టీడీపీ, కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సోనియా, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మ దహనం
తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేనని వైఎస్‌ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. చట్టసభల్లో విభజన బిల్లుకు ఆమోదం తెలపడంతో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో గురువారం చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట కూడలివద్ద ఆందోళన నిర్వహించారు.
తెలుగు జాతి విచ్ఛిన్నానికి కారకులైన సోనియా, సహకరించిన బాబు, వెంకయ్యనాయుడుల దిష్టి బొమ్మలను తగుల బెట్టారు. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహకరించారని ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడటం వల్లే తెలుగు జాతికి ఈ దుస్థితి పట్టిందన్నారు. రెండుకళ్ల సిద్ధాంతం పేరుతో తెలుగు జాతిని నిలువునా చీల్చేందుకు కారకుడయ్యాడని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆరు నెలల ఉద్యమంలో చంద్రబాబు ఏనాడూ సమైక్యం అనలేదని గుర్తుచేశారు.
సమైక్యం అంటే బీజేపీతో పొత్తు కుదరదని చంద్రబాబు భావించారేమో అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ చొక్కారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ దామినేటి కేశవులు, గోవిందరెడ్డి, మండల కన్వీనర్ ఉపేంద్రరెడ్డి, చిన్నీయాదవ్, శ్రీరాములు, అజయ్‌కుమార్‌రెడ్డి, రామస్వామి, రఘు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విభజన పాపం వారిదే
Published Fri, Feb 21 2014 5:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement