' టీడీపీ పాలిట గుదిబండలా చంద్రబాబు
' ఆయన సారథ్యంలో ‘అలా... అట్టడుగుకు’
' క్రమంగా తగ్గుతూ వస్తున్న టీడీపీ ఓట్ల శాతం
' ఎన్నికల గణాంకాలు చెబుతున్న వాస్తవమిది
' ప్రజల తిరస్కారానికి నిదర్శనం
కె.సుధాకర్‌రెడ్డి: ఎన్నికలొస్తే చాలు... చంద్రబాబుకు చిత్త చాంచల్యం చెప్పలేనంతగా పెరిగిపోతుంది. ‘వస్తున్నా... నేనే వస్తున్నా’ అంటూ ప్రతి రోజూ కనీసం పదిసార్లయినా ప్రకటించుకుంటారు. ‘టీడీపీని అధికారంలోకి తెస్తున్నా’ అంటూ జోరీగను తలదన్నేలా... జనం చెవులు చిల్లులు పడేలా ఊదరగొడతారు. ఆ వెంటనే పచ్చ మీడియాకూ పూనకం పట్టేస్తుంది. ‘అవునవును... బాబే వస్తాడు... దున్నేస్తాడు’, ‘టీడీపీకి తిరుగు లేదు’ అంటూ రాజగురువు సారథ్యంలో ఎల్లో శిబిరం పిచ్చెత్తిపోతుంది. ‘రుజువు కావాలంటే సర్వేలివిగో’ అంటూ సొల్లు పోగేసి సంబరపడిపోతుంది. తీరా చూస్తే జనం టీడీపీని యథాప్రకారంగా మర్చిపోలేని రీతిలో ఓడిస్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి బాబు ఇటు టీడీపీ పగ్గాలను, అటు సీఎం గద్దెనూ చేజిక్కించుకున్నప్పటి నుంచీ ప్రతి ఎన్నికల్లోనూ రుజువవుతూ వస్తున్న వాస్తవమే ఇది.
ఒక్క 1999 మాత్రం ఇందుకు మినహాయింపుగా కన్పించినా ఆ ఎన్నికల్లో కేవలం వాజ్‌పేయి గాలితో గట్టెక్కారే తప్ప అందులో బాబు ఘనతేమీ లేదు. 1995 నుంచీ ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలిసేదొక్కటే.. చంద్రబాబు పచ్చ పత్రికల ప్రచారమే ప్రాణవాయువుగా నెట్టుకొస్తున్నారు తప్ప ప్రజలను ఏనాడూ నమ్మలేదు. వారి బాగోగులను ఎన్నడూ పట్టించుకోలేదు. దాంతో సహజంగానే ప్రజలు కూడా చంద్రబాబును ఏనాడూ నమ్మలేదు. పొరపాటున కూడా ఆయనను నమ్ముకోలేదు!
గాలి సరే.. సైకిలేది
టీడీపీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఎంతసేపూ తన సొంత ఇమేజీ పెంచుకోవడానికి బాబు పడ్డ తాపత్రయం వల్ల పార్టీ గ్రాఫ్ అధఃపాతాళానికి పడిపోయింది. చెప్పింది ఏనాడూ చేయని, పొరపాటున కూడా మాటపై నిలబడని బాబు వైఖరి వల్ల టీడీపీ ఎప్పటికప్పుడు ప్రజల్లో చులకనవుతూనే వస్తోంది. చివరికి ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోందే కనీస స్థాయి ఫలితాలు కూడా దక్కించుకోలేని స్థితికి టీడీపీని చంద్రబాబు దిగజార్చారంటూ సొంత పార్టీ నేతలే వాపోతున్న పరిస్థితి! రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో టీడీపీకి తగ్గుతూ వస్తున్న ఓట్ల శాతాన్ని తలచుకుని వారంతా ఆవేదన చెందుతున్నారు. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీని, అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు, ఒక్క 1999ని మినహాయిస్తే అన్ని ఎన్నికల్లోనూ ఘోర పరాజయమే చవిచూస్తూ వస్తున్నారు. ఆయన భస్మాసుర హస్తం బారిన పడి టీడీపీ నానాటికీ కుదేలవుతూనే వస్తోంది.
