- వైఎస్సార్ సీపీ, టీడీపీలకు చెరో స్థానం దక్కే అవకాశాలు
- మండల, జిల్లా పరిషత్ కార్యవర్గాలు కొలువుదీరడమే తరువాయి
సాక్షి, తిరుపతి: మున్సిపాలిటీలు మొదలు వరుసగా మండల, జిల్లా పరిషత్, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అవి అయిపోయి ప్రజలు, నాయకులు ఊపిరి పీల్చుకోకముందే జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి వస్తోంది.
ఈ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తిప్పారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన శాసనసభకు ఎన్నికైనందున మండలి పదవికి రాజీనామా చేయాల్సిందే. పదవీకాలం ముగియడంతో జయచంద్రనాయుడు స్థానం ఖాళీ అవుతోంది. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ రెండూ స్థానిక సంస్థల కోటాకు చెందినవే. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు జరిగినప్పటికీ ఇంకా కార్యవర్గాలు కొలువుదీరలేదు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరందరికీ ఓటు హక్కు ఉంటుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు కొలువుదీరిన వెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకునే బాధ్యత వారిపై పడనుంది. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రధాన పార్టీల సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జెడ్పీటీసీల్లో టీడీపీ కొంత ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ మండల పరిషత్, మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గెలిపించుకుంది. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఓట్ల ప్రాధాన్యతా క్రమంలో రెండు ప్రధాన పార్టీలకు చెరో స్థానం దక్కడం ఖాయం. శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు ఓడిపోవడంతో ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ స్థానానికి ఆ పార్టీలో డిమాండ్ ఎక్కువగా ఉంది. వరుస ఎన్నికల వేడితో రెండు నెలలుగా ఉత్కంఠకు గురైన జిల్లా ప్రజలకు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అంతేస్థాయి ఉత్కంఠ కలగనుంది.