సాక్షి, అమరావతి: బావమరిది నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారా? వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు ఎమ్మెల్యే టికెట్ డౌటేనా? తెలుగుదేశం పార్టీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే నిజమేనని స్పష్టమవుతోంది. బాలయ్యను రాజకీయాల నుంచి పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా ఉంటే ఎప్పటికైనా తన కుటుంబానికి ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే ఆయనను పక్కకు తప్పించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ వెనుకపడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
బాలయ్య పోటీచేస్తే ఓటమి ఖాయం
40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని, సర్వేల్లో ఈ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకపడిపోయాయని చంద్రబాబు ఇటీవల తరచూ పార్టీ సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. ఆ 40 నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి అక్కడ బాలకృష్ణ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే లీకులు టీడీపీ నుంచి బయటకు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని, అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని, దీనికంతటికీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. ఇతర నాయకులకే వ్యవహారాలన్నీ అప్పగించి అప్పుడప్పుడూ బాలయ్య తన నియోజకవర్గంలో తూతూమంత్రంగా తిరగడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ బాలయ్యకు దక్కకపోవచ్చని చెబుతున్నారు.
బాబు వ్యూహంలో భాగంగానే..
బాలయ్యకు వ్యతిరేకంగా బయటకొస్తున్న లీకులు, ప్రచారం అంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేననే వాదన వినిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా బాలకృష్ణ క్రియాశీల రాజకీయాల్లో ఉంటే తన కుమారుడు లోకేశ్‌కు అడ్డంకిగా మారుతాడని బాబు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అందుకే బాలయ్యకు పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి హిందూపురం నుంచి లోకేశ్‌ను రంగంలోకి దించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్పటివరకూ బావకు విధేయుడిగానే ఉంటున్న బాలకృష్ణ తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment