Rajthakre
-
మోదీ సక్సెస్‌లో సగం పాత్ర రాహుల్‌దే
థానే: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలవడంలో సగం క్రెడిట్ అంతా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌దేనని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని వెక్కిరించడం వల్లే ఓటర్లు రాహుల్‌కు పట్టం కట్టలేదన్నారు. థానేలోని కల్యాణ్ వద్ద శుక్రవారం రాత్రి రాజ్ థాకరే విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం గుజరాత్లో బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని నివేదికలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవచ్చు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మోదీ గెలుపులో రాహుల్ గాంధీ 50 శాతం.. సోషల్ మీడియా 15 శాతం, 10–20 శాతం బీజేపీ కార్యకర్తలు, ఆరెస్సెస్‌లు కీలక పాత్ర పోషించాయి’’అని చెప్పారు. -
బీజేపీలో చేరనున్న ఎమ్మెన్నెస్ నాయకులు?
సాక్షి, ముంబై: ఎమ్మెన్నెస్‌కు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరి చేరికకు మార్గం సుగమమైందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయాన్ని ఎమ్మెన్నెస్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికితోడు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటపడుతున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిపాలైన కొందరు అభ్యర్థులు... ఆ పార్టీ సీనియర్ నాయకులుగా వెలుగొందుతున్న అవినాశ్ అభ్యంకర్, బాలానాంద్గావ్కర్లపై రాజ్‌ఠాక్రేకు ఫిర్యాదు చేశారు. ఓటమికిగల కారణాలను ఆయనకు విశ్లేషించారు. అయినప్పటికీ రాజ్ ఠాక్రే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ప్రవీణ్ దరేకర్తోపాటు వసంత్ గీతే తదితరులు పార్టీకి రాజీనామా చేశారు. -
ఎమ్మెన్నెస్ గుర్తింపు రద్దయ్యేనా?
సాక్షి, ముంబై: అటు లోక్‌సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా ఆ పార్టీ గెలిపించుకోలేక పోయింది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క అభ్యర్థే విజయం సాధించాడు. దీంతో ఆ పార్టీని ఓటర్లు పూర్తిగా తిరస్కరించారనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే పరాజయంతో కుమిలిపోతున్న ఆ పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ జారీచేసిన పార్టీ గుర్తింపు (ఇంజన్) రద్దయ్యే ప్రమాదంకూడా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతిఫలంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే భారీ మూల్యం చెల్లించుకోకతప్పేలా లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొత్త పార్టీకి నిర్దేశించినరీతిలో ఓట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరు శాతం ఓట్లు కచ్చితంగా రావాలి. అయితే మొన్న జరిగిన లోక్‌సభ, తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తును రద్దు చేసే అవకాశముంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రాంతీయ పార్టీగా ఎమ్మెన్నెస్‌కు గుర్తింపు లభించింది. రైల్వే ఇంజన్ గుర్తు అధికారికంగా లభించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడంతో ఆ ఇంజన్ గుర్తును తిరిగి తీసుకునే అవకాశాలున్నాయి. -
31న ముంబైలో రాజ్ బహిరంగసభ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పార్టీ నేతలు, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే నడుంబిగించారు. ఇందుకోసం ఈ నెల 31న నగరంలోని సోమయ్య మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిద్వారా వారిలో నూతనోత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాభవంతో ఆ పార్టీ పదాధికారులు, అభ్యర్థులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ బహిరంగసభ ద్వారా వారిని ఓదార్చడంతోపాటు మరోసారి బలాన్ని నిరూపించే ప్రయత్నం చేయనున్నారు. ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునివ్వనున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పది స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ఏ ఒక్క స్థానంలో గెలవలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు లక్షల్లో ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఓడిపోయిన నియోజకవర్గాలలో అత్యధిక శాతం ఎమ్మెన్నెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారనే ధీమా కనిపించింది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ప్రచార సభల్లో రాజ్‌ఠాక్రే అందరిని విమర్శించి ఎంతో ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. అయినా పరిస్థితులు అనుకూలించలేదు. