సాక్షి, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన అంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలు సినిమా చూసినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ పేరుతో సినిమా చూపెట్టారు.. అందులో హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంట్రాక్టర్లు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా?. అదానీతో రేవంత్‌రెడ్డికి అంతర్గత ఒప్పందం ఉంది. అందుకే రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి రేవంత్.. అదానీపై ఫిర్యాదు చేయలేదు. ప్రజలను తప్పు దారిపట్టించేందుకు.. అసెంబ్లీ వేదికగా మోసం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం గవర్నర్‌ను కలిశారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆదాయం మూడున్నర రెట్లు పెరిగింది. నిజ జీవితంలోనూ లోన్ అనేది ఒక భాగం. అప్పులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అంటున్నారు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇలా లేదు. లోన్లు పరిమితులకు లోబడే వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? లేక క్లోజ్ చేస్తారా?. అప్పులు, పెట్టుబడుల గురించి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. మంత్రులు, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదారి పట్టించారు. బీఆర్‌ఎస్ పాలనలో 27 రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. కాంగ్రెస్ నేతలు వస్తారా చూపిస్తాను. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయలేదు. అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రవర్తన చాలా బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు.
మరో బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..‘పదేళ్ల పాటు అన్ని పండుగలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా జరిపారు. బతుకమ్మ పండుగకు చీరలు.. రంజాన్, క్రిస్మస్ పండుగలకు గిఫ్ట్స్ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. హైడ్రాతో పేదలను రోడ్డున పడేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment