గజపతినగరంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
విజయనగరం: తాము అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతలేని రాష్ట్రంగా చూపుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగిన వైఎస్ఆర్ సిపి జనపథం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర దశ, దిశ మార్చేసే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు,తనకు ఉన్న తేడా విశ్వసనీయత అన్నారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ నుంచి తనకు వారసత్వంగా వచ్చింది ఏమైనా ఉందంటే అది విశ్వసనీయతేనని చెప్పారు.
మన చంద్రబాబుకి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా? ఇంటికో ఉద్యోగం పేరుతో మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తాడట. ఆయనలా తాను మోసం చేయలేనని చెప్పారు. పొలాలు అమ్ముకుని పిల్లలను చదివించే తల్లిదండ్రులను బాబు హయాంలో చూశామన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పిల్లల చదువుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. పేదవాడి గుండె ఆపరేషన్ కోసం జీవిత కాలం ఊడిగం చేసిన భయానక రోజులు ఇంకా గుర్తొస్తున్నాయన్నారు.
ఎన్నికలకు వెళ్లే ప్రతిసమయంలో చంద్రబాబు ఏదో ఒక హామీ ఇచ్చేవాడన్నారు. ఎన్నికలయ్యాక ఆ హామీలను గాలికొదిలేసేవాడని, విశ్వసనీయత అన్న పదానికి ఆయనకు అర్థం తెలియదని విమర్శించారు. 2 కిలో రెండు రూపాయల బియ్యాన్ని 5 రూపాయల 25 పైసలు చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. రుణాల మాఫీ ఎలా ఉన్నా వడ్డీ మాఫీ చేయాలని నాడు వైఎస్ అడిగినా కరుణించలేదని చెప్పారు. మానవత్వం లేని చంద్రబాబు ఇప్పుడు సాధ్యంకాని హామీలను గుప్పిస్తున్నాడన్నారు. ఆల్ ఫ్రీ అంటూ ప్రజలను వంచించేందుకు ముందుకొస్తున్నాడని హెచ్చరించారు. ఉచితంగా సెల్‌ఫోన్లు, ఫ్రీగా కలర్ టీవీలు ఇస్తానంటున్నాడు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటున్నాడని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు అని జగన్ గుర్తు చేశారు.