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడమే కాకుండా గతసారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఎమ్మెన్నెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘రాజ్‌గఢ్’లో అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఎన్నికల ఓటమిపై ఆరా తీశారు. ఓడిపోయిన అభ్యర్థులందరూ సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో ఓటమి ఫలితాలపై విశ్లేషణ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరాజయం సంఘటనను మర్చిపోయి త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా రాజ్‌ఠాక్రే సాధారణ కార్యకర్త మొదలుకుని పదాధికారులకి మనోధైర్యాన్ని నూరిపోయనున్నారు. ఇదిలాఉండగా పుణేలోని ఖడక్వాస్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ వాంజలే మృతి చెందారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఔరంగాబాద్‌లోని కన్నడ్ ఎమ్మెల్యే హర్షవర్థన్ జాదవ్ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఎమ్మెన్నెస్‌కు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సదరు 11 శాసనసభ నియోజక వర్గాలలో ఎమ్మెన్నెస్ ప్రాబల్యం తగ్గినట్లు తెలిసింది. దీంతో రాజ్ నేతృత్వంపై అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో రాజ్‌ఠాక్రే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి ఉంది. -
అదంతా రాజకీయ స్టంట్
సాక్షి, ముంబై: తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌కి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ స్టంట్ అని శివసేన నాయకుడొకరు పేర్కొన్నారు. ఫలితాలు వెల్లడి కాగానే ఇది కేవలం మోడీ విజయమని బహిరంగంగా ప్రకటించిన రాజ్... మరి ఉద్ధవ్‌కు పుష్పగుచ్ఛం పంపడమెందుకు..? శుభాకాంక్షలు ఎందుకు తెలియజేసినట్లు...? అంటూ ఆయన నిలదీశారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేకి మర్యాదపూర్వకంగా ఆరు అడుగుల ఎత్తయిన భారీ పూల బొకేని రాజ్ పంపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ రాజ్‌ఠాక్రే కేవలం సానుభూతి రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. పూలబొకే పంపడంలోని ఆంతర్యం ప్రజల సానుభూతి పొందడానికి చేసిన యత్నమని ఆరోపించారు. ఇతరులతో పూల బొకే పంపించే బదులు తానే స్వయంగా మాతోశ్రీ బంగ్లాకు వచ్చి ఉద్ధవ్‌కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశమే ఉంటే నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో పూల బొకే ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఠాణే, కల్యాణ్-డోంబివలి కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఘన విజయం సాధించిందని, ఈ పూల బొకే ఆలోచన అప్పుడు ఎందుకు రాలేదని నిలదీశారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చిన శివసేనను అభినందించని రాజ్... ఇప్పుడెందుకు శుభాకాంక్షలు తెలియజేసినట్లోననని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీపై రాజ్ గురి
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన షాక్‌తో డీలాపడ్డ మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉబలాటపడుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మంచి జోష్ నింపి అనుకూల ఫలితాలు రాబట్టాలనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 స్థానాలను మించి ఎక్కువ స్థాయిలో సీట్లు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా మారాలని అనుకుంటున్న రాజ్‌ఠాక్రే ప్రజలను తమవైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిచి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలనుకుంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటుందని, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారన్న ఆశాభావంతో ఉన్న రాజ్‌ఠాక్రే ప్రత్యర్థి పార్టీలకు దీటుగా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. శివసేనను చావుదెబ్బ తీయాలని భావించి బొక్కబోర్లా పడ్డ ఎమ్మెన్నెస్ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో అచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. మోడీ గాలి బలంగా వీయడంతోనే శివసేన విజయం సాధించిందని అంటున్న రాజ్‌ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశముండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుంటామంటున్నారు. మహాకూటమి జోరును తట్టుకొని నిలబడగలిగే సత్తా ఉందని అంటున్న రాజ్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నుంచి ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకున్నామని, ఇది మా విజయానికి బాటలు పరుస్తుందని ఆశాభావంతో రాజ్ ఉన్నారు. వంద స్థానాలకు శివసేన గురి... లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టిన శివసేన అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. వందకుపైగా స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతలెవరూ? ఎవరికి టికెటిస్తే గెలుస్తారు? స్థానిక సామాజిక లెక్కలు ఎలా ఉన్నాయి? వీటన్నింటిని బేరీజు వేసుకుంటోంది. మహాకూట మి అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడింది. అనేకచోట్ల శివసేనతో పోలిస్తే ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పోలవడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని శివసేన అంచనా వేస్తోంది. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే శివసేనకు చాలా మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 171 స్థానాల్లో పోటీచేసిన శివసేన కేవలం 45 స్థానాలు గెలిచింది. ఇందులో ఎమ్మెన్నెస్ కారణంగా దాదాపు 27 స్థానాల్లో శివసేన ఓడిపోయింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సదరు 27 స్థానాల్లో దృష్టిసారిస్తే ఈ ఎన్నికల్లో మహాకూటమికి భారీగా ఓట్లు పోలయ్యాయి. దీంతో మహాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కనీసం గతంలో వచ్చిన 12 స్థానాలైనా దక్కుతాయా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
శివాలెత్తిస్తా
శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను దింపుతామని రాజ్‌ఠాక్రే ప్రకటన సాక్షి, ముంబై: రాజ్‌కీయం మొదలైంది. పెదనాన్న బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీయే లక్ష్యంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే లోక్‌సభ కదనరంగంలోకి దూకుతామని ప్రకటించారు. ఠాణేలోని షణ్ముఖానందహాల్ లో ఆదివారం ఉదయం ఆ పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాకూటమిలోని బీజేపీ పోటీచేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు మద్దతిస్తామని సభాముఖంగా ప్రకటించి కాషాయ కూటమిలోనే కలకలం రేపారు. బీజేపీతో మైత్రికి సై అంటూనే, దాని మిత్రపక్షమైన శివసేనతో రాజ్ ఆడుతున్న రాజకీయ చదరంగం ఎటువైపు మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగేలా చేయడంలో సఫలీకృతమయ్యారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారీ మరాఠీ ఓటర్లు తమవైపు వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్న రాజ్‌ఠాక్రే ఇలా బహిరంగంగా శివసేనను లక్ష్యంగా చేసుకొని దూకుడు పెం చడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందోనన్న మీమాంస ఆ పార్టీలోనూ కనబడుతోంది. కావాలనే శివసేన పార్టీని లక్ష్యంగా చేసుకొని రాజ్‌ఠాక్రే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజల్లోకి శివసైనికు లు తీసుకెళ్లగలిగితే ఎమ్మెన్నెస్ పార్టీకి కొంతలో కొంతైనా దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరాఠీ ఓటర్ల లో గట్టి పట్టున్న శివసేన పార్టీని కూకటి వేళ్లతో పెకలించడం అంత సులభం కాదని అంటున్నారు. బాల్‌ఠాక్రే మరణానంతరం శివసేన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్‌ఠాక్రే ఈసారి ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో ‘మహా’ కూటమిని గెలిపిం చాలన్న కసితో ఉన్నారు. అయితే గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులను బరిలోకి దింపొద్దని మహాకూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాజ్‌ఠాక్రేను కోరింది. దీనిపై ఉద్ధవ్‌ఠాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజ్‌ఠాక్రే నిర్ణయం మహా కూటమిలోనూ భేదాభిప్రాయాలకు దారి తీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరింత వైరం... రాజ్‌ఠాక్రే తాజా ప్రకటనతో శివసేన వర్గాల్లో గుబు లు మొదలైంది. బీజేపీ అభ్యర్థులు పోటీచేసే నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని రాజ్ స్పష్టం చేసి సోదరుడితో మరింత వైరం పెంచుకున్నారు. గతంలో ఠాక్రే సోదరుల మధ్య పెరిగిన వైరాన్ని, దూరాన్ని తగ్గించేందుకు అనేక మంది దిగ్గజాలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. చివరకు బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఇద్దరూ ఒకటవుతారని అందరూ భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. తాజాగా రాజ్ చేసిన ప్రకటన ఠాక్రేల మధ్య మరింత దూరాన్ని పెంచేదిగా ఉంది. ఇది సేనా నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శివసేనపై లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. దీంతో శివసేన భవిత అంధకారంలో పడిపోయింది. కాగా, శివసేన, బీజేపీ, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) నేతృత్వంలోని మహాకూటమిలోకి ఇటీవల స్వాభిమాని శేత్కరి సంఘటన అధ్యక్షుడు, కొల్హాపూర్ ఎంపీ రాజు శెట్టి చేరారు. దీంతో మహా కూటమి మరింత బలపడిందని భావిస్తున్న తరుణంలో రాజ్ ఠాక్రే నిర్ణయం పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహాకూటమి లో శివసేన, బీజేపీ ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకా రం శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. గతంలో కూడా ఇదే ఫార్ములాను అవలంభిం చారు. ఆ ప్రకారం ఒక టర్మ్ శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఇప్పు డు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెన్నెస్ వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై కూడా పడే అవకాశముంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నిక ల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తే ఒప్పందం ప్రకా రం శివసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడం ఖాయం. మూడు పర్యాయాలుగా రాష్ట్రా న్ని ఏలుతున్న కాంగ్రెస్‌ను ఈసారి ఎలాగైనా గద్దె దింపి, అసెంబ్లీ భవనంపై కాషాయ జెండా రెపరెపలాండించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శివసేనకు రాజ్ కారణంగా చివరకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
టోల్‌నాకా ధ్వంసం
రాజ్‌ఠాక్రే సమక్షంలో రెచ్చిపోయిన ఎమ్మెన్నెస్ కార్యకర్తలు సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు ఠాణేలోని ఖారేగావ్ టోల్‌నాకా వద్ద గురువారం సాయంత్రం వీరంగం చేశారు. టోల్‌చార్జీలు కట్టనిదే రాజ్‌ఠాక్రే కాన్వాయ్‌ను పోనిచ్చేది లేదని అక్కడి ఉద్యోగి తేల్చి చెప్పడంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు రెచ్చిపోయినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... కల్యాణ్‌కు చెందిన ఎమ్మెన్నెస్ మహిళా పదాధికారి కల్పనా కపోతేతో టోల్ ఉద్యోగి తనకు రాజ్‌ఠాక్రే ఎవరో తెలియదన్నారు. దీంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు తమ వాహనాలు దిగి టోల్బూత్పై దాడికి దిగి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెన్నెస్ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు. దీంతో పరిసరాల్లో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సౌకర్యాలు లేకుండా టోల్ చెల్లించేది లేదని పేర్కొన్న కల్పనాతో టోల్ వసూలు సిబ్బంది కొంత అమర్యాదకరంగా ప్రవర్తించారని స్థానికులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న అనేక మంది ఎమ్మెన్నెస్ కార్యకర్తలు వెంటనే ఆ టోల్ నాకా వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ముంబై నుంచి నాసిక్ వెళ్తున్న రాజ్ ఠాక్రే టోల్ నాకా వద్దకి వచ్చారు. ఆయనను చూసిన ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అంతే టోల్నాకాపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే రాజ్‌ఠాక్రే నాసిక్ వెళ్తున్నట్టు ముందుగానే తెలిసి ఉండడంతో టోల్‌నాకా వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దాడికి పాల్పడిన వారిపై లాఠీలు ఝుళిపించారు. ఇదంతా కార్లో కూర్చొని ఉన్న రాజ్‌ఠాక్రే సమక్షంలోనే జరగడం విశేషం. అనంతరం ఆయన టోల్ చెల్లించకుండానే నాసిక్‌కు వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటన అనంతరం కల్యాణ్ ఎమ్మెల్యే ప్రకాష్ బోయిర్తో పాటు సుమారు 15 మంది ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెలారంభం నుంచి పలు చోట్ల ఎమ్మెన్నెస్ కార్యకర్తలు టోల్ బూత్‌లపై దాడులకు దిగి ధ్వంసం చేశారు. ఆ నష్టాన్ని రాజ్ ఠాక్రే ఆస్తులను జప్తుచేయడం ద్వారా పూడుస్తామని ప్రభుత్వం ఇటీవలే హెచ్చరించింది.