పవన్ కళ్యాణ్, శత్రుచర్లలపై చర్యలు తప్పవా?
హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన సినీహీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, తిరుపతి టిడిపి, బిజెపి అభ్యర్థులపై వైఎస్ఆర్ సిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు నిబంధనలు అతిక్రమించినట్లు పూర్తి ఆధారాలను వైఎస్‌ఆర్ సీపీ నేతలు పీఎన్వీ ప్రసాద్, శివకుమార్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు సమర్పించారు.
విజయనగరం జిల్లా టెక్కలిలో ప్రజలనుద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆయా పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీడీపీకి వేయాలని చెప్పడం తీవ్రమైన నేరంగా వారు పేర్కొన్నారు. ఐపీసీ 107, 171ఇ, 171ఎఫ్ నిబంధనల ప్రకారం అది నేరమని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తక్షణమే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల కోసం డబ్బులు పంచినట్లు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభకు పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడినట్లు వారు తెలిపారు. శత్రుచర్లను వెంటనే ఎన్నికల బరి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. ‘‘ఒక్కో కుటుంబానికి రెండు వేలు ఇచ్చా.. మీ గ్రామానికి ఇప్పటికే రూ.15 లక్షలు పంపిణీ చేశా.. ఇంకెంత ఇవ్వాలి మీకు’’ అని శత్రుచర్ల టిడిపి కార్యకర్తలపైనే మండిపడ్డారు. ఆయన మాట్లాడేటప్పుడు సాక్షిటివి చానల్ వీడియో కూడా తీసింది.
టిడిపి-బిజెపి కూటమికి చెందిన తిరుపతి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి తమ ఎన్నికల ప్రచార కరపత్రాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫొటోను ముద్రించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పీఎన్వీ ప్రసాద్, శివకుమార్లు భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. వీరు ఇచ్చిన ఆధారాలను పరిశీలించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.