ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా.. మంత్రి పదవులపై చర్చ నడుస్తోంది. మహాయుతి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం.. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం.. 6-1 ఫార్ములాను అమలు చేసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. మూడు పార్టీల నుంచి ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.
ఈ లెక్క ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక స్థానాల్లో(132) బీజేపీ విజయం సాధించడంతో కాషాయ పార్టీలో 20-22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్‌నాథ్ షిండే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 9-10 పదవులు దక్కే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే, శాఖలపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. కీలక శాఖలు బీజేపీకే దక్కే చాన్స్ ఉంది. దీంతో, శివసేన, ఎన్‌సీపీలకు ఏయే శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment