
భువనగిరి పార్లమెంట్‌కు పొన్నాల?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్‌సభ సీటుపై కన్నేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
* జనగాం నుంచి పొన్నాల కోడలు పోటీ
* నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి
* మిర్యాలగూడ నుంచి జానా తనయుడు కె. రఘువీర్‌రెడ్డి
* హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
* కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి
* నల్గొండ కాంగ్రెస్ కమిటీ నుంచి పీసీసీకి అందిన జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్‌సభ సీటుపై కన్నేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లా జనగాం శాసనసభ నియోజకవర్గం నుంచి కోడలు వైశాలిని బరిలో దింపాలని భావిస్తున్నారు.టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి కూడా నల్లగొండ హుజూర్‌నగర్ నుంచే పోటీ చేయనున్నారు.
ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయనుండగా.. ఆయన తనయుడు కె.రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని శాసనసనభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావాదుల జాబితాను స్థానిక డీసీసీ రూపొందించి మూడు రోజుల కిందట పీసీసీకి పంపింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అధ్యక్షతన ఈనెల 13న జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ముందుకు ఈ జాబితా చేరింది. మరో రెండ్రోజుల్లో ఈ జాబితా ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లనుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప పొన్నాల పేరు దాదాపుగా ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
పొన్నాల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ పొన్నాలకు ఎంపీ టిక్కెట్ ఖరారైతే.. జనగాం నుంచి ఆయన కోడలు వైశాలిని బరిలో దింపుతున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి ఆమె పేరును కూడా సిఫారసు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ డీసీసీ జాబితాలోని వివరాలిలా ఉన్నాయి.
నల్లగొండలో ‘గుత్తా’ధిపత్యమే!
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును మాత్రమే సూచించారు. భువనగిరికి మాత్రం మొదట పొన్నాల లక్ష్మయ్య పేరును చేర్చారు. ఆ తర్వాత వరుసగా సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆర్.సర్వోత్తమ్‌రెడ్డి, టి.దేవేందర్‌రెడ్డి(డీసీసీ అధ్యక్షుడు) పేర్లను సిఫారసు చేశారు.
కెప్టెన్ దంపతుల హవా
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరును మాత్రమే సిఫారసు చేశారు. పక్కనే ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి పద్మావతి పేరును పంపారు. ఇక్కడ ఇంకెవరూ పోటీ లేకపోవడంతో వీరు పేర్లు దాదాపుగా ఖరారైనట్లే.
తండ్రికి సాగర్.. తనయుడికి మిర్యాలగూడ!
నాగార్జునసాగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జానారెడ్డి, ఆయన తనయుడు కె.రఘువీర్ పేర్లు జాబితాలో ఉన్నాయి. జానారెడ్డి వద్దనుకుంటే తప్ప ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఆయన కుమారుడు రఘువీర్ పేరును మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కూడా డీసీసీ సిఫారసు చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్, తిప్పన విజయసింహారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, పీసీసీ కార్యదర్శి కంచర్ల చంద్రశేఖరరెడ్డి, స్థానిక నేత పగిడి రామలింగారెడ్డి పేర్లు కూడా సిఫారసు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా పనిచేసిన తిరుమలగిరి సురేందర్ సైతం జర్నలిస్టు కోటాలో తనకు అవకాశమివ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు.
సూర్యాపేట దామోదర్‌రెడ్డికే
సూర్యాపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును మాత్రమే సిఫారసు చేశారు. దీంతో దామోదర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఎస్సీ నియోజకవర్గమైన నకిరేకల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్థానిక నాయకుడు కొండేటి మల్లయ్య, తుంగతుర్తి నుంచి గుడిపాటి నర్సయ్య, సురేందర్, ప్రీతమ్ (ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు), కె.పరమేశ్, అరుణ్ పేర్లను సిఫారసు చేశారు. మరో ఎస్సీ నియోజకవర్గం తుంగతుర్తి సీటు ఇస్తామని హామీ లభించిన తర్వాతే తెలంగాణ మాల మహానాడు నాయకుడు, తెలంగాణ రాజకీయ జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దేవరకొండ (ఎస్టీ) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలూనాయక్, పీసీసీ ఎస్టీ విభాగం ఛైర్మన్ జగన్‌లాల్ నాయక్, స్థానిక నాయకులు స్కైలాప్ నాయక్, రమేశ్ నాయక్ పేర్లను పంపారు.
ఆలేరు భిక్షమయ్యగౌడ్‌కే
ఆలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పేరును మాత్రమే సిఫారసు చేశారు. భువనగిరి నుంచి మాత్రం చింతల వెంకటేశ్వరరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, లింగం యాదవ్, కె.అనిల్ పేర్లు పీసీసీకి చేరాయి.
కోమటిరెడ్డికి చెక్?
నల్లగొండ జిల్లాలో నాలుగు గ్రూపులుండగా జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్‌రెడ్డి వాటికి నాయకత్వం వహిస్తున్నారు. కోమటిరెడ్డి మినహా మిగిలిన ముగ్గురి నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరి పేరును మాత్రమే సిఫారసు చేసిన డీసీసీ.. నల్లగొండ నుంచి మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు స్థానిక మైనారిటీ నేత హఫీజ్‌ఖాన్ పేరును కూడా పంపడం గమనార్హం. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్‌సభ సీటుపై పొన్నాల కన్నేశారు. కోమటిరెడ్డి వర్గంలోని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి వారితోపాటు ప్రత్యామ్నాయ పేర్లను కూడా పీసీసీకి సూచించారు. కోమటిరెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకే జానారెడ్డి వర్గం ఈ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.