* పొన్నాల రాజీనామా చేయాలని డిమాండ్
* రేణుకా చౌదరిపై రాంరెడ్డి మండిపాటు
* టీఆర్‌ఎస్‌కు అనుకూలమనే ప్రచారం సరికాదన్న డీఎస్, జానా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం తొలి సమావేశం బుధవారం హాట్‌హాట్‌గా జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో, బయటా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు పరోక్షంగా చురకలంటించుకున్నారు. సీఎల్పీ భేటీ ప్రారంభమైన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చారు. ‘‘ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం పొన్నాల లక్ష్మయ్యే. ఆయన కూడా 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయకుండా ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి అధ్యక్షత వహించే ఈ సమావేశంలో నేనెందుకు ఉండాలి? నిరసన తెలిపి బయటకు వచ్చేశా’’అని మీడియాకు వివరించారు. ఆ తరువాత మరో మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సైతం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీరును సమావేశంలో తప్పుపట్టినట్లు తెలిసింది. ‘‘ఎన్నికల్లో కష్టపడి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులను గెలిపించుకునేది మేము. పార్టీలో మాత్రం ఆమె మాటే చెల్లుబాటవుతోంది. ఇదేం పద్ధతి? ఇలాంటి నిర్ణయాలవల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చింది’’అని రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిసహా ఖమ్మం నేతలు రాంరెడ్డికి మద్దతుగా మాట్లాడారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఓడిపోయినా మన నాయకుల మైండ్ సెట్ మారలేదు. ఇంకా అధికారంలో ఉన్నామని, బుగ్గకార్లలో తిరుగుతున్నామనే భావనలోనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాస్తవంలోకి రావాలి. కలసికట్టుగా పనిచేస్తూ పార్టీని బతికించుకోవాలి’’అని సూచించారు.
వైదొలగుదామనుకున్నా.. జానారెడ్డి
మొన్నటి ఎన్నికల తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుందామని అనుకున్నానని, అయితే పార్టీ పరిస్థితి చూశాక నిర్ణయం మార్చుకున్నానని జానారెడ్డి సమావేశంలో తెలిపారు. పార్టీని బలోపేతం చేసి ఒకటిరెండేళ్లలో రిటైర్ అవుతానని జానా చెప్పగా డీఎస్ జోక్యం చేసుకుని అవన్నీ ఇప్పుడెందుకని వారించినట్లు తెలిసింది.
ఇదెక్కడి వివుర్శ?
డీఎస్, జానారెడ్డి సైతం తాము టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్నామని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణకు భాగసామ్యం కల్పించకూడదని, విద్యుత్‌లో వాటా ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంతాపం చెబుతూ తీర్మానం చేశారు.