విశాఖ జిల్లా యలమంచిలి వైఎస్సార్ జనభేరిలో వైఎస్ జగన్ హామీ
గ్రామాల్లో ఇప్పటికీ చాలా మందికి ఇల్లు లేని దుస్థితి. దివంగత నేత వైఎస్ సువర్ణయుగంలో, దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కడితే.. వైఎస్ దేశంతో పోటీపడి రాష్ట్రంలో అదే ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో ఎక్కడా ‘మాకు ఇల్లు లేదు’ అని చేతులెత్తే పరిస్థితి లేకుండా చేస్తా. ఏడాదికి 10 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తా.
- వైఎస్ జగన్
సాక్షి, యలమంచిలి: ‘‘గ్రామాల్లో ఎక్కడ చూసినా చాలామంది యువకులు, పిల్లలు మద్యం తాగుతూ కనిపిస్తున్నారు. తాగుడు వల్ల దారి తప్పుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గుజరాత్‌లో అయితే మద్యపాన నిషేధం ఉంది. రెండు నెలల్లో మన సంక్షేమ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా గ్రామాల్లో బెల్ట్ షాపులే లేకుండా అన్నింటినీ రద్దు చేస్తా. కేవలం నియోజకవర్గ కేంద్రంలో ఒకే ఒక్క దుకాణం ఉంటుంది. ఆ తర్వాత స్టార్ హోటళ్లలో ఉంటుంది. అక్కడ కూడా అందుబాటులో లేని ధరల్లో ఉంటుంది. గ్రామాల్లో అక్రమ మద్యాన్ని నివారించేందుకు అదే ఊరికి చెందిన 10 మంది మహిళలనే పోలీసులుగా నియమిస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాల్టీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. సభ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మార్చేస్తా
‘‘మరో రెండు నెలల్లో అధికారంలోకి వస్తా. అప్పుడు ఐదు సంతకాలు చేస్తా. వీటితో రాష్ట్ర చరిత్రనే మార్చేస్తా. మొదటి సంతకం అక్కా చెల్లెళ్ల కోసం పెడతా. ప్రస్తుతం అక్కా చెల్లెళ్లు పనికి వెళ్తే రూ.150 వస్తుంది. ఇది మూడు రోజుల తిండికి సరిపోతుంది. నాలుగోరోజు మళ్లీ పనికి పోతేనే కడుపు నిండుతుంది. అందుకే అక్కా చెల్లెళ్లు ఆరో తరగతి, ఏడో తరగతి చదువుతున్న తమ పిల్లలను పనికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మళ్లీ రూ.150 వస్తే అయిదో రోజు తిండి దొరకుతుందని. ఏ అక్కాచెల్లీ కూడా జీవితంపై భరోసా లేకుండా బతకాల్సిన పని ఇక లేదు. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించండి. వారిని ఇంజనీరుగా, డాక్టర్‌గా నేనే చేస్తా. ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిషు మీడియం పెడతా. బడికి పంపిన ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1,000 తల్లి ఖాతాలో జమ చేస్తా. ఆ వెయ్యి చేతికి వస్తే ఆ నెల ఎలా బతకాలి అనే బాధ ఉండదు. అప్పుడే పిల్లల చదువులపై అక్కా చెల్లెళ్లకు ధ్యాస మరింత పెరుగుతుంది.
రెండో సంతకం అవ్వా తాతల కోసం పెట్టబోతున్నా. ఇవాళ వారి పరిస్థితి ఎలా ఉందంటే వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా కూలి పనికి వెళ్తున్నారు. వీరెవరిని కదిలించినా ‘మీ నాయన పుణ్యాన మా పింఛన్ రూ.200కు పెరిగింది. రెండుపూటలా భోజనం చేస్తున్నాం. కానీ ఇవి కూడా సరిపోక పనికి పోతున్నాం’ అంటున్నారు. అందుకే పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడేలా ప్రతి అవ్వా తాతలకు పనులకు పోయే పరిస్థితి లేకుండా మూడు పూటల భోజనం చేసేలా పింఛన్‌ను రూ.700చేస్తా.
