అప్పుడే అస్త్రసన్యాసం..! | Telangana congress faces before elections campaign | Sakshi
Sakshi News home page

అప్పుడే అస్త్రసన్యాసం..!

Published Wed, Apr 16 2014 1:49 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

అప్పుడే అస్త్రసన్యాసం..! - Sakshi

అప్పుడే అస్త్రసన్యాసం..!

* దారీతెన్నూ లేని తెలంగాణ కాంగ్రెస్ పయనం
* ప్రత్యర్థులపై ప్రచార దాడికీ దిక్కు లేని దైన్యం
* జాడ లేని టీపీసీసీ ప్రచార కమిటీ
* 30 మంది అధికార ప్రతినిధులున్నా ఫలితం సున్నా

 
 పసునూరు మధు:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన దైన్యాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ఎన్నికల ప్రయాణం దారీతెన్నూ లేకుండా సాగుతోంది. చూస్తే సీఎం ఆశావహులేమో డజన్ల కొద్దీ ఉన్నారు. కానీ ప్రత్యర్థులపై కనీసం మూకుమ్మడిగా ఎదురుదాడి చేయలేక, ఉమ్మడిగా భారీ సభలు పెట్టి తెలంగాణ తెచ్చారన్న పేరును సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేయక, విపక్షాలను కట్టడి చేసే వ్యూహాలను కూడా రచించలేక... తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా దిగాలు పడి కన్పిస్తోంది. అసలు పార్టీలో జోష్ అన్నదే ఎక్కడా కన్పించడం లేదు.
 
 జిల్లాలవారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించే శక్తి, సామర్థ్యాలు నేతల్లో కరువయ్యాయి. జనాన్ని సమీకరించే నాయకులు, ప్రజాకర్షణ కలిగిన నేతలే లేకుండా పోయారు. చివరికి 10 మంది రాష్ట్రస్థాయి నేతలు ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యర్థి పార్టీలను కనీసం ఎండగట్టలేని దుస్థితిలో ఉన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ జాడ కాగడాతో వెదికినా కన్పించడం లేదు.
 
 టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 30 మంది అధికార ప్రతినిధులను నియమించినా, వారంతా ఏమయ్యారో ఎవరికీ తెలియదు. తెలంగాణ ఇస్తే 16 ఎంపీ, 100 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని మూడేళ్లుగా బీరాలు పలికిన నాయకులంతా ఇప్పుడు కనీసం తాము గెలిస్తే అదే పదివేలనే రీతిలో తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై చెమటోడుస్తున్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించడం అసలు వీరి వల్ల అవుతుందా అని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తల పట్టుకుంటోంది. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తదితరులను రంగంలోకి దించి తెలంగాణ అంతటా ప్రచారం చేయిస్తున్నా ఫలితం కన్పించకపోవడంతో అయోమయంలో పడింది.
 
 వీళ్ల వల్ల కాదు!
 తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రమంతటా కాంగ్రెస్‌కు ఊపు తేవాలని తొలుత భావించిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఇప్పుడు స్థానిక నేతల నిర్వాకం కారణంగా పునరాలోచనలో పడ్డారని సమాచారం. భారీ బహిరంగ సభలు నిర్వహించాలంటే ఆ స్థాయిలో జనాన్ని సమీకరించాలని, ఆ సత్తా తెలంగాణ నేతలకు లేదని భావనకు వచ్చారు. తెలంగాణలో చెరో మూడు భారీ బహిరంగ సభలు, జిల్లాలవారీగా రోడ్‌షోలు నిర్వహించాలనుకున్నా ఇప్పుడు వాటిని కుదించుకున్నారు. కరీంనగర్‌లో బుధవారం జరిగే బహిరంగ సభకు హాజరై అక్కడితో సరిపెట్టాలని సోనియా భావిస్తున్నారు. ఈ నెల 21 లేదా 25న మాత్రమే తెలంగాణలో పర్యటించి వెళ్లాలని రాహుల్ యోచిస్తున్నారు.
 
