సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గడువుకన్నా ముందుగానే ఎన్నికలు వస్తాయని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు వెల్లడించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలతో కలసి రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చూచాయగా చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ, లోక్‌సభకు విడి విడిగా ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసాన్ని ఈ సమావేశంలో కేసీఆర్ వ్యక్తం చేశారని తెలియవచ్చింది.
మనం ఎన్నికల జోన్‌లోకి వచ్చినట్లే...
‘‘షెడ్యూల్ ప్రకారం కొన్ని రాష్ట్రాలకు చివర్లో ఎన్నికలు జరుగుతాయి. వాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఖాళీగా ఉన్న అన్ని స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మనకు కొంచెం సమయం ఉంది. అయినా మనం ఎన్నికల జోన్‌లోకి వచ్చినట్లే. ఆరు నెలలు ముందుగా ఎన్నికలను నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. అందుకని వాటిని ముందస్తు ఎన్నికలని ఎలా అంటాం? కాకుంటే లోక్‌సభకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు రావొచ్చు. అసెంబ్లీకి ముందుగా ఎన్నికలు వస్తే మనం వంద శాతం అధికారంలోకి వస్తాం. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలు వస్తే మనకు ఈజీ అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో మనకు 16 సీట్లు వస్తాయి. అధికారంలో ఉంటాం కాబట్టి లోక్‌సభ ఎన్నికలను ఆట ఆడుకున్నట్టుగా సులభంగా ఎదుర్కో వచ్చు. కేంద్ర ప్రభుత్వంలోనూ మనం కీలకంగా ఉంటాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇన్‌చార్జీల నివేదికలే కీలకం...
సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటించే విషయంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జీలు, నియోజకవర్గాల ఇన్‌చా ర్జీలుగా వ్యవహరిస్తున్న ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ‘‘పార్టీ టికెట్ల విషయంలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల నివేదిక చాలా కీలకం అవుతుంది. ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని మార్గాల నుంచి సమాచారం వచ్చినా పార్టీ నేతల నివేదికలు చాలా ముఖ్యం. టికెట్ల వ్యవహారంలో ఇన్‌చార్జీల నివేదిక ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి’’ అని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. అయితే లోక్‌సభ, శాసనసభకు వేర్వేరుగా ఎన్నికలుంటే జాతీయ స్థాయి రాజకీయాల ప్రభావం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు అనుకూల, వ్యతిరేక పవనాలు ఉన్నా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గెలుపునకు ఇబ్బంది ఉండదనే అంచనాతో ఆయన ఉన్నట్లు తెలియవచ్చింది. అసెంబ్లీ, లోక్‌సభ టికెట్లు ఆశిస్తున్న నేతల మధ్య పోటీని ఎదుర్కోవడం కూడా సులభం అవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. శాసనసభ టికెట్ అవకాశం రాని వారికి లోక్‌సభలో ఉంటుందని చెప్పడానికి వేర్వేరుగా ఎన్నికలు జరిగితే వీలుంటుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 17న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. శాసనసభకు ముందుగా ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ సమావేశం కీలకం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆ రాష్ట్రాలతోనే అసెంబ్లీకి ఎన్నికలు
Published Wed, Aug 15 2018 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment