ఎవరిని సిఎం చేయాలో ఓటేసే ముందు ఆలోచించండి
విజయనగరం: ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో ఓటేసేముందు మనకు మనమే ప్రశ్నించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సాలూరులో జరిగిన వైఎస్ఆర్సిపి జనపథం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మరో 37 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎన్నికలు రానున్నాయన్నారు. ఎవరైతే పేదవాడి గుండెచప్పుడు వింటాడో అలాంటి నేతనే మనం తెచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు.
చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు, దేశానికే చూపించిన మహానేత వైఎస్ఆర్ అన్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పొలాలు అమ్ముకున్న రోజులను చంద్రబాబు హయాంలో చూశానని చెప్పారు.
కరెంట్ ఉచితంగా ఇవ్వమని రైతన్న అడిగితే అవహేళనగా మాట్లాడిన బాబు మాటలు ఇంకా గుర్తొస్తున్నాయన్నారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు బాబు హయంలో చూడలేదని చెప్పారు.
2 రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.25 పైసలు చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ప్రజలను పట్టపగలే మోసగించడానికి కూడా ఆయన వెనుకాడ్డం లేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఆల్ఫ్రీ అంటూ మన ముందుకు వస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. నాడు 9ఏళ్ల పాలనలో ఆయన ఎందుకు ఈ హామీలన్నీ నెరవేర్చలేదు? అని ప్రశ్నించారు. జీతాలు పెంచండి అని అంగన్‌వాడీ కార్యకర్తలు అడిగితే గుర్రాలతో తొక్కించింది నీవు కాదా చంద్రబాబూ అని మండిపడ్డారు.
కూతుర్ని ఇచ్చిన మామకు వెన్నుపొడిచిన బాబు ఎన్నికలొచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్ ఫొటోకు దండేస్తాడన్నారు. చంద్రబాబులా తాను అబద్ధాలాడలేను. దొంగ హామీలివ్వలేను. ఆయనలా తాను రాజకీయాలు చేయలేనన్నారు. మహానేత వైఎస్ఆర్ నుంచి తనకు వారసత్వంగా వచ్చింది ఏమైనా ఉందంటే అది విశ్వసనీయతేనని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే రాష్ట్ర దశ, దిశ మార్చే ఐదు సంతకాలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 2019కల్లా కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తానని జగన్ చెప్పారు. పార్టీ తరపున పోటీ చేసే ఎంపి అభ్యర్థిగా గీతమ్మను ఓటర్లకు పరిచయం చేశారు.
సాలూరు వచ్చిన జగన్కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బహిరంగ సభాస్థలం జనంతో కిక్కిరిసిపోయింది. సాలూరు జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. జనం మేడలపైన, గోడలపైన ఎక్కి జగన్ ప్రసంగం విన్నారు.