మూడో సంతకం రైతన్నల కోసం పెడతా. అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీరికి గిట్టుబాటుకు, మద్దతు ధరకు భరోసా ఇస్తున్నా. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతా.
నాలుగో సంతకం మళ్లీ అక్కా చెల్లెళ్ల కోసం పెట్టబోతున్నా. డ్వాక్రా అక్కా చెల్లెళ్లకు అమ్మ ఒడి పథకం ద్వారా కొత్త జీవితం ఇస్తాం. ప్రస్తుతం వీరంతా నెలకు రూ.2వేల డ్వాక్రా రుణం కట్టడానికి తమతోపాటు పిల్లలను పనికి పంపుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా. ఈ రుణాలు రూ.20వేల కోట్ల దాకా ఉన్నాయి. ఏదోలా కిందా మీదపడి అక్కా చెల్లెళ్లకు న్యాయం చేస్తాం.
ఈ రోజు ఏ గ్రామానికి పోయినా అన్నా... నాకు రేషన్ కార్డు రావడం లేదు.. పింఛన్ రావడం లేదు.. ఆరోగ్యశ్రీ కార్డు రావడం లేదు.. అనే మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. అందుకే ఇక నుంచి ఎవరూ ఏ కార్డు కోసం తిరగక్కర్లేదు. మీ వార్డు, గ్రామంలోనే ఆఫీస్ తెరుస్తా. కంప్యూటర్లు, లామినేషన్ పెట్టి అడిగిన వారికి అడిగిన కార్డు 24 గంటల్లో ఇస్తా.
ఓటేసే ముందు ఒక్కసారి ప్రశ్నించుకోండి
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు ప్రజా సంక్షేమం కోసం పనిచేశారో గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్ చెప్పారు. వైఎస్‌లా మంచి ముఖ్యమంత్రిని ఎంచుకోవడానికి సమయం ఇది. ఇప్పటికీ చంద్రబాబు పాలనను గుర్తుకు తెచ్చుకుంటే చంటిపిల్లలు కూడా ఏడుస్తారు. చంద్రబాబు పాలనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చదువుల పెట్టుబడుల కోసం ఇళ్లు, పొలాలు కూడా అమ్ముకున్నారు. ఆ రోజుల్లోనే ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్టగా మారారు. నిజాయితీ అనే పదానికి బాబుకు అర్థం తెలీదు. రూ.2 కిలో బియ్యాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలతో తనకు సంబంధం లేదనే రీతిలో ఐదు రూపాయల పావలాకు పెంచేశారు. అంగన్‌వాడీలు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు. కష్టాల్లో ఉన్న రైతులకు వడ్డీ మాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ అడిగితే కరెంటు వైర్లను చూపించి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా నేను అబద్ధపు రాజకీయాలు చేయను. అబద్ధాలు చెప్పి విశ్వసనీయతను దెబ్బతీసుకోలేను. మాట ఇస్తే తప్పను.’’
ముస్లింల ప్రార్థనల కోసం ప్రసంగాన్ని నిలిపేసిన జగన్
‘వైఎస్సార్ జనభేరి’ యాత్రలో భాగంగా బుధవారం ఉదయం జగన్ విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాల్టీలో అనేక ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆయన్ను చూసేందుకు మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా జనం తరలివచ్చారు. రాత్రి యలమంచిలి మున్సిపాల్టీలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. జగన్ ప్రసంగిస్తుండగా.. సమీపంలోని మసీదులో ప్రార్థనలు మొదలయ్యాయి. ముస్లింలు నమాజ్ చేసుకునే సమయమని గ్రహించిన జగన్.. వారి ప్రార్థనలకు భంగం కలగకూడదని తన ప్రసంగాన్ని కాసేపు నిలిపేశారు. ప్రార్థనలు పూర్తయ్యాక తన ప్రసంగాన్ని కొనసాగించారు.