సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన షాక్‌తో డీలాపడ్డ మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉబలాటపడుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మంచి జోష్ నింపి అనుకూల ఫలితాలు రాబట్టాలనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 స్థానాలను మించి ఎక్కువ స్థాయిలో సీట్లు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా మారాలని అనుకుంటున్న రాజ్‌ఠాక్రే ప్రజలను తమవైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన సాగిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిచి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలనుకుంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటుందని, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారన్న ఆశాభావంతో ఉన్న రాజ్‌ఠాక్రే ప్రత్యర్థి పార్టీలకు దీటుగా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. శివసేనను చావుదెబ్బ తీయాలని భావించి బొక్కబోర్లా పడ్డ ఎమ్మెన్నెస్ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో అచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. మోడీ గాలి బలంగా వీయడంతోనే శివసేన విజయం సాధించిందని అంటున్న రాజ్‌ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశముండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుంటామంటున్నారు. మహాకూటమి జోరును తట్టుకొని నిలబడగలిగే సత్తా ఉందని అంటున్న రాజ్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నుంచి ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకున్నామని, ఇది మా విజయానికి బాటలు పరుస్తుందని ఆశాభావంతో రాజ్ ఉన్నారు.
వంద స్థానాలకు శివసేన గురి...
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టిన శివసేన అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. వందకుపైగా స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతలెవరూ? ఎవరికి టికెటిస్తే గెలుస్తారు? స్థానిక సామాజిక లెక్కలు ఎలా ఉన్నాయి? వీటన్నింటిని బేరీజు వేసుకుంటోంది. మహాకూట మి అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడింది. అనేకచోట్ల శివసేనతో పోలిస్తే ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పోలవడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని శివసేన అంచనా వేస్తోంది.
గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే శివసేనకు చాలా మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 171 స్థానాల్లో పోటీచేసిన శివసేన కేవలం 45 స్థానాలు గెలిచింది. ఇందులో ఎమ్మెన్నెస్ కారణంగా దాదాపు 27 స్థానాల్లో శివసేన ఓడిపోయింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సదరు 27 స్థానాల్లో దృష్టిసారిస్తే ఈ ఎన్నికల్లో మహాకూటమికి భారీగా ఓట్లు పోలయ్యాయి. దీంతో మహాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కనీసం గతంలో వచ్చిన 12 స్థానాలైనా దక్కుతాయా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.
అసెంబ్లీపై రాజ్ గురి
Published Mon, May 19 2014 10:44 PM | Last Updated on Mon, Oct 8 2018 6:14 PM
Advertisement
Advertisement