
'ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు'
వరంగల్: ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేకపోయిందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసి, 15నెలలుగా వారిని పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతాంగం సమస్యలు తీర్చడంలో రాష్ట్రం వెనకంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినా ప్రభుత్వానికి సోయిలేదన్నారు.
కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదని తెలిపారు. రుణ మాఫి, కొత్త రుణాలపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు స్వర్గం చూపిన టీఆర్ఎస్ ఇప్పుడు నరకం చూపిస్తుందన్నారు. ఆరవై ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటిపాలన చూడలేదని పొన్నాల ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారో టీఆర్ఎస్ స్పష్టం చేయాలన్నారు. ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని ఆయన అన్నారు.