చంద్రబాబు ప్రభుత్వం బోర్డు తిప్పేసింది
ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి
పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వం నెల రోజులకే సమస్యలు పరిష్కరించకుండా బోర్డు తిప్పేసిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి హేళన చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహిస్తున్న మండల పర్యటనకు గురువారం జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌడేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రజ లను మోసగించి, ప్రజాభిమానం కోల్పోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నీతి నిజాయితీ ఉంటే తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి రైతులు, ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలో నీటి సమస్య విలయతాండవం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదిేహ నేళ్లుగా సరైన వర్షాలు కురవకపోవడంతో 1200 అడుగుల్లో కూడా నీరు లభించని దుస్థితి నెలకొందన్నారు.
చంద్రబాబునాయుడు ప్రజలను మోసగించడం మాని వేసి, తక్షణమే హంద్రీ నీవా, కండలేరు ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో పేదల భూములతో వ్యాపారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ వారందరికి ప్రజలు తగిన గుణపాఠం త్వరలోనే నేర్పుతారని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని కమిటీల పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు , పార్టీ అభిమానులు ఐకమత్యంతో ప్రజల పక్షాన నిలబడేందుకు గ్రామాల్లోకి వెళ్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నేతలు రెడ్డెప్ప, రెడ్డిప్రకాష్, జెడ్పీటీసీలు వెంకటరెడ్డి యాదవ్, రుక్ష్మిణమ్మ, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.