1982లో ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 1995 దాకా పార్టీ ఆయన నాయకత్వంలోనే కొనసాగింది. వైస్రాయ్ కుట్రతో మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు 1995 సెప్టెంబర్ నుంచి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన సారథ్యంలో టీడీపీకి వరుస పరాజయాలే. అది మాత్రమే కాదు టీడీపీ ఓటు బ్యాంకు స్థిరంగా పడిపోతోంది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 46.21 శాతం ఓట్లు వచ్చాయి. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి గాలి పుణ్యాన 43.87% ఓట్లతో పరువు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచీ బాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు ఆయన్ను అస్స లు నమ్మలేదు. బీజేపీతో అంటకాగినా ఛీ పొమ్మన్నారు. అలా కాదని ఆ తర్వాత అటు టీఆర్‌ఎస్, ఇటు వామపక్షాలన్నింటినీ కలుపుకుని ‘మహా కూటమి’ అంటూ మాయ వేషాలేసినా మట్టికరిపించారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 37.59 శాతం ఓట్లే వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనైతే మరీ దారుణంగా 28.12 శాతం ఓట్లతో కుదేలైంది. వైఎస్ ఐదేళ్ల పాలనకు జనం జై కొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీకి 44.82 శాతం ఓట్లొచ్చాయి. బాబు పగ్గాలు చేపట్టాక 1996 ఎన్నికల్లో 32.59 శాతం, 1998 లో 31.97 శాతం ఓట్లొచ్చాయి. ఇక 2004లో టీడీపీ 33.12 శాతానికి, 2009లో ఏకంగా 25 శాతం ఓట్లకు పడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అక్షరాలా మట్టికరిచింది. దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్ని చోట్లా బాబు సారథ్యంలో దిగ్విజయంగా దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. అనేక చోట్ల మూడో స్థానానికి దిగజారింది. పలు స్థానాల్లోనైతే డిపాజిట్లు కోల్పోయి బిక్కముఖం వేసింది. దాంతో ప్రస్తుతం టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 2004లో బీజేపీతో పొత్తు ఫలించకపోవడంతో 2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలతో అంటకాగారు. అయినా తలకు బొప్పి కట్టడంతో వాటిని వదిలి ఈసారి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. బాబు ఏనాడూ ప్రజలను నమ్ముకోకపోవడమే ఆయన పరాజయాల పరంపరకు ప్రధాన కారణమని అంతా అంటుంటారు. ‘‘ప్రజాక్షేమం పట్టక అధికారం కోల్పోయినా బాబు గుణపాఠం నేర్వలేదు.
ప్రజల పక్షాన ఉద్యమాలు చేసిన పాపాన పోలేదు. ము ఖ్యంగా నాలుగేళ్లకు పైగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా కంటక పాలనను కనీసం ప్రశ్నించలేదు. పెపైచ్చు చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఏకంగా పాలక కాంగ్రెస్‌తో అన్నింటా కుమ్మక్కయ్యారు. అందుకు ప్రతిఫలాన్ని మరో ఘోర పరాజయం రూపంలో అనుభవించక తప్పదు’’ అన్నది ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న మాట.
బాబు... ఓ ధృతరాష్ట్ర కౌగిలి
కూటమి మిత్రులకు చంద్రబాబుది సాక్షాత్తూ ధృతరాష్ట్ర కౌగిలే! ఇది 2004లో బీజేపీకి బాగా తెలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత 2009 ఎన్నికల్లో ఎటూ పాలు పోని స్థితిలో టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలను ముగ్గులోకి లాగి మహాకూటమి కట్టారు బాబు. కానీ బాబును నమ్ముకున్న పాపానికి టీఆర్‌ఎస్ వంటి ఉద్యమ పార్టీ కూడా మర్చిపోలేని పరాజయాన్ని చవిచూసింది.
ఇక సీపీఎం, సీపీఐ అయితే బాబు పుణ్యాన నిండా మునిగాయి. నగదు బదిలీ పథకం, ఉచిత కలర్ టీవీలు, 12 గంటలు ఉచిత విద్యుత్, అన్ని రకాల రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య... ఇలా బాబు ఏకంగా 40 రకాలైన ఆల్‌ఫ్రీ హామీలు గుప్పించినా ప్రజలు మాత్రం ఆయనను ఏమాత్రం నమ్మలేదు. దాంతో 30 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ పరాజయాన్ని 2009లో చవిచూసింది. పార్టీకి అంత తక్కువ ఓట్ల శాతం రావడం అదే తొలిసారి!
...సైకిల్లర్
Published Tue, May 6 2014 1:20 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement