ఎన్నికల బరిలో రాజ్ థాకరే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్ని థాకరేలు శాసించినా ఇంతవరకు వారి కుటుంబం తరపున ఒక్కరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. దివంగత నేత బాల్ థాకరే, ఆయన కుమారుడు శివసేన ప్రస్తుత అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే తొలిసారి ఈ ఏడాది జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. శనివారం రాజ్ థాకరే ఈ మేరకు ప్రకటన చేశారు.
ఎన్నికల్లో ఎంఎన్ఎస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతానని రాజ్ స్పష్టం చేశారు. తమ పార్టీని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, వారికి ఎన్నో అంచనాలున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజ్ థాకరే నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించినా.. బీజేపీ మిత్రపక్షం శివసేనపై తొమ్మది స్థానాల్లో ఎంఎన్ఎస్ తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే ఎంఎన్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.