 ఇంట్లోనే పొన్నాల బ్యాటింగ్
 గులాబీ దళపతి కేసీఆర్ హెలికాప్టర్‌లో తెలంగాణ అంతటా కలియదిరుగుతున్నారు. జిల్లాలవారీగా భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ పాలనను ఎండగడుతున్నారు. టీ కాంగ్రెస్ నేతలపై దుమ్మెతిపోస్తున్నారు. కానీ తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామేనంటున్న కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటిదాకా కనీసం ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారు. తెలంగాణ ముఖ్య నేతలుగా చెప్పుకునే వారంతా సొంత నియోజకవర్గాలకు, జిల్లాలకే పరిమితమయ్యారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల కూడా కేసీఆర్‌పై కేవలం ప్రెస్‌మీట్ విమర్శలతో సరిపెడుతున్నారు. రాష్ట్రమిచ్చాక తొలిసారిగా, అందులోనూ ఎన్నికల వేళ సోనియా తెలంగాణలో అడుగుపెడుతుంటే ఆమె సభకు భారీ ఎత్తున ఏర్పాట్లుంటాయని అంతా అనుకుంటారు.
 
  కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం జనాన్ని తరలించడం తమ వల్ల కాదని, డబ్బులు ఖర్చు చేయలేమని అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో తొలి బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో జరిపి సోనియాకు కృతజ్ఞతలు చెబుతామని ఈ నేతలంతా ఫిబ్రవరిలో ప్రకటించడం తెలిసిందే. కానీ ఆ మైదానం నిండాలంటేనే 6 లక్షల పై చిలుకు జనం రావాలి. అదనంగా చుట్టుపక్కల మరో రెండు లక్షల మందిని సమీకరిస్తే తప్ప సభ విజయవంతం కాదని భయపడ్డ నేతలు, ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కరీంనగర్‌లో సభ పెడుతున్నారు. పైగా సోనియా రాష్ట్రంలో పర్యటించినప్పుడల్లా గాంధీభవన్ నుంచి మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా తీసుకెళ్లి భారీగా ప్రచారం పొందేవాళ్లు. సభ విఫలమైతే లేనిపోని విమర్శలొస్తాయని భావించారో ఏమో గానీ, ఈసారి మాత్రం సభకు తమంతగా మీడియాను తీసుకెళ్లకూడదని నిర్ణయించారు.
 
 ‘సీఎం’లు కలిసి మాట్లాడే సీన్ లేదు!
 దామోదర రాజనర్సింహ, కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హన్మంతరావు... ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవే లేదు. కానీ వీరంతా కలిసి ఒకే వేదికపై కూర్చుని మాట్లాడే సీన్ మాత్రం కన్పించడం లేదు. ఎవరికి వారే తామే గొప్ప అనే భావనలో ఉన్నారు. ముఖ్యంగా పొన్నాలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించాక వీరు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కనీసం 16 మంది ఎంపీ అభ్యర్థులనైనా ఒకే వేదికపై కూర్చోబెట్టి కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టాలని టీపీసీసీ భావించింది. అందరినీ మంగళవారం గాంధీభవన్‌కు రావాల్సిందిగా ఆదేశించింది. ఉదయం పదింటికి వారంతా మీడియాతో మాట్లాడతారని విలేకరులకు సమాచారమిచ్చింది. కానీ తీరా చూస్తే ఆ సమయానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్ మాత్రమే వచ్చారు. మరో గంటకు రాజయ్య, మధు యాష్కీ వచ్చారు. దాంతో ఆ నలుగురితోనే ప్రెస్‌మీట్ పెట్టి చాలించారు!
 
 ‘రెబల్స్’పై వేటు వేయలేని దుస్థితి
 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన నేతలపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో టీపీసీసీ పెద్దలున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసి నాలుగు రోజులైనా వారిపై ఇప్పటికీ చర్యలూ తీసుకోలేదు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించే అధికారమున్నా మిన్నకుంది.పైగా వరంగల్ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి వంటి తిరుగుబాటు అభ్యర్థులైతే తామే కాంగ్రెస్‌ను బహిష్కరిస్తున్నామంటూ పేర్కొంటూ పార్టీకి, పదవులకు రాజీనామా చేసేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement