాలు లేవు.. సాధారణ చికిత్స చేసి పంపాం’ అని రాతపూర్వకంగా బదులు ఇచ్చారు. దానిని చూపుతూ వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసు బనాయించిన మాట వాస్తవం కాదా అని సీఐ సాయినాథ్‌ను చెవిరెడ్డి ప్రశ్నిం చారు. తప్పుడు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కోరారు. టీడీపీ నేతలపై సీఐ సాయినాథ్ కేసు నమోదు చేశారు.

    అనంతరం చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను భయోత్పాతానికి గురిచేయడం కోసం టీడీపీ నేతలు పోలీసులను ప్రయోగిస్తున్నారన్నారు. ఇందుకు నెత్తకుప్పం వైఎస్సార్‌సీపీ నేతలపై బనాయించిన కేసే నిదర్శనమన్నారు. తప్పుడు కేసు బనాయించిన పోలీసు అధికారులపై న్యాయస్థానంలో ప్రైవేటు కేసు ఫైల్ చేస్తానన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసు బనాయించిన ఏ ఒక్క అధికారిని వదిలి పెట్టే ప్రశ్నే లేదని.. న్యాయస్థానం ఎదుట నిలబెడతామని హెచ్చరించారు.

    అధికారపార్టీ నేతల మెప్పుకోసం తప్పుడు కేసులు పెట్టి బలిపశువులు కావద్ద ని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు బనాయిస్తోన్న అక్ర మ కేసులు.. చేస్తోన్న దాడులపై అసెంబ్లీలో పోరాటం చేస్తానన్నారు. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకుంటే శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని.. లేదంటే శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని.. అందుకు చంద్రగిరి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే ఉదాహరణ అని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement