శివాలెత్తిస్తా
శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను దింపుతామని రాజ్‌ఠాక్రే ప్రకటన
సాక్షి, ముంబై: రాజ్‌కీయం మొదలైంది. పెదనాన్న బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీయే లక్ష్యంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే లోక్‌సభ కదనరంగంలోకి దూకుతామని ప్రకటించారు. ఠాణేలోని షణ్ముఖానందహాల్ లో ఆదివారం ఉదయం ఆ పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాకూటమిలోని బీజేపీ పోటీచేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు మద్దతిస్తామని సభాముఖంగా ప్రకటించి కాషాయ కూటమిలోనే కలకలం రేపారు. బీజేపీతో మైత్రికి సై అంటూనే, దాని మిత్రపక్షమైన శివసేనతో రాజ్ ఆడుతున్న రాజకీయ చదరంగం ఎటువైపు మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగేలా చేయడంలో సఫలీకృతమయ్యారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారీ మరాఠీ ఓటర్లు తమవైపు వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్న రాజ్‌ఠాక్రే ఇలా బహిరంగంగా శివసేనను లక్ష్యంగా చేసుకొని దూకుడు పెం చడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందోనన్న మీమాంస ఆ పార్టీలోనూ కనబడుతోంది. కావాలనే శివసేన పార్టీని లక్ష్యంగా చేసుకొని రాజ్‌ఠాక్రే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజల్లోకి శివసైనికు లు తీసుకెళ్లగలిగితే ఎమ్మెన్నెస్ పార్టీకి కొంతలో కొంతైనా దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరాఠీ ఓటర్ల లో గట్టి పట్టున్న శివసేన పార్టీని కూకటి వేళ్లతో పెకలించడం అంత సులభం కాదని అంటున్నారు.
బాల్‌ఠాక్రే మరణానంతరం శివసేన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్‌ఠాక్రే ఈసారి ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో ‘మహా’ కూటమిని గెలిపిం చాలన్న కసితో ఉన్నారు. అయితే గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులను బరిలోకి దింపొద్దని మహాకూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాజ్‌ఠాక్రేను కోరింది. దీనిపై ఉద్ధవ్‌ఠాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజ్‌ఠాక్రే నిర్ణయం మహా కూటమిలోనూ భేదాభిప్రాయాలకు దారి తీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరింత వైరం...
రాజ్‌ఠాక్రే తాజా ప్రకటనతో శివసేన వర్గాల్లో గుబు లు మొదలైంది. బీజేపీ అభ్యర్థులు పోటీచేసే నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని రాజ్ స్పష్టం చేసి సోదరుడితో మరింత వైరం పెంచుకున్నారు. గతంలో ఠాక్రే సోదరుల మధ్య పెరిగిన వైరాన్ని, దూరాన్ని తగ్గించేందుకు అనేక మంది దిగ్గజాలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. చివరకు బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఇద్దరూ ఒకటవుతారని అందరూ భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. తాజాగా రాజ్ చేసిన ప్రకటన ఠాక్రేల మధ్య మరింత దూరాన్ని పెంచేదిగా ఉంది. ఇది సేనా నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శివసేనపై లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. దీంతో శివసేన భవిత అంధకారంలో పడిపోయింది. కాగా, శివసేన, బీజేపీ, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) నేతృత్వంలోని మహాకూటమిలోకి ఇటీవల స్వాభిమాని శేత్కరి సంఘటన అధ్యక్షుడు, కొల్హాపూర్ ఎంపీ రాజు శెట్టి చేరారు. దీంతో మహా కూటమి మరింత బలపడిందని భావిస్తున్న తరుణంలో రాజ్ ఠాక్రే నిర్ణయం పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మహాకూటమి లో శివసేన, బీజేపీ ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకా రం శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. గతంలో కూడా ఇదే ఫార్ములాను అవలంభిం చారు. ఆ ప్రకారం ఒక టర్మ్ శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఇప్పు డు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెన్నెస్ వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై కూడా పడే అవకాశముంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నిక ల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తే ఒప్పందం ప్రకా రం శివసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడం ఖాయం. మూడు పర్యాయాలుగా రాష్ట్రా న్ని ఏలుతున్న కాంగ్రెస్‌ను ఈసారి ఎలాగైనా గద్దె దింపి, అసెంబ్లీ భవనంపై కాషాయ జెండా రెపరెపలాండించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శివసేనకు రాజ్ కారణంగా చివరకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.