కేసిఆర్‌ది మాటల గారడి
నేడు మేనిఫెస్టో విడుదల
అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ
రఘునాథపల్లి, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మాటల గార డి చేస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఇస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడని, మైనార్టీలకు ఉప ముఖ్యమంతి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాగానే సీఎం పదవి కోసం మాట మార్చాడని దుయ్యబట్టారు. రాష్ట్రం తామే తెచ్చామని టీఆర్‌ఎస్ నేతలు చె ప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇద్దరు ఎంపీలున్నవారికి రాష్ట్రాన్ని తెచ్చే బలం ఉంటుందా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూములే లేనప్పుడు కేసీఆర్ లక్ష ఎకరాలకు సాగు నీరు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో 15 ఎంపీ, 100 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను శనివారం విడుదల చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, జయశంకర్ ట్రస్ట్ పేర వంద కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు పగటి పూటనే ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామన్నారు. రుణమాఫీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆకలి.. అవమానం.. అమెరికా
గతాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టిన పొన్నాల
‘ఆకలికి ఓర్చుకున్నా.. అవమానాలు భరించా.. ఆ కసితో కష్టపడి చదవి అమెరికా వెళ్లాను. ఇప్పుడు తెలంగాణ పీసీసీఅధ్యక్షుడి స్థాయికి ఎదిగాను’ అని పొన్నాల లక్ష్మయ్య తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘జీవితంలోనే కాదు .. పార్టీలోనూ అవమానించారు. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డా’ అంటూ ఆయన కంటతడిపెట్టారు. స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా స్వగ్రామం ఖిలాషాపురంలో ఓటు వేశాక అందరినీ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ సభ్యులతో కలసి తన పెంకుటింట్లో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు.