మహేశ్వరం సీటుపై కాంగ్రెస్ వింత వాదన
షరతుతో కూడిన బీ.ఫాం ఇచ్చామన్న పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు రాజకీయ పార్టీల మధ్య స్నేహపూర్వకంగా పోటీ గురించి మనకు తెలుసు... పొత్తు కుదిరినా కొన్నిచోట్ల అవగాహనతో పోటీ చేసిన సందర్భాలూ చూశాం. ఈ ఎన్నికల్లో మాత్రం షరతుల తో కూడిన పోటీ అనే కొత్త నిర్వచనాన్ని వింటున్నాం.
అది కూడా 128 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ నుంచి ఈ మాట వెలువడడం విస్మయం కలిగిస్తోంది. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వయంగా ఆయనకు బీ.ఫాం అందజేశారు. ఇక్కడి నుంచి సీపీఐ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజీజ్‌పాషా ఇదివరకే నామినేషన్ వేశారు. ఇదే విషయాన్ని గురువారం విలేకరులు పొన్నాలతో ప్రస్తావించగా ఆయన వింత వాదన వినిపించారు. ‘పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన మాట వాస్తవమే. హైకమాండ్ ఆదేశాల మేరకు మల్‌రెడ్డికి బీ.ఫాం ఇచ్చాం.
ఇది షరతులతో కూడినదే. ఉపసంహరణ గడువులోపు దీనిపై నిర్ణయం తీసుకుంటాం’అని బదులిచ్చారు. వేరే పార్టీకి కేటాయించిన స్థానంలో మీ పార్టీ బీ.ఫాం ఇవ్వడం అనైతికం కాదా? అని ప్రశ్నించగా ఆయన ఆగ్ర హంతో, ‘అనైతికమని అంటే ఎలా? ఇది మోసం కానేకాదు. ముందే చెప్పాను కదా! కండీషన్స్‌తో కూడిన బీ.ఫాం ఇచ్చామని...’అని రుసరుసలాడారు. మీ సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డికి కేటాయించిన సీటును మరొకరికి ఇవ్వడం వెనుక మీ హస్తమే ఉందని ఆరోపణలు వస్తున్నాయి కదా అని అడిగితే ‘హైకమాండ్ నిర్ణయం మేరకే వేరే పేరు ప్రకటించాను’అని బదులిచ్చారు. కోదాడ సీటును సీపీఐకి కేటాయించలేదా? అని ప్రశ్నిస్తే ‘ సీపీఐకి 7 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు మాత్రమే కేటాయించాం. అందులో కోదాడ లేదు’అని పేర్కొన్నారు.
పాపం..సీపీఐ!: పొత్తు చర్చలు మొదలైనప్పటి నుంచి సీపీఐ నేతలకు కాంగ్రెస్ పార్టీ వరుసగా షాకులిస్తోంది. ప్రారంభంలో 22అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను ప్రతిపాదించిన సీపీఐ నేతలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఇచ్చినా సరిపెట్టుకుంటామని పేర్కొన్నారు. రెండుపార్టీల నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 1 ఎంపీ 12 అసెంబ్లీ స్థానాలపైఅంగీకారానికి వచ్చారు. ఆ ప్రతిపాదనతో ఢిల్లీ వెళ్లొచ్చిన పొన్నాల సీపీఐ నేతలతో సమావేశమై 10అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖంగా ఉందన్నారు.
ఏమైందో ఏమో...రెండ్రోజులు తిరగకుండానే ఖమ్మంపార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే సీపీఐకి కేటాయించాలని హైకమాండ్ నిర్ణయించినందున తానేమీ చేయలేనని నిస్సహా యత వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకున్న సీపీఐ నేతలు నేరుగా ఢిల్లీని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరపగా.. ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో హుస్నాబాద్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైనందున దానిని సీపీఐకి కేటాయించడం సాధ్యం కాదని, ఏడు స్థానాలు మాత్రమే ఇస్తామని షరతు విధించింది.
పొత్తు చర్చల్లో కాంగ్రెస్ నేతలు వేస్తున్న పిల్లి మొగ్గలతో తీవ్ర అసంతృప్తికి గురైన సీపీఐ నేతలు చేసేదేమీలేక ఏడు సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తీరా నామినేషన్లు ముగిసే సమయానికి చూస్తే ఆ ఏడు నియోజకవర్గాల్లోనూ ఐదింట్లో కాం గ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేయడం, అందులోనూ మహేశ్వరం నియోజకవర్గంలో నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీయే స్వయంగా బీ.ఫాం ఇవ్వడాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ చేత్తో సీటు..ఈ చేత్తో రెబెల్‌కు బీఫాం
Published Fri, Apr 11 2014 2:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement