హుస్నాబాద్, న్యూస్‌లైన్: ‘తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు పారుతున్నయి.. అయినా యాభై ఏళ్ల సంది కరువు కాటేస్తున్నది.. ఈ ప్రాంతానికి చెందిన నాయకులు ఎంపీలైండ్రు.. మంత్రులైండ్రు.. సామంతులైండ్రు.. ఎన్ని పదవులు అనుభవించినా తెలంగాణకు నీళ్లు మాత్రం రాలేదు.. కన్నీళ్లు పోలేదు..’ అంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.
తెలంగాణలో రిజర్వాయర్లు, శ్రీరాంసాగర్ వరద కాలువ నిర్మాణం పూర్తికాక, సాగుకు నీరందక రైతులు కరువుబారిన పడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి ఎందుకుమారలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. గురువారం సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల బహిరంగసభలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 5.35గంటలకు హెలిక్యాప్టర్‌లో వచ్చిన ఆయన సుమారు 17 నిమిషాల పాటు ప్రసంగించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అన్నిరంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. శ్రీరాంసాగర్ వరదకాల్వ కోసం ఈ ప్రాంత ప్రజల కళ్లు కాయలు కాశాయన్నారు.
ఇప్పటికి కూడా అది పూర్తికాలేదని, ఆంధ్రోళ్లు మననీళ్లు తీసుకువెళ్లుతున్నా మన ప్రాంతం ఏడారిగానే ఉందని అన్నారు. మిడ్‌మానేరు నుంచి నీళ్లు తీసుకువస్తానని, అవసరం అనుకుంటే అక్కడే కుర్చీ వేసుకుని కూర్చొంటానని కేసీఆర్ చెప్పారు. రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అయినా ఖర్చుపెట్టి సిద్దిపేట నియోజకవర్గం లాగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఊరూరికి నీళ్లు తెప్పించే బాధ్యత తనదని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ దుఖం, కసి, బాధలు ఉన్నాయని, ఈ నియోజకవర్గంలోని లక్షన్నర ఎకరాలకు నీటిని అందించే బాధ్యతను తాను తీసుకుంటానని వివరించారు. ఈ సమస్యలు పోవాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. యుద్ధం చేసేవానికే కత్తివ్వాలని, పనులు చేసే సతీష్‌కుమార్‌ను హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కేసీఆర్ కోరారు.
వినోద్‌ను గెలిపిస్తే కేంద్రమంత్రి
అయితడు..
‘ఎమ్మెల్యేలు గెలుసుడు.. టీఆర్‌ఎస్‌ప్రభుత్వం వచ్చుడు ఎంతోముఖ్యమో.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలుసుడు సుత అంతే ముఖ్యం’ అని కేసీఆర్ అన్నారు. బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ను కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతాడన్నారు. మనోళ్లు గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని వివరించారు.
వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. పదమూడేళ్లు ఉద్యమాన్ని మోసి తెలంగాణ బిడ్డకు జన్మనిచ్చిన టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఉద్యమాల ద్వారా తెలంగాణ బిడ్డను కన్న మనం తెలంగాణను బాగు చేసుకునే అధికారం సైతం మనకే దక్కాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణను నిర్మించుకోగల్గుతామని చెప్పారు. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ పాల్గొన్నారు.
నీళ్లు రాలే.. కన్నీళ్లు పోలే ..
Published Fri, Apr 18 2014 2:41 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement
Advertisement