ఎమ్మెన్నెస్ గుర్తింపు రద్దయ్యేనా?
సాక్షి, ముంబై: అటు లోక్‌సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా ఆ పార్టీ గెలిపించుకోలేక పోయింది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క అభ్యర్థే విజయం సాధించాడు. దీంతో ఆ పార్టీని ఓటర్లు పూర్తిగా తిరస్కరించారనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే పరాజయంతో కుమిలిపోతున్న ఆ పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ జారీచేసిన పార్టీ గుర్తింపు (ఇంజన్) రద్దయ్యే ప్రమాదంకూడా ఉంది.
శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతిఫలంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే భారీ మూల్యం చెల్లించుకోకతప్పేలా లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొత్త పార్టీకి నిర్దేశించినరీతిలో ఓట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరు శాతం ఓట్లు కచ్చితంగా రావాలి.
అయితే మొన్న జరిగిన లోక్‌సభ, తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తును రద్దు చేసే అవకాశముంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రాంతీయ పార్టీగా ఎమ్మెన్నెస్‌కు గుర్తింపు లభించింది. రైల్వే ఇంజన్ గుర్తు అధికారికంగా లభించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడంతో ఆ ఇంజన్ గుర్తును తిరిగి తీసుకునే అవకాశాలున్నాయి.