గులాబీ దళం రెడీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముందడుగు వేసింది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే... పరకాల, మహబూబాబాద్ మినహా మిగతా అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. గత రెండు ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో ఆలస్యం చేయడం.. ఆశించిన వారికి టికెట్ రాకపోవడం వంటి అంశాలతో గులాబీ శిబిరంలో లొల్లి పుట్టేది. అరుుతే ఈసారి సిట్టింగ్‌లకు, ఆశించిన వారికి సీట్లు దక్కడంతో ఆందోళనలు ఏమీ కనిపించ లేదు.
వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ టి.రాజయ్యకు ఖరారు కావడంతో కడియం శ్రీహరి ఎంపీగానే పోటీ చేయడం ఖాయమైపోయింది. మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ప్రొఫెసర్ ఎ.సీతారాంనాయక్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.రామచంద్రునాయక్ ఉన్నారు. అరుుతే వీరిద్దరూ మహబూబాబాద్ అసెంబ్లీ స్థానానికే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవలే పార్టీలో చేరిన బానోత్ నెహ్రూనాయక్ సైతం మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. శుక్రవారం ఈయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. వీరిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎవరికి ఖరారు చేయాలనేదానిపై పార్టీ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ప్రొఫెసర్ సీతారాంనాయక్ ములుగు, మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న చందూలాల్‌ను లోక్‌సభకు పోటీ చేయించే ప్రతిపాదన వచ్చింది. అజ్మీరా చందూలాల్ గతంలో వరంగల్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈయనపై టీఆర్‌ఎస్ అధినాయకత్వం ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లోనే సొంత నియోజకవర్గం ములుగు కాదని మహబూబాబాద్‌లో పోటీ చేసిన చందూలాల్.. ఈసారి ములుగులోనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. చివరికి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎ.చందూలాల్‌కే దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం తేల్చకపోవడం గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తొలిసారిగా ‘పెద్ది’
నర్సంపేట టికెట్ దక్కిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మెదటిసారిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారు. ములుగు అభ్యర్థి ఎ.చందులాల్, వరంగల్ తూర్పు అభ్యర్థి కొండా సురేఖ ఇద్దరు మాజీ మంత్రులు కాగా.. పాలకుర్తి అభ్యర్థి ఎన్.సుధాకర్‌రావు, భూపాలపల్లి అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యేలు. వరంగల్ పశ్చిమ అభ్యర్థి డి.వినయభాస్కర్, స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి టి.రాజయ్య, డోర్నకల్ అభ్యర్థి సత్యవతి రాథోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.