సైకిల్‌కు ఒకటి ఫ్యాన్‌కు రెండు
- రాజంపేట, తిరుపతిలో వైఎస్సార్ సీపీ..
- చిత్తూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థుల విజయం
సాక్షి, తిరుపతి : జిల్లా పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక చోట టీడీపీ గెలుపొందింది. తిరుపతి, రాజంపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వీ.వరప్రసాదరావు, పి.మిథున్‌రెడ్డి గెలుపొందారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ రెండోసారి సైతం గెలుపొందారు.
ఈ ముగ్గురిలోనూ మిథున్‌రెడ్డి లక్షా డెబ్బైనాలుగు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. రాజకీయ అరంగ్రేటంలోనే ఎన్‌టీఆర్ తనయ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో తలపడ్డారు. అయినప్పటికీ ఓట్ల లెక్కింపు జరిగిన ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించి సునాయాసంగా విజయం సాధించారు.
రాజంపేట లోక్‌సభ పరిధిలోని పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలోనూ ఆధిక్యాన్ని చాటుకున్నారు. మిథున్‌రెడ్డికి 6,01,752 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పురందేశ్వరికి 4,26,990 ఓట్లు వచ్చాయి. జైసమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన హుస్సేన్‌కు 59,777 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌కు 29,332 ఓట్లు మాత్రమే వచ్చాయి.
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో మరోసారి కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ కీలకమైంది. చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్.శివప్రసాద్ 44,138 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాన్య కిరణ్‌పై ఆయన విజయం సాధించారు.
ఈ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ కూడా శివప్రసాద్‌కు అనుకూలించింది. చిత్తూరు,నగరి, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే సామాన్యకిరణ్‌కు తక్కువ వచ్చాయి. దీనిని బట్టి ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. కిందటి ఎన్నికల్లో కేవలం 10 వేల మెజారిటీతో గెలుపొందిన శివప్రసాద్, ఈ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని పెంచుకోగలిగారు.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వి.వరప్రసాదరావు వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి 37,425 ఓట్ల ఆధిక్యంతో సమీప బీజేపీ అభ్యర్థి జయరాంపై విజయం సాధించారు. ఇక్కడ వరప్రసాదరావుకు 5,80,376 ఓట్లు రాగా జయరాంకు 5,42,951 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన చింతామోహన్‌కు 33,333 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈ నియోజకవర్గంలోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ వైఎస్సార్ సీపీ అభ్యర్థికి అనుకూలించింది. లోక్‌సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడి ప్రారంభమైన మొదటి మూడు రౌండ్‌లలో వెనుకంజలో ఉన్న వరప్రసాదరావు ఆ తరువాత క్రమంగా పుంజుకున్నారు. చివరికి 37 వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గిన ఓట్లను నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లె, సూళ్లూరుపేట స్థానాలు భర్తీ చేశాయి.