సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్‌లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్‌లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్‌నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు.
అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్‌ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్‌నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్
ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్‌లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు.
ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్‌నాథ్ శిందే
ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment