వాచ్‌డాగ్‌లా వ్యవహరించాలి: పొన్నాల
కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పొన్నాల దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దిశానిర్ధేశం చేశారు. హామీల అమలుకు సంబంధించి కార్యకర్తలు వాచ్‌డాగ్‌లా వ్యవహరించాలని సూచించారు. పార్టీకి అనుబంధంగా ఉన్న 13 సంఘాల నేతలతో గాంధీభవన్‌లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ పరిస్థితిని విడివిడిగా సమీక్షించారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను పరిశీలించేందుకు అనుబంధ సంఘాల నేతలకు టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రతులను అందజేశారు.
గతంలో కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేలా చూడడంతో పాటు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నేరవేరే విధంగా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. కొంత సమయం తీసుకుని ఆందోళన బాట పట్టాలని సూచించారు. విద్యార్థులు, మహిళలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు టీఆర్‌ఎస్ అనేక హామీలు ఇచ్చిందని, వాటిమీద ఇప్పటినుంచే దృష్టి పెట్టాలన్నారు. ఓటమితో కుంగిపోకుండా పార్టీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అనుబంధ సంఘాలు కృషిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాలన్నారు. నేతల మధ్య సమన్వయం లేక పార్టీ ఓటమి పాలయ్యిందని, కొందరు నేతలు ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని కుంతియా అన్నట్టు తెలిసింది. ప్రజలు ప్రతిపక్ష పాత్రనిచ్చారని, వారి ఆకాంక్షల మేరకు కార్యకర్తలు నడుచుకోవాలని సూచించినట్టు సమాచారం.