నర్సీపట్నంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మన రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం చొప్పున మూడున్నర కోట్ల ఉద్యోగాలు చంద్రబాబు ఇస్తాడట అని ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలు తాను ఇవ్వనని చెప్పారు. నర్సీపట్నంలో జరిగిన వైఎస్ఆర్ సిపి జనపథం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బాబు హయాంలో పింఛన్ డబ్బులు కోసం అష్టకష్టాలు పడ్డ అవ్వ,తాతలను చూశానని, విద్యార్థుల చదువుల కోసం పొలాలు అమ్ముకున్న తల్లిదండ్రులను చూశానని చెప్పారు. నాటి భయానక రోజులు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉన్నాయన్నారు. చంద్రబాబు హయాంలో నిజాయతీ ఎక్కడుందా అని టార్చ్లైట్ పెట్టి వెతికినా కనబడని రోజులవన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే గ్రామగ్రామాన బెల్ట్షాపులు పెట్టించిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ఆల్ ఫ్రీ అంటూ మళ్లీ చంద్రబాబు మన ముందుకు వస్తున్నాడని హెచ్చరించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎన్నికలొస్తే చాలు ఆయన ఫొటో బయటకు తీస్తాడన్నారు.
మరో 45 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎన్నికలు రాబోతున్నాయని, మనం ఓటేసే ముందు మనకు మనమే ప్రశ్నించుకోవాలని అన్నారు. ఏ నాయకుడయితే ప్రజల గుండెచప్పుడు వింటాడో అలాంటి నాయకుణ్ని మనమంతా కలసి కట్టుగా ఎన్నుకోవాలన్నారు. విశ్వసనీయత అనే మాటకు అర్థం తీసుకొచ్చింది మహానేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆయనకు ముందు తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులొచ్చారని, అయినా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలనేలా ఆ మహానేత తన పాలన సాగించారన్నారు.
ఇంకా ఆయన ప్రసంగం...నాకు ఏదయినా వారసత్వం వల్ల వచ్చింది అంటే అది విలువలు, విశ్వసనీయత అని చెప్పగలను. అధికారంలోకి రాగానే రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు చేస్తాను. బడికి పంపించే తల్లులకు భరోసా ఇస్తున్నాను. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున, ఇద్దరికీ రూ.1000లు ఆ తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాం. ఇదే నా తొలి సంతకం. నా రెండో సంతకం అవ్వతాతల కోసం పెడతా. రూ.200 ఉండే పింఛన్ను రూ.700 చేస్తా. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ ఫండ్పై నా మూడో సంతకం చేస్తా. రైతులకు భరోసా కల్పిస్తా. డ్వాక్రా రుణాల రద్దుపై నా నాలుగో సంతకం. అడిగిన వారికి ఏ కార్డు కావాలో ఆ కార్డును 24 గంటల్లో ఇచ్చేలా చేస్తా. దీనిపైనే నా ఐదో సంతకం.
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తా. 2019 కల్లా కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తా. పగటిపూటే రైతన్నకు 7 గంటల కరెంట్ ఇచ్చేలా చేస్తా. ఉద్యోగం కోసం తిరిగే పేద పిల్లలకు కచ్చితంగా ఉద్యోగం వచ్చేలా కృషిచేస్తా. విలువలు, విశ్వసనీయత - కుళ్లు, కుతంత్రాల మధ్య ఈనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన రాజన్న రాజ్యం తెచ్చుకుందాం.